వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్: రెండేళ్ల తర్వాత కూడా కోవిడ్ గురించి మనకు తెలియని 3 కీలక విషయాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్ 19 వచ్చి రెండేళ్లయినా ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు

''మనం ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇస్తే అన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి'' అన్నారు ప్రొఫెసర్ డాక్టర్ సీమా లక్డావాలా. ఆమె పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

డిసెంబర్ 2019 నుండి కోవిడ్ వైరస్‌‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేకమంది సైంటిస్టులలో ఆమె ఒకరు.

రెండు సంవత్సరాల్లో పరిశోధకులు గొప్ప పురోగతిని సాధించారు. ఈ పురోగతి కోవిడ్-19ను ఎదుర్కోవడానికి టీకాలు, చికిత్సలను అందుబాటులోకి తెచ్చేలా చేసింది.

ఇప్పటికే చాలా విషయాలు తెలిసినప్పటికీ, ఇంకా తెలియని ప్రాథమిక సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడం వల్ల మహమ్మారిపై పోరాటంలో మరింత బలం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్-19‌కు సంబంధించి ఈ కింద పేర్కొన్న మూడు అంశాలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు.

వేరియంట్లు వస్తున్న కొద్దీ టీకాల బలం తగ్గినా, పని చేయవు అనడానికి వీల్లేదు

1. వైరస్ ఎక్కడ పుట్టింది?

''అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది అన్నది ఇంకా గుర్తించలేదు'' అని యూకేకు చెందిన హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఫిబ్రవరి 2021లో, కోవిడ్ మూలాలను పరిశోధించే పనిలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం చైనాకు వెళ్లి, వైరస్ గబ్బిలాల నుండి ఉద్భవించి ఉండొచ్చని అభిప్రాయపడింది. అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని తేల్చి చెప్పింది.

చైనా నుంచి అందుతున్న డేటాలో సరైన పారదర్శకత లేకపోవడం వల్ల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.

ప్రయోగశాలలో జరిగిన ఒక సంఘటన కారణంగా వైరస్ మనుషులకు వ్యాపించిందన్న దానికి ఎలాంటి రుజువులు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే అక్టోబర్‌‌లో సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన సంపాదకీయంలో ''తగినంత సాక్ష్యం లభించే వరకు ప్రయోగశాలలో జరిగిన ప్రమాదం వల్ల వైరస్ లీకైంది అన్న విషయాన్ని తోసిపుచ్చలేము'' అని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.

అదే నెలలో ఈ కొత్త వైరస్ మూలాలకు కనుగొనేందుకు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్‌ నుంచి ఒక నిపుణుల బృందాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసింది.

వూహాన్ మార్కెట్‌లలో జంతువుల నుండి మానవులకు వైరస్ వ్యాపించిందా లేక ప్రయోగశాల ప్రమాదంలో లీక్ అయిందా అనే విషయాన్ని పరిశోధించడం ఈ బృందం లక్ష్యం. ఈ గ్రూప్ మొదటి సమావేశం 2021 నవంబర్లో‌ జరిగింది.

జంతువుల నుంచి వైరస్‌లు మనుషులకు పాకే అవకాశాన్ని తగ్గించే విధానాలను అభివృద్ధి చేయడంలో ఈ బృందం పరిశోధనలు ఉపయోగపడతాయని టెడ్రోస్ వివరించారు.

కోవిడ్ వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించలేమన్న అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదిక ఒకటి గత ఏడాది అక్టోబర్ చివరిలో బైటికి వచ్చింది.

ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది బయోలాజికల్ వెపన్ కాదు. జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించడం, లేదంటే ప్రయోగశాల నుంచి లీక్ కావడం అన్న రెండు అంశాలలో ఏదో ఒకటి అయ్యుండవచ్చని అనుమానించింది.

వ్యాక్సీన్ ఉన్నా మాస్క్ పెట్టుకోవడం మాత్రం తప్పనిసరి

అయితే, ఇందులో దేనివల్ల వైరస్ బైటికి వచ్చిందన్న దానిపై మాత్రం కచ్చితంగా నిర్ధారణకు రాలేమని తేల్చింది. అయితే, లేబరేటరీ నుంచి వైరస్ లీక్ అయిందన్న సిద్ధాంతాన్ని చైనా తిరస్కరించింది.

''మనకు కోవిడ్-19 మూలం ఎప్పటికీ తెలియకపోవచ్చు'' అని 2021 నవంబర్‌లో స్టాట్‌ న్యూస్ పోర్టల్‌లో ప్రచురించిన ఒక కథనంలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో మైక్రో బయాలజీ అండ్ ఇమ్యునాలజీ ప్రొఫెసర్ జాన్ పి. మూర్ అభిప్రాపడ్డారు.

ఈ విషయంలో చిత్రవిచిత్రమైన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మూర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకైతే, ప్రయోగశాల లీక్, లేదా జంతువుల నుంచి వ్యాప్తి అనే రెండు సిద్ధాంతాలపైనే చర్చ కేంద్రీకృతమై ఉంది.

చైనాలో లేబరేటరీ లీక్‌ను కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది

2. వైరస్ మోతాదు ఎంత?

