ఆఫ్గనిస్తాన్ కొత్త అధ్యక్షుడు అతనే-చివరి నిమిషంలో తెర పైకి ఆ పేరు-మంత్రి పదవులు ఎవరెవరికంటే...
ఆఫ్గనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గత వారమే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్నా అంతర్గత విభేదాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు కాకుండా మరొకరికి అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు తాలిబన్లు నిర్ణయించినట్లు ఆ కథనాలు చెబుతున్నాయి.

అధ్యక్షుడు అతనే... చివరి నిమిషంలో ఖరారు...
అంతర్జాతీ మీడియా కథనాల ప్రకారం... ఆఫ్గనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా ముల్లా హసన్ అఖుంద్‌ను దాదాపుగా ఖరారు చేశారు. నిజానికి తాలిబన్ టాప్ లీడర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్ష పగ్గాలు చేపడుతారని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అంతర్గత విభేదాలతో చివరి నిమిషంలో ఆయనకు బదులు ముల్లా హసన్ అఖుంద్ పేరు తెర పైకి వచ్చినట్లు తెలుస్తోంది. తాలిబన్ సంస్థలో నిర్ణయాధికారం కలిగిన లీడర్‌షిప్ కౌన్సిల్ చీఫ్‌గా ప్రస్తుతం హసన్ కొనసాగుతున్నారు. హసన్ జన్మస్థలం కాందహార్. తాలిబన్ సంస్థ ఇక్కడే పురుడుపోసుకుంది. హసన్ గతంలో విదేశాంగ మంత్రిగా,డిప్యూటీ ప్రధానిగా పనిచేశారు.

మంత్రులుగా ఎవరెవరు...
డిప్యూటీలుగా ముల్లా బరాదర్,మముల్లా అబ్దుస్ సలాం పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.ఆఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సిరాజ్ జుదీన్ హక్కనీని నియమించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని ప్రావిన్స్‌లకు ఆయనే గవర్నర్లను నామినేట్ చేయనున్నట్లు చెబుతున్నారు. విదేశాంగ మంత్రిగా ముల్లా అమీర్ ఖాన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన రక్షణ శాఖను తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మహమ్మద్ కుమారుడు ముల్లా యాకూబ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వ ఏర్పాటుపై వచ్చే 24 గంటల్లో తాలిబన్లు ప్రకటన చేయనున్నారు.
Recommended Video

విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటు వాయిదా
నిజానికి తాలిబన్లు గత శుక్రవారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా.. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే హక్కానీ నెట్‌వర్క్ నేతలతో విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడింది. తొలుత శనివారానికి.. ఆ తర్వాత ఒక వారం పాటు ప్రభుత్వ ఏర్పాటును వాయిదా వేశారు.ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చల సందర్భంగా హక్కనీ నెట్‌వర్క్ నేతలకు,తాలిబన్ కీలక నేతలకు మధ్య ఘర్షణ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మధ్యే మార్గంగా... ముల్లా బరాదర్‌ను కాకుండా ముల్లా హసన్ పేరును అధ్యక్ష పదవి కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications