విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేవీ డే: ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలని వచ్చిన పాకిస్తాన్ జలాంతర్గామి 'ఘాజీ' విశాఖపట్నంలో ఎలా జలసమాధి అయ్యింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఘాజీ జలాంతర్గామి

అది 1971 నవంబర్ 8. పాకిస్తాన్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ కెప్టెన్ జఫర్ మొహమ్మద్ ఖాన్ హైరోడ్‌లో ఉన్న గోల్ఫ్ క్లబ్‌లో అప్పుడే గోల్ఫ్ ఆట మొదలెట్టారు.

అంతలోనే ఆయనకు ఒక సందేశం వచ్చింది. వెంటనే లియాకత్ బ్యారెక్‌లోని నౌకాదళం హెడ్ క్వార్టర్స్‌కు రావాలని ఆదేశించారు.

భారత నావికా దళం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నాశనం చేసే బాధ్యతలను నావికా దళం చీఫ్ నీకు అప్పగించారని అక్కడున్న నావెల్ వెల్‌ఫేర్ అండ్ ఆపరేషన్ ప్లాన్స్ డైరెక్టర్ కెప్టెన్ భోంబల్ ఆయనకు చెప్పారు. ఒక కవర్ తీసి జఫర్‌ చేతికిస్తూ "విక్రాంత్ గురించి ఇందులో తగినంత సమాచారం ఉంది" అన్నారు.

ఘాజీలో పనిచేసే నావికా దళం సైనికులు అందరికీ సెలవులు రద్దు చేయాలని జఫర్‌కు చెప్పారు. మీకు అప్పగించిన పని మరో పదిరోజుల్లో పూర్తయ్యేలా ఏదోఒకటి చేయాలని ఆదేశించారు.

యుద్ధం జరిగిన 20 ఏళ్లకు ప్రచురితమైన 'ద స్టోరీ ఆఫ్ ద పాకిస్తాన్' నేవీ పుస్తకంలో ఈ వివరాలు రాశారు.

నవంబర్ 14 నుంచి 24 మధ్య తమ జలాంతర్గాములన్నింటినీ వాటికి ముందే నిర్ణయించిన గస్తీ ప్రాంతాలు చేరుకోవాలని పాకిస్తాన్ నావికా దళం నుంచి ఆదేశాలు వచ్చాయి.

ఘాజీని సుదూరంగా బంగాళాఖాతం వైపు వెళ్లాలని చెప్పారు. అక్కడ ఐఎన్ఐస్ విక్రాంత్‌ను వెతికి, దానిని నాశనం చేసే బాధ్యతను దానికి అప్పగించారు.

ఈ నిర్ణయం గురించి ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తలేదు. ఎందుకంటే పాకిస్తాన్ జలాంతర్గాముల్లో అంత దూరం వెళ్లి శత్రు జలాల్లో లక్ష్యాన్ని ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నది ఘాజీకి మాత్రమే.

విక్రాంత్‌ను అది సముద్రంలో ముంచినా, దానికి నష్టం కలిగించినా భారత నావికా దళం ప్రణాళికలకు చాలా నష్టం జరిగేది.

తమ ప్లాన్ విజయవంతం అవుతుందని పాక్ చాలా నమ్మకంగా ఉంది. అందుకే, దీనిపై చాలా ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ఈ మిషన్ అమలుకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు.

ఐఎన్ఎస్ విక్రాంత్

విక్రాంత్ బాయిలర్‌లో రిపేర్

కమాండర్ జఫర్, కెప్టెన్ బోంబల్ మధ్య జరిగిన ఈ సంభాషకు ఏడాది ముందు, ఐఎన్ఎస్ విక్రాంత్ కమాండర్ కెప్టెన్ అరుణ్ ప్రకాశ్, తమ చీఫ్ ఇంజనీర్ పంపించిన రిపోర్ట్ చదువుతున్నారు.

