ఫైజర్ కరోనా వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతం, సురక్షితం: ప్రపంచానికిది శుభవార్తే, కానీ..
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి మోడెర్నా తర్వాత కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాధి సోకకుండా నిరోధించడంలో తమ కంపెనీ అభివృద్ధి చేసిన టీకా 95 శాతం సమర్థతను ప్రదర్శించిందని, సురక్షితం కూడా అని తెలిపింది.
Recommended Video

అన్ని వయస్సుల వారిలోనూ సమర్థవంతంగా ఫైజర్
జర్మన్‌కు చెందిన బయాన్‌టెక్ ఎస్ఈతో కలిసి యాతరు చేసిన ఈ టీకా ఎంతో సురక్షితమైందని పునరుద్ఘాటించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అన్ని వయస్సుల వారిలో దీని ప్రభావం స్థిరంగా ఉందని, పెద్దగా దుష్ప్రభావాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉండే 65 ఏళ్లకు పైబడినవారిలో కూడా దీని సమర్థత 94 శాతానికిపైగా ఉన్నట్లు ఫైజర్ తెలిపింది.

95శాతానికిపైగా కరోనాపై ప్రభావం
త్వరలోనే యూఎస్ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతికి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. తమ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 90 శాతం ఫలితాలు ఇస్తున్నట్లు ప్రకటించిన వారంలోనే ఫైజర్ తాజాగా బుధవారం 95శాతానికిపైగా ప్రభావం చూపిస్తుందని పేర్కొనడం గమనార్హం.

ఫైజర్ వ్యాక్సిన్‌తో కోలుకుంటున్నారు..
170 మంది కరోనా రోగులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా.. తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు కనబడినట్లు తెలిపింది. అయితే, ఈ టీకా నిల్వ చేయడానికి మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని పేర్కొనడంతో పలు దేశాలకు ఇది సవాలుగా మారింది.

ఫైజర్ వ్యాక్సిన్‌తో ఇదొక్కటే సమస్య..
భారత్ లాంటి దేశాల్లో ఈ ఉష్ణోగ్రత వద్ద టీకాలను భద్రపర్చడం కష్టసాధ్యమైనపనే. దీంతో భారత్ తోపాటు అనేక దేశాలు ఈ వ్యాక్సిన్ కొనుగోలుపై తర్జనభర్చనలు పడుతున్నాయి. కాగా, ఇప్పటికే మోడెర్నా వ్యాక్సిన్ కూడా 94 శాతం ప్రభావం చూపిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 13 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికిపైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications