వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మియన్మార్: ‘‘నేనే ఆ అమ్మాయిని సజీవ దహనం చేశాను. ఆమె అరుపులు, కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి’’- ఓ మాజీ సైనికుడి ఒప్పుకోలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మియన్మార్

మియన్మార్ సైనికులు కొందరు తాము సామాన్య పౌరులను చంపామని, హింసించామని, అత్యాచారాలకు పాల్పడ్డామని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నారు. మొదటిసారిగా వారు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనల వివరాలు అందించారు. ఇలాంటి హింసకు పాల్పడాల్సిందిగా తమకు పై నుంచి ఆదేశాలు అందినట్టు చెప్పారు. అయితే, ఈ వార్తలను మియన్మార్ సైనిక ప్రభుత్వం ఖండిస్తోంది.

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక హింస, చిత్రహింసలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

"అమాయక ప్రజలను దోచుకోమని, చంపమని, చిత్రహింసలకు గురిచేయమని నన్ను ఆదేశించారు" అంటూ మాంగ్ ఊ చెప్పుకొచ్చారు.

తనను సైన్యంలో గార్డుగా నియమించారని మాంగ్ ఊ భావించారు. కానీ, 2022 మేలో ఒక మఠంలో దాక్కున్న పౌరులను చంపిన బెటాలియన్‌లో ఆయన భాగమయ్యారు.

"అక్కడ ఉన్నవారందరినీ చుట్టుముట్టి, కాల్చి చంపమని మాకు ఆదేశాలిచ్చారు. బాధకరమైన విషయం ఏమిటంటే, వృద్ధులను, ఒక మహిళను కూడా చంపవలసి వచ్చింది" అని మాంగ్ ఊ చెప్పారు.

ఆరుగురు సైనికులు అందించిన సాక్ష్యాలు, వారి చేతిలో హింసకు గురైన బాధితుల వివరాలు మియన్మార్‌లో సైన్యం అధికార దాహాన్ని బట్టబయలుచేస్తుంది. ఆ ఆరుగురు సైనికుల్లో ఒక కార్పొరల్ కూడా ఉన్నారు.

ఈ కథనంలో ప్రస్తావించిన వారి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు పేర్లు మార్చాం.

మియన్మార్ సైన్యం నుంచి ఇటీవల బయటికొచ్చిన సైనికులకు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్) రక్షణ అందిస్తోంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడుతున్న పౌరసైన్యమే ఈ పీడీఎఫ్.

గత ఏడాది, మియన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు చేసింది. అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు పౌరుల సాయుధ తిరుగుబాటును అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది.

మియన్మార్

'కనిపిస్తే కాల్చిపారేయమని ఆదేశాలు'

గత ఏడాది డిసెంబర్ 20న మూడు హెలికాప్టర్లు సెంట్రల్ మియన్మార్‌లోని యయ్ మైట్ గ్రామాన్ని చుట్టుముట్టాయి. పౌరులను బహిరంగంగా కాల్చి చంపమనే ఆదేశాలతో సైనికులను దించివెళ్లాయి.

ఆ రోజు ఏం జరిగిందో కనీసం అయిదుగురు వ్యక్తులు వేరు వేరుగా బీబీసీకి చెప్పారు.

సైన్యం మూడు వేర్వేరు బృందాలుగా ప్రవేశించిందని, పురుషులు, మహిళలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని వారు చెప్పారు.

"ఎవరు కనిపిస్తే వారిని కాల్చిపారేయమని మాకు ఆదేశాలు అందాయి" అని కార్పొరల్ ఆగ్ చెప్పారు. మియన్మార్ అడవిలోని ఒక మారుమూల గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఆయన మాట్లాడారు.

"కొంతమంది గ్రామస్థులు అక్కడక్కడా దాక్కున్నారు. కానీ, సైన్యం వారిని సమీపించగానే లేచి పరిగెత్తారు. వెంటనే మేం వారిని కాల్చి చంపాం" అని ఆంగ్ చెప్పారు.

తమ బృందం అయిదుగురు వ్యక్తులను తుపాకీలతో కాల్చి చంపి, పాతిపెట్టిందని ఆయన చెప్పారు.

"గ్రామంలో పెద్ద పెద్ద ఇళ్లను, భవనాలకు కూడా తగలబెట్టాలని మాకు ఆదేశాలు వచ్చాయి." అని ఆయన అన్నారు.