విక్రాంత్ బాయిలర్ వాటర్ డ్రమ్‌కు క్రాక్ ఉందని ఆయన దాన్లో చెప్పారు. దాన్ని భారత్‌లో రిపేర్ చేయడం కుదరదు. 1965లో కూడా విక్రాంత్‌లో కొన్ని మెకానికల్ సమస్యలు తలెత్తడంతో అది యుద్ధంలో పాల్గొనలేదని భావించారు.

ఈసారీ బాయిలర్‌లో క్రాక్ రావడంతో విక్రాంత్ గరిష్టంగా 12 నాట్స్ వేగంతో నడుస్తోంది. ఒక విమానవాహక నౌక మీద నుంచి యుద్ధ విమానాలు టేకాఫ్ కావాలంటే అది 20 నుంచి 25 నాట్స్ వేగంతో వెళ్తుండం తప్పనిసరి.

విక్రాంత్ పాత పేరు హెచ్ఎంఎస్ హెర్కులెస్. భారత్ దీనిని 1957లో బ్రిటన్ నుంచి కొనుగోలు చేసింది. దీనిని 1943లో నిర్మించారు. కానీ, అది రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనలేకపోయింది.

ఘాజీ బయల్దేరిన సమయంలో విక్రాంత్ పశ్చిమ ఫ్లీట్‌లో మొహరించి ఉంది. కానీ రిపేర్లు వస్తుండడంతో దానిని తూర్పు ఫ్లీట్‌తో చేర్చడమే మంచిదని భారత నావికా దళం హెడ్ క్వార్టర్స్ నిర్ణయించింది.

ఐఎన్ఎస్ విక్రాంత్

బొంబాయి నుంచి మాయమైన విక్రాంత్

ఇయాన్ కార్డోజో తన '1971 స్టోరీస్ ఆఫ్ గ్రిట్ అండ్ గ్లోరీ ఫ్రమ్ ఇండో పాక్ వార్' పుస్తకంలో ఆ నాటి విషయాలు రాశారు.

"1971 నవంబర్‌లో బొంబాయిలోని ఒక హోటల్లో ఉన్న పాకిస్తాన్ గూఢచారులు విక్రాంత్ ఇక్కడే ఉందని తమ హాండ్లర్స్‌కు సమాచారం అందించారు. కానీ నవంబర్ 13న వారికి అక్కడ విక్రాంత్ కనిపించలేదు. అది హఠాత్తుగా మాయమైంది. మరోవైపు పాకిస్తాన్‌ సానుభూతి పరుడైన ఒక పశ్చిమ దేశ అసిస్టెంట్ నావెల్ అటాచీ 'విక్రాంత్ ఇప్పుడు ఎక్కడ ఉంది' అని పశ్చిమ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ దగ్గర పనిచేసే ఏడీసీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు" అని కార్డోజో చెప్పారు.

ఆ పశ్చిమ దేశం ఏది అనే విషయం ఆయన వివరించలేదు.

భారత నావీ ఇంటెలిజెన్స్‌కు వెంటనే ఆ సమాచారం అందింది. తర్వాత, విక్రాంత్ మద్రాస్ చేరినట్లు పాకిస్తాన్ గూడచారులకు తెలిసింది.

అదే సమయంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న ఆ పశ్చిమ దేశానికి చెందిన ఒక నౌక మద్రాస్ వెళ్లడం, అక్కడ దానికి కొన్ని రిపేర్లు రావడం, మరమ్మతుల తర్వాత టెస్ట్ రన్‌లో భాగంగా అది మద్రాస్ రేవు చుట్టుపక్కలే చక్కర్లు కొట్టడం జరిగింది.

అదంతా యాదృచ్చికమేనా? లేక విక్రాంత్ మద్రాస్‌లో ఉందా లేదా అని తెలుసుకోవడమే ఆ పరీక్షల ఉద్దేశమా?

ఐఎన్ఎస్ విక్రాంత్

పాకిస్తాన్ రహస్య కోడ్ గుట్టు విప్పిన భారత్

1971 నవంబర్ 8న రహస్య సందేశాలు వినే పనిలో ఉన్న మేజర్ ధర్మదేవ్ దత్త్ తన రకాల్ ఆర్ఏ 150 రేడియో రిసీవర్ నాబ్స్ తిప్పుతూ కరాచీ, ఢాకా మధ్య వెళ్లే సందేశాలు వినడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సందేశాలు ఒక్కసారిగా పెరగడంతో.. ఏదో పెద్ద ఘటన జరగబోతోందని, భారత్ అదేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయనకు అర్థమైంది.

ఎన్డీఏ శిక్షణ సమయంలోనే ధర్మదేవ్‌ను ఆయన స్నేహితులు త్రీడీ అని పిలిచేవారు. ఎందుకంటే అధికారిక రికార్డుల్లో ఆయన పేరు ధర్మ్ దేవ్ దత్త్ అని ఉంది. ఆయన టేప్ రికార్డర్‌ ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌కు లింకయి ఉంది. నవంబర్ 10న ఆయన పాకిస్తాన్ నావికాదళం కోడ్ డీకోడ్ చేయడంలో విజయవంతం అయ్యారు. చిక్కుముడి మొత్తం ఒక్క క్షణంలో విడిపోయింది.

ధర్మదేవ్ తూర్పు కమాండ్ స్టాఫ్ ఆఫీసర్ జనరల్ జాకబ్‌కు ఫోన్లో ఒక కోడ్ వర్డ్ చెప్పారు. పాకిస్తాన్ నావీ కోడ్ డీకోడ్ చేశాం అని దానికి అర్థం. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ముంచేయడమే పాకిస్తాన్ నౌకాదళం ప్రధాన లక్ష్యం అని మొదటిసారి అప్పుడే తెలిసింది. తమ డాఫ్నే క్లాస్ జలాంతర్గాములు ఉపయోగించి భారత పశ్చిమ ఫ్లీట్ యుద్ధనౌకలను ముంచేయాలని కూడా పాక్ అనుకుంది.

ఇయాన్ కార్డోజో రచన

శ్రీలంకలో ఇంధనం నింపుకున్న ఘాజీ

ఘాజీ తన మిషన్ కోసం 1971 నవంబర్ 14న కరాచీ నుంచి బయల్దేరింది. మొదట శ్రీలంక వెళ్లిన అది త్రింకోమలీలో నవంబర్ 18న ఇంధనం నింపుకుంది. చెన్నైకి బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో విక్రాంత్ మద్రాసులో లేదని, అది మాయమైందని దానికి కరాచీ నుంచి సందేశం అందింది.

అయితే మాకు తర్వాత సందేశం ఏంటి అని జఫర్ కరాచీకి మెసేజ్ పంపించాడు. కరాచీ నుంచి పాకిస్తాన్ తూర్పు ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ మొహమ్మద్ షరీఫ్‌కు ఒక కోడెడ్ సందేశం వెళ్లింది. మీ దగ్గర విక్రాంత్ కదలికల గురించి ఏదైనా సమాచారం ఉందా అని అడిగింది.

త్రీడీ ఈ మొత్తం సందేశాలను మానిటర్ చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు కోడెడ్ భాషలో నావికా దళం హెడ్ క్వార్టర్స్‌కు పంపిస్తున్నారు.

కానీ, పాకిస్తాన్ కూడా భారత్ సందేశాలను మానిటర్ చేస్తోంది. విక్రాంత్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉందని కరాచీ నుంచి కమాండర్ జఫర్ ఖాన్‌కు సందేశం అందింది.

విక్రాంత్‌ను నాశనం చేయడానికి విశాఖపట్నం కంటే మంచి అవకాశం దొరకదని పాకిస్తాన్ నావికాదళం హెడ్ క్వార్టర్స్‌, ఘాజీ కెప్టెన్ ఇద్దరికీ అనిపించింది.

ఆ విషయం తెలీగానే త్రీడీ చాలా ఆందోళనకు గురయ్యారని ఇయాన్ కార్డోజో రాశారు.

"విక్రాంత్ లొకేషన్ పాకిస్తానీలకు తెలిసిపోయింది. వారి నుంచి తప్పించుకోడానికి భారత్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని ఆయన ఆర్మీ సిగ్నల్ ఇంటెలిజెన్స్‌కు చెప్పారు.

