30 గంటలు పని: మృత్యువాత పడిన కాపీరైటర్
జకార్త: ఇండోనేషియా రాజధాని జకార్తాలో అత్యధిక సమయం విధులు నిర్వహించిన ఓ కాపీ రైటర్ మృత్యువాత పడింది. 30 గంటలు పనిచేసినా ఇంకా తాను స్ట్రాంగ్‌గానే ఉన్నానని ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆ ఉద్యోగిని తర్వాతి రోజు మృతి చెందింది. అయితే ఉద్యోగి మరణానికి సరైన కారణాన్ని వైద్యులు నిర్ధారించలేకపోతున్నారు. కానీ సుదీర్ఘంగా విధులు నిర్వహించడం కూడా మృతికి ఓ కారణమని వారు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కష్టపడి పని చేసే ఉద్యోగిగా పేరున్న మితా డైరన్.. తన కార్యాలయంలో రోజుల తరబడి నిరంతరాయంగా విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అత్యధిక సమయం కార్యాలయానికే కేటాయించడం ద్వారా ఆమె అక్టోబర్ నుంచే కొంత అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. వరుసగా మూడు రోజులపాటు 12గంటలకు మంచి విధులు నిర్వహించడం వల్ల కొంత అనారోగ్యానికి గురైనట్లు చనిపోయే ముందు మితా ట్విట్టర్‌లో పేర్కొంది.

కాగా అత్యధిక సమయం విధులు నిర్వహించిన తర్వాత అనారోగ్యానికి గురైన మితా డైరన్ ఒక్కసారిగా కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయింది. సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రి తరలించారు. ఆ సమయంలో మితా తండ్రి ఓ సందేశాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పోస్టు చేశాడు. గత మూడు రోజులుగా నిరంతరాయంగా కార్యాలయంలో విధులు నిర్వహించడం వల్లే తన కూతురు కుప్పకూలిపోయిందని ఆ సందేశంలో తెలిపాడు. పరిమితికి మించి పని గంటల్లో విధులు నిర్వహించడం వల్లే తన కూతురుకు ఇలా జరిగిందని చెప్పాడు.
తమ కంపెనీ తరపున మితా డైరన్ ఇండోనేషియాలోని జకార్తా కార్యాలయంలో పనిచేస్తోందని యంగ్ అండ్ రూబిక్యామ్ పేర్కొంది. మితా ప్రతిభ గల కాపీ రైటర్ అని తెలిపింది. ఆమె ఎప్పుడూ తమ హృదయాల్లో ఉంటుందని పేర్కొంది. మితా లేకపోవడం తమకు గొప్ప లోటేనని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications