చంద్రుడిపైకి స్పేస్ టూరిస్టులు: నాసా కొత్త ప్రాజెక్ట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. చంద్రుడి మీదకు భారీ రాకెట్‌ను పంపించనుంది. ఈ నెల 29వ తేదీన ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి సన్నాహాలు చేపట్టింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్)గా పేరు పెట్టిన ఈ రాకెట్‌ను ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. ఈ రాకెట్ పొడవు సుమారు 100 మీటర్లు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయింది. 10 యూరోప్ దేశాలు దీనికోసం పని చేస్తోన్నాయి.
లాంచ్‌ప్యాడ్ వద్దకు..
కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి లాంచ్ ప్యాడ్ మీదికి ఈ రాకెట్‌ను తరలించడానికి భారీ ట్రక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని మీద లాంచ్ ప్యాడ్ 39బీకి తరలించింది. గంటకు ఒకటి నుంచి మూడున్నర కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన ఈ ట్రక్.. అమెరికా కాలమానం ప్రకారం- బుధవారం తెల్లవారు జామున లాంచ్ ప్యాడ్‌కు చేరుకుంది. మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి లాంచ్ ప్యాడ్ మధ్యగల దూరం 6.7 కిలోమీటర్లు.
29న ప్రయోగం..
లాంచ్ ప్యాడ్ మీదికి చేరిన తరువాత ఈ రాకెట్‌లో కొన్ని పరీక్షలను చేపట్టారు నాసా శాస్త్రవేత్తలు. తొలిదశలో మానవ రహితంగా అంటే వ్యోమగాములు గానీ, ఇతర సిబ్బంది గానీ ఎవరూ లేకుండా ఈ రాకెట్‌ను పరీక్షిస్తారు. ఆ తరువాతి దశల్లో వ్యోమగాములతో కూడిన పరీక్షలను చేపడతారు. ఈ నెల 28వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. 29వ తేదీన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఈ రాకెట్ ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపిస్తారు. ఆ రోజున వాతావరణం అనుకూలించకపోతే సెప్టెంబర్ 2, లేదా 5వ తేదీన ప్రయోగిస్తారు.
50 సంవత్సరాలు..
నిజానికి- చంద్రుడిపై మనుషులను పంపించడం నాసాకు కొత్తేమీ కాదు. ఇదివరకు అపోలో 17 మిషన్ ద్వారా వారిని చంద్రమండలంపైకి పంపించింది. ఈ ప్రయోగం ముగిసి వచ్చే డిసెంబర్ నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజా ప్రయోగాన్ని చేపట్టారు నాసా శాస్త్రవేత్తలు. 50 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా సమాయాత్తమౌతోంది.
2030 నాటికి స్పేస్ టూరిస్టులు..
ఈసారి మూన్ మిషన్‌కు ఆర్టెమిస్- 1 అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. గ్రీకు పురాణాల్లో ఒక దేవుడైన 'అపోలో'కు కవల సోదరి ఆర్టెమిస్. 2030 నాటికి అంగారకుడి మీదకు అంతరిక్ష యాత్రికులను పంపించాలనే ఉద్దేశంలో భాగంగా నాసా తాజాగా ఈ మూన్ మిషన్‌ను చేపట్టింది. వ్యోమగాములను మాత్రమే కాకుండా- కొన్ని రకాల పరికరాలు, సరకులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లేలా ఈ స్పేస్ లాంచ్ సిస్టమ్‌ను నాసా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
క్రూ కెపాసిటీ పెంపు..
క్రూ కాప్స్యూల్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఎక్కువమంది ప్రయాణించేలా రూపొందించారు. ఒరియన్ పేరుతో మరోసారి మానవ సహిత మూన్ మిషన్‌కు శ్రీకారం చుట్టామని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పేర్కొన్నారు. 2024లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా వ్యోమగాములను పంపిస్తామని వివరించారు. ఆ మరుసటి ఏడాదే అంటే 2025లో ఆర్టెమిస్- 3 మిషన్ చేపడతామని ఆయన వివరించారు. చంద్రుడి వెనుక కక్ష్యలోకి ఆర్టెమిస్‌ను పంపించడం.. అక్కడి నుంచి మళ్లీ వ్యోమగాములను భూమిపైకి తీసుకుని రావడం అనేది అతి పెద్ద టాస్క్‌గా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications