ఆపరేషన్ జాఫర్ ఎక్స్‌ప్రెస్: 16 మంది హతం: 3,000 మంది మిలిటెంట్లు?
Jaffar Express Hijack: పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌కు గురైన తరువాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సైన్యం మొత్తాన్నీ ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. హైఅలర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి.
500 మంది ప్రయాణికులు, ఆర్మీ సైనికులతో కూడిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్యాహ్నం హైజాక్ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలోని సిబి టౌన్ సమీపంలో ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివుంచారు. బీఎల్ఏ తిరుగుబాటులదారుల ఆధీనంలోనే ఉందీ రైలు ఇంకా.
క్వెట్టా- పెషావర్ కంటోన్మెంట్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. 1,632 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తుంటుంది. బహవాల్‌పూర్, ముల్తాన్, లాహోర్, వజీరాబాద్, ఝీలం, రావల్పిండి, నౌషేరా సహా మొత్తం 32 స్టేషన్ల మీదుగా ఈ రైలు రోజూ రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ మధ్యాహ్నం క్వెట్టా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హైజక్‌కు గురైంది.

మార్గమధ్యలో ఉన్న సిబి స్టేషన్ వద్ద దీన్ని తమ ఆధీనంలో తెచ్చుకున్నారు బీఎల్ఏ తిరుగుబాటుదారులు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉంటుందీ సిబి టౌన్. ఈ ప్రాంతం మొత్తంపైనా లిబరేషన్ ఆర్మీ రెబెల్స్‌కు గట్టి పట్టు ఉంది. మజీద్ బ్రిగేడ్, ఎస్టీఓఎస్, ఫతా స్క్వాడ్, జైరబ్ యూనిట్.. ఈ హైజాక్‌లో పాల్గొన్నాయి.
ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, వయోధిక వృద్ధులు, బలూచ్ ప్రావిన్స్‌కు చెందిన స్థానికులను సురక్షితంగా విడిచిపెట్టినట్లు బీఎల్ఏ తెలిపింది. వాళ్ల ఆధీనంలో ఇంకా 182 మంది ఉన్నారు. వీరిలో ఆర్మీ జవాన్లు, పోలీసులు, గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు బీఎల్ఏ తెలియజేసింది.
వారంతా కూడా సెలవులపై జాఫర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తమ స్వస్థలాలకు వెళ్తోన్నట్లు వివరించింది. ప్రస్తుతం వారంతా తమ ఆధీనంలో బందీలుగా ఉన్నారని పేర్కొంది. ఎలాంటి సైనిక చర్యకు దిగినా బందీలను హతమారుస్తామని హెచ్చరించింది. మొత్తం 3,000 మందికి పైగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు ఉన్నట్లు సమాచారం.
కాగా- బందీలను విడిపించడానికి యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది పాకిస్తాన్ సైన్యం. ఆపరేషన్ జాఫర్ ఎక్స్‌ప్రెస్ చేపట్టింది. పక్కా ప్రణాళికతో ఎదురుదాడికి దిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులపై ఎదురు కాల్పులకు దిగింది. ఈ ఘటనలో 16 మంది మిలిటెంట్లు హతమైనట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. ఇప్పటివరకు 104 మందికి పైగా బందీలకు విముక్తి కలిగించినట్లు తెలిపింది.
వీరిలో- 31 మంది మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నారు. హైజాక్ ఉదంతంతో గాయపడ్డ మరో 17 మంది సాధారణ ప్రయాణికులకు సురక్షితంగా విముక్తి కల్పించినట్లు పాక్ ఆర్మీ పేర్కొంది. వారిని ఆసుపత్రికి తరలించామని, చికిత్స అందిస్తోన్నామని తెలిపింది.












Click it and Unblock the Notifications