సైనికులు వీధి వీధీ తిరుగుతూ ఇళ్లకు నిప్పంటించారు. "కాల్చండి, కాల్చండి" అని అరుస్తూ తగలబెట్టారని ఆంగ్ చెప్పారు.

ఆంగ్ నాలుగు భవనాలకు నిప్పంటించారు. సుమారు 60 ఇళ్లు, భవనాలను తగలబెట్టారని, ఊరంతా బూడిద రేగిందని ఇంటర్వ్యూలు ఇచ్చిన సైనికులు చెప్పారు.

చాలామంది గ్రామస్థులు పారిపోయారు. ఊరి మధ్యలో ఒక ఇంటిని సైనికులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడికి కేవలం అయిదు నెలల ముందే తాను సైన్యంలో చేరానని తిహా అనే వ్యక్తి చెప్పారు. చాలామందిలాగే తనను కూడా కమ్యూనిటీ నుంచి తీసుకుని సైన్యంలో చేర్చుకున్నారని, ఏ రకమైన శిక్షణ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.

ఇలాంటి నియామకాలను స్థానికంగా "అంఘర్-సిత్-థార్" లేదా "కిరాయి సైనికులు" అని పిలుస్తారు.

ఆ సమయంలో తనకు మంచి జీతమే అందిందని, నెలకు 2,00,000 మియన్మార్ ఖాట్ (సుమారు రూ. 8,000 )లు ఇచ్చేవారని తిహా తెలిపారు.

'ఆమె అరుపులు వింటుంటే గుండె పగిలిపోయింది'

ఆరోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో తిహాకు స్పష్టంగా గుర్తుంది.

ఒక ఇంట్లోని గదిలో ఇనుప కడ్డీల వెనుక చిక్కుకున్న ఒక టీనేజీ అమ్మాయిని తిహా చూశారు. ఆ ఇంటిని తగలబెట్టడానికి సైన్యం సిద్ధమవుతోంది.

"ఆమె అరుపులు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నా మనసులో ముద్రించుకుపోయాయి" అని ఆయన చెప్పారు.

ఆ అమ్మాయి గురించి తిహా తన కెప్టెన్‌కు చెప్పారు. "కనిపించిన వారందరినీ చంపమని నీకు చెప్పాను" అన్నది కెప్టెన్ జవాబు. వెంటనే తిహ ఆ గదిలోకి మంటలు ఎగదోశారు.

కార్పొరల్ ఆంగ్ కూడా అక్కడే ఉన్నారు. ఆ పిల్ల అరుపులు విన్నారు. ఆ అమ్మాయి సజీవ దహనమయింది.

"ఆ అరుపులు వింటుంటే గుండె పగిలిపోయింది. ఇల్లు తగలబడిపోతుండగా, సుమారు 15 నిమిషాల పాటు ఆమె కేకలు వినిపిస్తూనే ఉన్నాయి" అని ఆంగ్ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

ఆ అమ్మాయి కుటుంబాన్ని బీబీసీ వెతికిపట్టుకుంది. కాలిన గుర్తులున్న తమ ఇంటి ముందు నిల్చుని వారు బీబీసీతో మాట్లాడారు.

ఆ యువతి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందుకే ఆమెను ఇంటివద్ద విడిచిపెట్టి ఆమె తల్లిదండ్రులు పనికి వెళ్లారని ఆమె బంధువు అయిన యూ మింట్ చెప్పారు.

"ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ, వాళ్లు అడ్డుకున్నారు. సజీవ దహనం చేశారు" అని మింట్ అన్నారు.

ఆ అమ్మాయి మాత్రమే కాదు, సైనికుల చేతిలో ఇలాంటి యువతీయువకులు ఎందరో బలైపోయారు.

డబ్బు కోసమే తాను సైన్యంలో చేరానని, కానీ తన చేత బలవంతంగా చేయించిన పనులు, చూసిన దారుణాలకు షాక్ అయ్యానని తిహా తెలిపారు.

మియన్మార్

'మూడు రాత్రులు రేప్ చేశారు'

యయ్ మైట్‌లో అరెస్టు చేసిన యువతుల గురించి తిహా చెప్పారు.

పై అధికారి ఆ యువతులను తన కింది అధికారులకు అప్పగించి "మీకు నచ్చింది చేసుకోండి" అని చెప్పారు.

వాళ్లంతా ఆ అమ్మాయిలపై అత్యాచారం చేశారు. అయితే, తాను అందులో భాగం పంచుకోలేదని తిహా చెప్పారు.

వారిలో ఇద్దరు యువతులను బీబీసీ గుర్తించింది.