ఘాజీ విశాఖపట్టణం చేరిన మార్గం

డిసెంబర్ 1 రాత్రి విశాఖపట్నం చేరిన ఘాజీ

1971 నవంబర్ 23న ఘాజీ త్రింకోమలి నుంచి విశాఖపట్నం వైపు కదిలింది. నవంబర్ 25న చెన్నై దాటిన అది డిసెంబర్ 1న రాత్రి 11.45కు విశాఖపట్నం రేవు నావిగేషన్ చానల్లోకి ప్రవేశించింది.

మేజర్ జనరల్ ఫజల్ ముకీమ్ ఖాన్ తన 'పాకిస్తాన్ క్రైసిస్ ఇన్ లీడర్‌షిప్' పుస్తకంలో ఆనాటి ఘటనల గురించి రాశారు.

అక్కడొక సమస్య వచ్చింది. నావిగేషన్ చానల్లో లోతు తక్కువగా ఉండడం వల్ల ఘాజీ రేవుకు 2.1 నాటికల్ మైళ్ల వరకే వెళ్లగలదు. అంతకంటే ముందుకు వెళ్లలేదు. దాంతో, అక్కడే ఉండి విక్రాంత్ బయటికి వచ్చేవరకూ వేచిచూడాలని కమాండర్ జఫర్ నిర్ణయించుకున్నారు.

ఈలోపు ఘాజీలో వెలువడిన పొగలవల్ల లోపలున్న సైనికుల ఆరోగ్యంతోపాటూ జలాంతర్గామి భద్రత కూడా ప్రమాదంలో పడవచ్చని దానిలోని మెడికల్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేశారు.

దాంతో, రాత్రిపూట సముద్రం పైకి వచ్చి తాజా గాలి తీసుకోవచ్చని, ఆ సమయంలో బ్యాటరీలు కూడా మార్చేయాలని జఫర్ సలహా ఇచ్చారు.

ఘాజీలోని సైనికుల ఆరోగ్యం పాడయ్యింది

జలాంతర్గామిలో హైడ్రోజన్ స్థాయి నిర్ధరిత భద్రతా ప్రమాణాలు దాటితే ఘాజీనే ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కమాండర్ ఖాన్‌కు కూడా అర్థమైంది.

కానీ, పగటి వెలుతురులో ఘాజీ పైకి వస్తే అది కనిపిస్తుందని జఫర్‌కు తెలుసు. ఘాజీ ఒక పెద్ద జలాంతర్గామి. దానిని దూరం నుంచి కూడా సులభంగా గుర్తించవచ్చు.

జలాంతర్గామి లోపల గాలి ఘోరంగా కలుషితం అయ్యిందని, దానివల్ల ఒక నావీ సైనికుడు స్పృహ తప్పాడని సాయంత్రం 5 గంటలకు జలాంతర్గామి ఎగ్జిక్యూటివ్ అధికారి, మెడికల్ ఆఫీసర్ ఇద్దరూ కెప్టెన్ జఫర్ ఖాన్‌కు చెప్పారు.

చీకటిపడేవరకూ వేచిచూసే సమయం లేదని, ఘాజీని వెంటనే పైకి తీసుకెళ్లాలని వారు ఆయనకు సూచించారు. కానీ, ఈలోపు జలాంతర్గామిలోపల గాలి మరింత కలుషితం అవుతూ వచ్చింది. చాలా మంది నావికులు దగ్గుతున్నారు. ఆ ప్రభావం వాళ్ల కళ్లలో కూడా కనిపిస్తోంది.

ఘాజీ దిశగా వస్తున్న భారత యుద్ధ నౌక

దాంతో, ఘాజీని పెరిస్కోప్ స్థాయికి తీసుకెళ్లి మొదట బయట పరిస్థితి అంచనా వేద్దామని కెప్టెన్ జఫర్ ఖాన్ ఆదేశాలు ఇచ్చారు.

ఘాజీ మెల్లమెల్లగా సముద్రగర్భం నుంచి ఉపరితలానికి 27 అడుగుల కిందివరకూ తీసుకొచ్చారు. అక్కడ నుంచి పెరిస్కోప్‌లో బయటకు చూసిన కెప్టెన్ జఫర్ ఒక్కసారిగా అదిరి పడ్డారు.

కిలోమీటర్ దూరంలోనే ఒక భారీ భారత యుద్ధ నౌక తమవైపే వస్తుండడం ఆయనకు కనిపించింది.

జఫర్ ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఘాజీని లోపలకు తీసుకెళ్లాలని చెప్పారు. జఫర్ ఆదేశాలిచ్చిన 90 సెకన్లలో ఘాజీ తిరిగి సముద్రం అడుగుకు చేరుకుంది.

తర్వాత నిమిషానికే భారత యుద్ధనౌక ఘాజీ మీదుగా వెళ్లింది. కెప్టెన్ ఖాన్ పరిస్థితి కుదురుకునేవరకూ వేచిచూస్తున్నారు.

ఈలోపు, ఘాజీలో పరిస్థితి మరింత ఘోరంగా మారిందని మెడికల్ ఆఫీసర్ చెప్పాడు. ఉపరితలానికి వెళ్లడం తప్పనిసరి అయ్యేలా ఉందని అన్నారు.

డిసెంబర్ 3-4 మధ్య అర్థరాత్రి 12 గంటలకు తాము సముద్రం ఉపరితలానికి వెళ్లాలని, నాలుగు గంటల మరమ్మత్తుల తర్వాత ఉదయం 4 గంటలకు మళ్లీ లోపలికి వెళ్లిపోవాలని వాళ్లు అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఈలోపు మీరు మీ కుటుంబ సభ్యులకు లేఖలు రాసుకోవచ్చని, తిరిగి వెళ్లేటపుడు వాటిని త్రింకోమలిలో పోస్ట్ చేద్దామని జఫర్ సైనికులకు చెప్పారు.

ఇందిరాగాంధీ

ఇందిరాగాంధీ ప్రసంగం మధ్య పేలుడు శబ్దం

డిసెంబర్ 3న సాయంత్రం 5.45కు పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసిందనే విషయం జఫర్‌కు తెలీదు.

పాకిస్తాన్ వైస్ అడ్మిరల్ ముజఫర్ హుసేన్ కరాచీలోని తన కార్యాలయంలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు. విక్రాంత్‌ను నాశనం చేసినట్లు జఫర్ దగ్గర్నుంచి వచ్చే సందేశం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. కానీ ఘాజీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు.

డిసెంబర్ 3-4 అర్థరాత్రి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసిందనే విషయం చెప్పారు.

ప్రధానమంత్రి ప్రసంగిస్తూనే ఉన్న సమయంలో విశాఖపట్టణం రేవుకు కొంత దూరంలో ఒక పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడు ఎంత పెద్దదంటే ఆ ధాటికి రేవు ఎదురుగా ఉన్న ఇళ్ల అద్దాలు కూడా బద్దలయ్యాయి.

సముద్రంలో నీళ్లు చాలా ఎత్తుకు ఎగిరి మళ్లీ కిందపడడాన్ని చాలా మంది దూరం నుంచే చూశారు. కొంతమంది భూకంపం వచ్చిందేమోనని భయపడ్డారు. మరికొందరు పాకిస్తాన్ వైమానిక దళం బాంబులు వేస్తోందని అనుకున్నారు.

ఆ పేలుడు రాత్రి 12.15కు జరిగిందని తెలిసింది. తర్వాత ఘాజీలో కూడా సరిగ్గా అదే సమయానికి ఆగిపోయిన ఒక గడియారం దొరికింది. డిసెంబర్ 4న మధ్యాహ్నం కొంతమంది జాలరులు సముద్రంలో తమకు దొరికిన ఘాజీకి సంబంధించిన కొన్ని శిథిలాలు ఒడ్డుకు తీసుకొచ్చారు.

