ఆపరేషన్ సింధూర్ పై అమెరికా మరో ట్విస్ట్..! పాకిస్తాన్ నే అడగండి..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ ఏకంగా 6 ఎఫ్ 16 యుద్ధ విమానాలను కోల్పోయిందని తాజాగా మన ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేదీ వెల్లడించారు. అయితే ఈ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. తామే భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్లు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాకు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లో ఎఫ్ 16 విమానాలు కోల్పోయిందా లేదా అన్న ప్రశ్న ఎదురైంది.
ఈ ఏడాది మే 7 నుంచి మే 10 మధ్య ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ దాడుల్లో పాకిస్తాన్ ఎఫ్ 16 యుద్ధ విమానాలను కోల్పోయిందా లేదా అని ఎన్డీటీవీ అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ ఆ ప్రశ్న పాకిస్తాన్ నే అడగాలని సూచించింది. పాకిస్తాన్ నడిపే అమెరికా తయారీ ఎఫ్ 16 యుద్ధ విమానాలపై పూర్తి సమాచారం టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ వద్ద ఉంటుంది. ఇవి పాకిస్తాన్ లోనే మోహరించి ఉంటాయి. ఇవి ఎఫ్ 16 జెట్లు ఎప్పుడు వాడాలి, వాటి స్టేటస్ ఏంటనే వివరాలను పూర్తిగా కలిగి ఉంటాయి. దీంతో అమెరికాను అడిగిన ప్రశ్నకు పాకిస్తాన్ నే అడగాలని తేల్చిచెప్పేసింది.

అయితే గతంలో పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై భారత్ వైమానిక దాడులు జరిపిన కాసేపటికే అమెరికా ప్రభుత్వం.. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఎఫ్ 16 విమానాల సమాచారాన్ని బట్టి చూస్తే ఈ విషయాలు అగ్రరాజ్యానికి తెలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా ఆ వివరాలు తమ వద్ద ఉండవని, పాకిస్తాన్ నే అడగాలంటోంది. తద్వారా భారత్ వాదనను బలపర్చేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోంది. అలాగే తాజాగా బంధం పెంచుకుంటున్న పాకిస్తాన్ ను ఇబ్బంది పెట్టేందుకు ఇష్టపడటం లేదని కూడా తెలుస్తోంది.

తాజాగా భారత ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ లోని సుక్కూర్, జకోబాబాద్ లోని ఎఫ్ 16 హ్యాంగర్లపై తాము వైమానిక దాడులు చేశామని, ఈ సందర్భంగా వారి యుద్దవిమానాలను గాల్లో లేదా భూమిపై కూల్చేసినట్లు వెల్లడించారు. అలాగే మొత్తం ఆరు పాకిస్తాన్ యుద్ద విమానాలు కూల్చేసినట్లు వెల్లడించారు. ఈ సమాచారాన్ని నిర్ధారించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్ వాదనపై స్పందిస్తూ ఇరు దేశాల యుద్ధ విమానాల లెక్కను స్వతంత్ర నిపుణులతో లెక్కిద్దామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications