Currency: నాణేలపై దేశ పటం రద్దు.. ఆ బౌద్ధ మఠం బొమ్మ ప్రత్యక్షం!
మన పొరుగుదేశమైన నేపాల్ తన దేశీయ కరెన్సీ నాణేల విషయంలో ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన నిర్ణయం తీసుకుంది. ఇకపై మార్కెట్లోకి వచ్చే ఒక రూపాయి, రెండు రూపాయల నాణేలపై కనిపించే దేశ పొలిటికల్ మ్యాప్ పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో ఏడవ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన బౌద్ధ మఠం (మానెస్టరీ) చిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని నేపాల్ మంత్రివర్గ సమావేశంలో కీలక ఆమోదం లభించింది.
ఈ డిజైన్ మార్పుల ప్రక్రియను వేగవంతం చేయాలని నేపాల్ కేంద్ర బ్యాంక్ అయిన 'నేపాల్ రాష్ట్ర బ్యాంక్' (NRB) కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త నాణేలు మరింత సురక్షితమైన ఫీచర్లతో పాటు, నాణ్యమైన రీతిలో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాణేల రూపకల్పన మార్పుతో పాటు, చెలామణిలో ఉన్న చిన్న మొత్తాల కరెన్సీ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.

లో ఘ్యాకర్ (ఘర్) మఠానికి అరుదైన గౌరవం
ఈ కొత్త నాణేల ముందు భాగంలో ముస్తాంగ్ ప్రాంతంలోని మరాంగ్ గ్రామంలో ఉన్న చారిత్రక 'లో ఘ్యాకర్ (ఘర్) మఠం' చిత్రం కొలువుదీరనుంది. ఏడవ శతాబ్దంలో గురు పద్మసంభవుడు నిర్మించినట్లు భావిస్తున్న ఈ మఠం, నేపాల్ లోనే అతి పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ప్రసిద్ధ మఠం యొక్క చారిత్రక, సంస్కృతిక ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసే ఉద్దేశంతోనే దీనిని నాణేలపై చెక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐదేళ్ల తర్వాత మారిన 'వివాదాస్పద' పటం
గతంలో 2020లో రాజ్యాంగ సవరణల అనంతరం విడుదల చేసిన 'చుచ్చె' (పొలిటికల్) మ్యాప్‌లో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను నేపాల్ తమ సరిహద్దులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఆ పటంతో కూడిన నాణేలు 2021 (2078 BS) నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే, దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఆ మ్యాప్ స్థానంలో ఇప్పుడు చారిత్రక బౌద్ధ మఠం బొమ్మ ప్రత్యక్షం కానుంది.












Click it and Unblock the Notifications