పా పా, ఖిన్ ట్వే యయ్ మైట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, దారిలో సైనికులను కలిశారు. వాళ్లిద్దరూ యయ్ మైట్ వాసులు కారు. ఆ ఊర్లో టైలర్ దగ్గరకు వచ్చారు.

తాము పీడీఎఫ్ దళానికి చెందినవారం కాదని, ఆ గ్రామానికి చెందినవాళ్లమే కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా సైనికులు ఆ యువతులను స్థానిక స్కూల్లో బంధించి ఉంచారు. వాళ్లని మూడు రాత్రులు అక్కడే కట్టిపడేశారు. ప్రతి రాత్రి వాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

"ఒక సరంగ్ (స్టోల్ లాంటి వస్త్రం)తో నా కళ్లకు గంతలు కట్టారు. నన్ను కిందపడేసి, దుస్తులు తొలగించి, రేప్ చేశారు. నేను గట్టిగా కేకలు పెట్టాను" అని పా పా చెప్పారు.

తనను వేధించవద్దని ఆమె ఎంతో వేడుకున్నారు. కానీ, సైనికులు వినలేదు. ఆమెను కొట్టి, తలపై తుపాకీ పెట్టి బెదిరించారు.

"ఏం మాట్లాడకుండా, ప్రతిఘటించకుండా అదంతా భరించాల్సి వచ్చింది. ఏం చేసినా, చంపేస్తారేమోనని భయం" అని పా పా సోదరి ఖిన్ ట్వె చెప్పారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమెలో వణుకు కనిపించింది.

తమను వేధించిన వారి ముఖాలను నేరుగా చూసేందుకు కూడా భయపడ్డారు ఆ యువతులు. కానీ, వారిలో కొందరు మామూలు దుస్తులు ధరించారని, కొందరు మిలటరీ యూనిఫాం వేసుకున్నట్టు గుర్తుందని పా పా, ఖిన్ ట్వె చెప్పారు.

"ఆ అమ్మాయిలపై అత్యాచారం చేస్తున్నప్పుడు, 'మీరు పీడీఎఫ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నాం' అని చెప్పేవారని" తిహా చెప్పారు.

యయ్ మైట్‌లో జరిగిన హింసాకాండలో కనీసం 10 మంది పౌరులు చనిపోయారు. ఆ మూడు రోజుల్లో ఎనిమిది మంది యువతులు అత్యాచారానికి గురయ్యారు.

మియన్మార్

'పసిబిడ్డ తల్లిని చంపేశారు'

మాంగ్ ఊ పని చేస్తున్న 33వ డివిజన్ (లైట్ ఇన్‌ఫాంట్రీ డివిజన్ 33) బృందం 2022 మే 2న సాగింగ్ ప్రాంతంలోని ఓహకే ఫో గ్రామంలో దారుణ హింసాకాండకు పాల్పడింది.

మఠంలో తలదాచుకున్నవారిని చుట్టుముట్టి కాల్చి చంపినట్టు మాంగ్ ఊ చెప్పిన విషయాలు, బీబీసీ సంపాదించిన వీడియో, సాక్షులు చెప్పిన విషయాలతో సరిపోలుతున్నాయి.

ఆ వీడియోలో తొమ్మిది మృతదేహాలు వరుసగా ఒకదానికొకటి పక్కన పడిఉన్నట్టు కనిపిస్తోంది. వారిలో ఒక మహిళ, తల నెరసిన వృద్ధుడు కూడా ఉన్నారు. వారంతా సరంగులు, టీ షర్టులు వేసుకున్నారు.

వాళ్లను సమీపం నుంచి వెనకవైపు కాల్చినట్టు సంకేతాలు కనిపిస్తిన్నాయి.

ఈ దారుణాన్ని చూసిన గ్రామస్థులతో బీబీసీ మాట్లాడింది. వాళ్లు వీడియోలో కనిపిస్తున్న మహిళ మృతదేహాన్ని గుర్తుపట్టారు.

ఆమెను 'మా మో మో' అని పిలిచేవారని, ఆమెకు ఒక బిడ్డ ఉందని, చేతి సచీలో కొన్ని బంగారం ముక్కలు ఉన్నాయని తెలిసింది. తన వస్తువులను దోచుకోవద్దని ఆమె సైనికులను బతిమాలుకున్నారు.

"ఆమెకు పసిబిడ్డ ఉందని తెలిసి కూడా వాళ్లు ఆమెను దోచుకున్నారు. తుపాకీతో కాల్చి చంపారు. పురుషులను కూడా వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు" అని ప్రత్యక్ష సాక్షి లా లా చెప్పారు. లా లా అక్కడే ఉన్నారు కానీ ఆమెను చంపలేదు.

ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా, ప్రస్తుతం బంధువులు ఆదుకుంటున్నారు.

సైనికులు ఫోన్‌లో మాట్లాడుతూ ఎనిమిది, తొమ్మిది మందిని చంపామని గర్వంగా చెప్పుకోవడం విన్నానని లా లా చెప్పారు. వాళ్లను చంపడాన్ని ఆస్వాదిస్తున్నామని", అది వారికి "అత్యంత విజయవంతమైన రోజు"అని కూడా వాళ్లు ఫోన్‌లో చెప్పారు.

"విజయం! విజయం!" అని అరుచుకుంటూ వాళ్లు ఆ గ్రామం నుంచి తరలిపోయారని లా లా చెప్పారు.

మరొక మహిళ తన భర్తను తన కళ్ల ముందే చంపడం చూశారు.

"ఆయనకు తొడ మీద గురి పెట్టి కాల్చారు. తరువాత బోర్లా పడుకోమని చెప్పి పిరుదుల మీద కాల్చారు. చివరిగా తలపై కాల్చి చంపారు" అని ఆమె చెప్పారు.

ఆమె భర్త పీడీఎఫ్ సభ్యుడు కాదని ఎంత చెప్పినా వాళ్లు వినలేదు.

"మా ఆయన నిజంగా కల్లుగీత కార్మికుడు. మాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మా జీవితాలు ఎలా గడుస్తాయో తెలియట్లేదు" అంటూ ఆమె వాపోయారు.

ఆరోజు తన చర్యలకు చింతిస్తున్నానని మాంగ్ ఊ అన్నారు.

"మీకు అంతా చెప్తాను. ఈ విషయాలన్నీ అందరికీ తెలియాలి. మళ్లీ ఎవరూ అదే ఉచ్చులో పడకూడదు" అని మాంగ్ ఊ అన్నారు.

'అంతర్యుద్ధాన్ని అణచివేయడానికే ఇదంతా చేస్తున్నారు'

బీబీసీతో మాట్లాడిన ఆరుగురు సైనికులూ సెంట్రల్ మియన్మార్ అంతటా ఇళ్లు, గ్రామాలను తగులబెట్టినట్లు అంగీకరించారు. దీనిని బట్టి, ప్రతిఘటనను అణచివేయడానికి వ్యవస్థీకృతంగా ఈ ఘోరాలు తలపెట్టినట్టు తెలుస్తోంది.

అనేక వైపుల నుంచి వస్తున్న అంతర్యుద్ధంతో మిలటరీ ఇబ్బందులు ఎదుర్కుంటోందని, అందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తొందని కొందరు అంటున్నారు.

మానవ హక్కుల ఉల్లంఘనలను ట్రాక్ చేసే ఓపెన్ సోర్స్ పరిశోధకుల బృందం, మియన్మార్‌లో గత పది నెలల్లో పలు గ్రామాలు ఈ విధంగా తగలబడిపోయాయని తెలిపిన 200లకు పైగా నివేదికలను ధృవీకరించారు.

ఇలాంటి దారుణాలు వేగంగా పెరుగుతున్నాయని, జనవరి, ఫిబ్రవరిలలో కనీసం 40 దాడులు జరిగాయని, మార్చి, ఏప్రిల్ నెలల్లో 66 దాడులు జరిగాయని వారు చెబుతున్నారు.

ఇలా మంటబెట్టే విధానాలను మియన్మార్ మిలటరీ ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2017లో రఖైన్ రాష్ట్రంలో రోహింజ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా దాడులు జరిపారని నివేదికలు చెబుతున్నాయి.

మియన్మార్‌లోని కొండ ప్రాంతపు జాతులు అనేక దశాబ్దాలుగా ఇటువంటి దురాగతాలను ఎదుర్కొంటున్నాయి. ఈ జాతుల తిరుగుబాటుదారులు కొందరు ప్రస్తుతం పీడీఎఫ్ దళాలకు శిక్షణ అందిస్తున్నారు.

సైన్యం ప్రజలను ఇష్టానుసారంగా దోచుకోవడానికి, చంపడానికి అనుమతించే, శిక్షార్హత లేని సంస్కృతి ఎన్నో ఏళ్లుగా మియన్మార్‌లో పాతుకుపోయి ఉందని హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ చెబుతోంది.

అక్కడ మిలటరీ దురాగతాలకు అరుదుగా శిక్షలు పడతాయి.

అనేకమంది సైనికులు సైన్యం నుంచి పారిపోవడం లేదా పీడీఎఫ్ చేతుల్లో ప్రాణాలు కోల్పోవడంతో మియన్మార్ మిలటరీ అధిక సంఖ్యలో సైనికులను నియమించుకోవాల్సి వస్తోంది.

2021 తిరుగుబాటు మొదలుకొని, సుమారు 10,000 మంది సైనికులు సైన్యం నుంచి, పోలీసు విభాగం నుంచి పారిపోయారని పీపుల్స్ ఎంబ్రాస్ అనే గ్రూపు తెలిపింది. ఈ బృందాన్ని మాజీ మిలటరీ, పోలీసు అధికారులు ప్రారంభించారు.

"అనేక కోణాల నుంచి వస్తున్న అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవడంలో మిలటరీకి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులను కోల్పోతుంది. చాలామంది సైనికులు చనిపోతున్నారు. రిక్రూట్మెంట్‌లో సమస్యలు, పరికరాలు, సామాగ్రి అందడంలో సమస్యలు. ఈ కారణాలతో దేశంలోని చాలా ప్రాంతాల్లో సైన్యం తన పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది" అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ థింక్ ట్యాంక్‌కు చెందిన మైఖేల్ మార్టిన్ అన్నారు.

మాగ్వే, సాగైంగ్ ప్రాంతాలు (పై సంఘటనలు జరిగిన చోట) మియన్మార్ సైన్యం రిక్రూట్మెంట్‌లో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు.

అయితే, ఇక్కడ యువత సైన్యంలో కాకుండా పీడీఎఫ్‌లో చేరుతున్నారు.

సైన్యం నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో తనకు స్పష్టంగా తెలుసునని కార్పొరల్ ఆంగ్ చెప్పారు.

"దీర్ఘకాలంలో సైన్యమే గెలుస్తుందన్న నమ్మకం ఉంటే, నేను కచ్చితంగా ప్రజల వైపుకు వచ్చేవాడిని కాను" అని ఆంగ్ అన్నారు.

సైనికులు తమ స్థావరాలను ఒంటరిగా విడిచిపెట్టే ధైర్యం చేయరు. ఎందుకంటే పీడీఎఫ్ వాళ్లని చంపేస్తుందనే భయం ఉంటుందని ఆంగ్ చెప్పారు.

"మేమెప్పుడూ మిలటరీ గుంపుగానే వెళతాం. మేం ఆధిపత్యం చెలాయిస్తున్నామని ఎవరూ చెప్పలేరు" అని ఆయన అన్నారు.

మియన్మార్

అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసిన మియన్మార్ మిలిటరీ ప్రతినిధి

మా దర్యాప్తులో వచ్చిన ఆరోపణలను మియన్మార్ మిలిటరీ ప్రతినిధి జనరల్ జా మిన్ తున్‌కి అందించాం. సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందన్న వాదనను ఆయన ఖండించారు.

ఈ దర్యాప్తులో వెల్లడించిన రెండు దాడులూ చట్టబద్ధమైన లక్ష్యాలేనని, చనిపోయినవారు "ఉగ్రవాదులు" అని ఆయన అన్నారు.

సైన్యం గ్రామాలను తగులబెడుతోందన్న మాట అవాస్తవమని, పీడీఎఫ్ దళాలే కాల్పులు జరుపుతున్నారని ఆయన అన్నారు.

మియన్మార్‌లో ఈ అంతర్యుద్ధం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో చెప్పడం కష్టం. కానీ, దీనివల్ల లక్షలాది మియన్మార్ పౌరులకు వేదనే మిగులుతుందని తెలుస్తోంది.

ఇక్కడ శాంతి పునరుద్ధరణ ఎంత ఆలస్యంగా జరిగితే అంత ఎక్కువగా ఖిన్ ట్వే లాంటి మహిళలు అత్యాచారాలకు గురవుతారు.

ఆ లైంగిక హింస తరువాత తను బతికి ఉండాలని కోరుకోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఖిన్ ట్వె చెప్పారు. తనకు ఏం జరిగిందో ఆమె తన కాబోయే భర్తకు చెప్పలేకపోయారు.

గ్రాఫిక్స్: అఘ్నియా అడ్జ్కియా, అర్విన్ సుప్రియాది, డేవిస్ సూర్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Myanmar: I burned that girl alive. Her screams and cries are still ringing in my ears'' - Confession of an ex-soldier
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X