ఒక ఇన్ఫెక్షన్ రావడానికి అవసరమైన వైరస్‌ను ఇన్ఫెక్షియస్ డోస్ అంటారు. కోవిడ్ విషయంలో ఆ మోతాదు ఎంతో తెలియదు. అంటే ఒక వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌‌కు గురయ్యేందుకు ఎన్ని వైరస్ కణాలు సరిపోతాయో స్పష్టంగా తెలియదు.

''ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేయడానికి అవసరమైన కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షియస్ డోస్ ఎంతో ఇంత వరకు తెలియదు'' అని యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

జంతువులపై జరిగిన అధ్యయనాలు, ఎపిడెమియోలాజికల్ పరిశోధనల ప్రకారం, ముక్కు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి చేరి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుందని సీడీసీ తెలిపింది.

''మనుషులలో కోవిడ్ ఇన్ఫెక్షియస్ డోస్ ఏ స్థాయిలో ఉందన్నది కొలవడం చాలా కష్టం'' అని డాక్టర్ లక్డావాలా బీబీసీతో అన్నారు.

కొన్ని వైరస్‌లలోని పది కణాలు మనిషికి సోకినా వైరస్ అంటుకుంటుందని, కొన్నింటిలో వెయ్యి వరకు సోకితేనే వైరస్ వ్యాపిస్తుందని, కానీ కోవిడ్ విషయంలో ఆ పరిమాణం ఎంతో తెలియదని లక్డావాలా వివరించారు.

ఒమిక్రాన్‌ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి దానికి పది కణాలకంటే తక్కువ ఇన్ఫెక్షియస్ డోస్ ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు లక్డావాలా చెప్పారు.

మనిషిలోని యాంటీబాడీలు, ఇన్ఫెక్షియస్ డోస్ గురించి పూర్తి సమాచారం ఇప్పటి వరకు లేదు

3. కోవిడ్ సోకకుండా ఉండాలంటే బాడీలో ఏ స్థాయిలో యాండీబాడీలు ఉండాలి?

కోవిడ్-19 నుంచి రక్షణ పొందడానికి ఒక వ్యక్తిలో ఎన్ని యాంటీబాడీలు ఉండాలో ప్రస్తుతానికి తెలియదు. నిరోధానికి అవసరమైన స్థాయిలో ఉండటాన్నే కో రిలేటివ్ ప్రొటెక్షన్ అంటారు. కోవిడ్‌‌పై పోరాటంలో ఈ సంఖ్య తెలియడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతారు.

''కోవిడ్‌కు సంబంధించి కో రిలేటివ్ ప్రొటెక్షన్ ఎంతో తెలిసి ఉండటం చాలా కీలకం'' అన్నారు ప్రొఫెసర్ ఫ్లోరియన్ క్రామెర్. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌కు చెందిన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మైక్రోబయాలజీ విభాగంలో క్రామెర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

2021 జులైలో సైన్స్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో వీటి ప్రాధాన్యతను క్రామెర్ వివరించారు.

''కోవిడ్‌ నుంచి రక్షణకు ఔషధాలు తయారు చేసేందుకు ఈ సంఖ్య తెలిసి ఉండటం చాలా ముఖ్యం'' అని ప్రొఫెసర్ క్రామెర్ స్పష్టం చేశారు.

దీనివల్ల వ్యాక్సీన్‌ల ఆమోదానికి ఎక్కువ ట్రయల్స్ అవసరం తగ్గుతుందని క్రామెర్ చెప్పారు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లయితే వారికి బూస్టర్ డోసులను ఇవ్వడం ద్వారా రక్షణ కల్పించవచ్చని క్రామెర్ అంటారు.

అయితే, ఓమిక్రాన్ లాంటి వైరస్ వేరియంట్‌ల విషయంలో వ్యాక్సీన్‌లు వైరస్‌ను తటస్థీకరించే యాంటీబాడీలను ఎక్కువగా తయారు చేయలేకపోవచ్చని డాక్టర్ లక్డావాలా అన్నారు. అలాగని అవి మనల్ని రక్షించలేవు అనుకోవడం కూడా పొరపాటేనని లక్డావాలా స్పష్టం చేశారు.

''టీకాలు వేయని వారితో పోలిస్తే వ్యాక్సీన్లు తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది'' అన్నారు లక్డావాలా.

కొత్త వేరియంట్‌ల కారణంగా ఇన్ఫెక్షియస్ డోస్, ప్రొటెక్షన్ కో రిలేట్ డేటాలో మార్పులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

"వైరస్ సంక్రమించిన ప్రతిసారీ అది పరివర్తన చెందుతుంది, అది పరివర్తన చెందిన ప్రతిసారీ ఈ వేరియబుల్స్‌పై ప్రభావం చూపుతుంది, కాబట్టి మీరు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఇక్కడ కీలకం'' అని లక్డావాలా అన్నారు.

''కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలకు జవాబులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇక మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవి, మాస్కులు ధరించడం, టీకాలు తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం'' అన్నారు లక్డావాలా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Omicron: Two key things we still don't know about covid after two years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X