విక్రాంత్‌ను రహస్యంగా అండమాన్ పంపించారు

ఈ కథలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే, ఘాజీ అక్కడికి చేరుకున్న సమయానికి విక్రాంత్‌ అసలు విశాఖపట్టణంలో లేదు. పాక్ జలాంతర్గామి విక్రాంత్ కోసం వెతుకుతోందనే విషయం తెలీగానే దాన్ని అండమాన్ దీవుల దగ్గరకు పంపించేశారు.

దాని స్థానంలో విధ్వంసక నౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను అక్కడ మోహరించారు. దాని ద్వారా విక్రాంత్ అక్కడే ఉందని పాకిస్తానీలను బోల్తా కొట్టించారు.

1971 తూర్పు నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎన్.కృష్ణన్ తన ఆత్మకథ 'ఎ సెయిలర్స్ స్టోరీ'లో ఆనాటి ఘటనల గురించి రాశారు.

ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను విశాఖపట్నం నుంచి 160 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాం. దానిలోని వారికి విక్రాంత్ కాల్ సైన్ ఉపయోగించాలని చెప్పాం. అదే రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి విక్రాంత్ లాంటి ఒక భారీ నౌకకు అవసరం అయినట్లు భారీగా సరుకులు కావాలని అధికారులను అడగాలని చెప్పాం.

విక్రాంత్ ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉందని పాకిస్తాన్ గూఢచారులకు అనిపించేలా అక్కడ మార్కెట్లో భారీ స్థాయిలో సరుకులు, మాంసం, కూరగాయలు కొన్నాం. భారీ వైర్‌లెస్ ట్రాఫిక్‌తో అక్కడ ఒక పెద్ద నౌక ఉందని పాకిస్తానీలకు అనిపించేలా చేశాం.

విక్రాంత్ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఒక నావికుడితో వాళ్ల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతూ ఉద్దేశపూర్వకంగా ఒక టెలిగ్రాం చేయించాం. ఈ నకిలీ ఆపరేషన్‌కు ఘాజీ శిథిలాల్లో కరాచీ నుంచి వచ్చిన ఒక సిగ్నల్ ద్వారా రుజువులు లభించాయి. అందులో 'ఇంటెలిజెన్స్ ఇండికేట్ కేరియర్ ఇన్ పోర్ట్' అని ఉంది. అంటే నిఘా సమాచారం ప్రకారం నౌక రేవులోనే ఉంది అని అర్థం.

వైస్ అడ్మిరల్ ఎన్.కృష్ణన్

హైడ్రోజన్ స్థాయి పెరగడంతో ఘాజీలో పేలుడు

ఘాజీ మునిగిపోవడానికి కారణాలను అంచనా మాత్రమే వేయగలం.

భారత నావికాదళం మొదట ఘాజీని ముంచేసిన క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించింది. ఘాజీని తమ యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్‌పుత్ ముంచేసిందని చెప్పాలనుకుంది.

కానీ, ఘాజీ తను తవ్విన గోతిలో తానే పడిందనే అంచనాలు కూడా ఉన్నాయి. జలాంతర్గామి తీసుకువెళ్తున్న ల్యాండ్‌ మైన్స్ హఠాత్తుగా పేలడంతో ఘాజీ జలసమాధి అయ్యిందని కూడా భావించారు.

ఇక చివరగా జలాంతర్గామిలో హైడ్రోజన్ గ్యాస్ స్థాయికి మించి చేరిందని, దానివల్లే అది పేలిపోయిందని కూడా చెప్పారు.

ఘాజీ శిథిలాలను పరిశీలించిన చాలా మంది భారత అధికారులు, డైవర్లు ఘాజీ చివరి కారణం వల్లే పేలిపోయి ఉండచ్చని భావించారు.

ఘాజీ శిథిలాలపై జరిగిన పరిశోధనల్లో టార్పెడోలను ఉంచే ప్రదేశంలో కాకుండా ఘాజీ మధ్యలో విరిగిందని. టార్పెడోలు లేదా మందుపాతరలు ఉండే ప్రాంతంలో పేలుడు జరిగుంటే జలాంతర్గామి ముందు భాగానికి నష్టం జరిగేదని చెప్పారు.

దీంతోపాటూ ఘాజీలో ఉన్న మెసేజ్ లాగ్ బుక్‌లో కూడా జలాంతర్గామి లోపల స్థాయికంటే ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ నిండుతోందని ఎక్కువ మేసేజులు వెళ్లినట్లు ఉంది.

విశాఖ రేవు

ఘాజీ మునిగిపోవడంపై ప్రశ్నలు

ఘాజీ డిసెంబర్ 3-4 అర్థరాత్రి సముద్రంలో మునిగిపోయినా, భారత నావికాదళం హెడ్ క్వార్టర్స్‌కు ఆ సమాచారం మొదట డిసెంబర్ 9న తెలిసింది.

ఘాజీ మునిగిపోవడానికి, భారత ప్రకటనకు మధ్య ఆరు రోజుల వ్యవధి ఉండడంపై ఎన్నో ప్రశ్నలు వచ్చాయని వైస్ అడ్మిరల్ జీఎన్ హీరానందానీ తన 'ట్రాన్సిషన్ టూ ట్రయంఫ్ ఇండియన్ నేవీ 1965-1975'లో రాశారు.

"అవి బహుశా యుద్ధ ప్రకటనకు ముందే ఘాజీ మునిగిపోయి ఉండచ్చనే అంచనాలకు కారణమయ్యింది. తర్వాత ఘాజీ కరాచీని సంప్రదించకపోవడంతో ఆ అంచనాలకు బలం లభించింది. డిసెంబర్ 9న భారత యుద్ధనౌక ఖుఖ్రీ మునిగిపోవడంతో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే, ఘాజీని ముంచామని భారత్ ప్రకటించినట్లు కూడా కొన్ని వర్గాలు చెప్పాయి"

కానీ, ఏదైనా ప్రకటించడానికి ముందు అన్ని ఆధారాలతో దానిని ధ్రువీకరించుకోవాలని తాము భావిస్తామని భారత్ సమాధానం ఇచ్చింది.

సముద్రంలో ఘాజీ గురించి తెలుసుకోడానికి కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ సమయంలో సముద్రం అలలు చాలా వేగంగా ఉన్నాయి.

మునిగిపోయిన జలాంతర్గామి ఘాజీనే అని భారత డైవర్లకు డిసెంబర్ 5న పక్కా ఆధారాలు లభించాయి. తర్వాత మూడు రోజులకు డైవర్లు జలాంతర్గామి కోనింగ్ టవర్ హాచ్ తెరవడంలో సఫలం అయ్యారు. అదే రోజు జలాంతర్గామి నుంచి మొదటి శవాన్ని కూడా బయటకు తీశారు.

వైస్ అడ్మిరల్ జీఎం హీరానందానీ

అమెరికా, పాకిస్తాన్ ప్రతిపాదనలు తోసిపుచ్చిన భారత్

ఘాజీ ఇప్పటికీ విశాఖపట్నం రేవుకు సమీపంలోనే సముద్రంలో ఉంది.

ఈ జలాంతర్గామి అమెరికాకు చెందినదని, దానిని పాకిస్తాన్‌కు లీజుకు ఇచ్చామని చెప్పిన అమెరికన్లు తమ ఖర్చులతో ఘాజీని బయటకు బయటకు తీస్తామని భారత్‌కు ఒక ప్రతిపాదన చేశారు.

కానీ, భారత్ దానిని తోసిపుచ్చింది. ఘాజీ అక్రమంగా భారత జలాల్లోకి ప్రవేశించిందని, పాకిస్తాన్ భారత్ మీద దాడులు చేసిన తర్వాత దానిని ధ్వంసం చేశామని చెప్పింది.

పాకిస్తాన్ కూడా తమ ఖర్చుతో ఘాజీని బయటకు తీస్తామని భారత్‌కు ప్రతిపాదనలు పంపింది. కానీ భారత్ వారికి కూడా అమెరికన్లకు ఇచ్చిన సమాధానమే ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Navy Day: How the Pakistani submarine 'Ghazi', which came to destroy INS Vikrant, sank in Visakhapatnam?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X