నరేంద్ర మోడీ పాకిస్థాన్‌లో పర్యటిస్తారు: సుష్మా
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం తెలిపారు.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(సార్క్) జరగనుందని దీనికి మోడీ హాజరవుతారని ఆమె చెప్పారు. ఇదే జరిగితే 2004 తర్వాత భారత్ నుంచి పాకిస్థాన్‌ను సందర్శించనున్న తొలి ప్రధాని నరేంద్ర మోడీ అవుతారు.
అంతకుముందు 2004లో అటల్ బీహారీ వాజపేయి పాక్‌ను ఇదే సార్క్ సదస్సు పేరిట సందర్శించారు. మోడీ పర్యటనలో ఆయనతోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉంటారు.

ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే.
అదే రోజు కార్యక్రమం ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ 5వ సదస్సులో 14 సభ్య దేశాలు, 17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు.
కాగా, బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన 'హార్ట్ ఆఫ్ ఏసియా' సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు వాణిజ్యపరంగా పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. 3 దేశాలూ పరస్పర అవగాహనకు వచ్చి ప్రాంతీయ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే మార్పు సాధ్యపడుతుందన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ ట్రక్కుల్ని పంజాబ్‌లోని అత్తారీ సరిహద్దుల వద్ద అనుమతించేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాణిజ్యం, రవాణా, ఇంధన వనరులు, కమ్యూనికేషన్ రూట్లు తదితరాల్ని పొరుగు దేశాలతో పరస్పర అవగాహన ద్వారా మెరుగుపరుచుకోవాలన్నదే భారత్ అభిలాష అని సుష్మా స్వరాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications