పాక్ అడిగింది..! ట్రంప్ ఇస్తే మాత్రం భారత్ కు బిగ్ షాకే..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఉపఖండంలో పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి బెంబేలెత్తిన పాకిస్తాన్ అమెరికా శరణు వేడుకోవడం, దీంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగిపోయాయి. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించకపోవడం, అదే సమయంలో ఆయన వద్దంటున్నా రష్యా డిస్కౌంట్ చమురును కొనుగోలు చేయడం వంటి కారణాలతో అమెరికాకూ మనకూ గ్యాప్ పెరిగిపోయింది. దీంతో 50 శాతం సుంకాల మోత మోగింది. ఇదంతా ఓ ఎత్తయితే భారత్ పై కోపంతో పాకిస్తాన్ కు అమెరికా దగ్గరవుతుండటం మరో కీలక పరిణామం.
ఈ నేపథ్యంలో అమెరికాకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా పాకిస్తాన్ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో ఇప్పుడు భారత్-ఇరాన్ ఉమ్మడిగా నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు కౌంటర్ గా అరేబియా సముద్రంలో మరో పోర్టు నిర్మించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. అరేబియా సముద్రంలో పస్నీ వద్ద ఈ పోర్టు నిర్మాణం చేసి ఇవ్వాలని అమెరికా ముందు పాకిస్తాన్ ప్రతిపాదన పెట్టింది.

ఈ పోర్టు నిర్మాణానికి 1.2 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తం సమకూర్చాలనే ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వంలో ఓ కీలక అధికారి ముందు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ పెట్టినట్లు తెలుస్తోంది. పస్నిలో పాకిస్తాన్ ఖనిజాలను యాక్సెస్ చేయడానికి అమెరికా ఓడరేవు వద్ద ఒక టెర్మినల్‌ను నిర్మించి నిర్వహిస్తోంది. అఫ్ఘనిస్తాన్ , ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణం అశాంతితో నిండిన బలూచిస్తాన్ ప్రావిన్స్. ఇక్కడే ఆ ఓడరేవు నిర్మాణం చేసి ఇవ్వాలని పాక్ కోరుతోంది. రక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్‌లో సంయుక్తంగా వ్యూహాత్మక ఖనిజాలను అన్వేషించడానికి అమెరికా సంస్థ 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసింది. దీనికి కొనసాగింపుగా పోర్టు నిర్మాణం కోసం పాక్ ప్రయత్నిస్తోంది.
ఇరాన్ , మధ్య ఆసియాకు పస్ని దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వాణిజ్య అవకాశాలు పెరుగుతాయనే కారణం చూపి పాకిస్తాన్.. అమెరికాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది అరేబియా సముద్రం , మధ్య ఆసియాలో అమెరికా ప్రభావాన్ని కూడా విస్తరించేందుకు పనికొస్తుందని చెబుతోంది.ఇప్పటికే పాకిస్తాన్ లో గ్వాదర్ ఓడరేవుకు చైనా నిధులు ఇస్తుంది. దీనికి 100 కిమీ దూరంలోనే పస్నీ వద్ద అమెరికా పోర్టు నిర్మించి ఇవ్వాలని కోరుతోంది.

అయితే ఈ ప్రతిపాదిత ఓడరేవు చబహార్ పోర్టు నుండి కేవలం 300 కి.మీ దూరంలో ఉండటంతో భారత్ కూడా దీనిపై నిఘా పెడుతోంది. చాబహార్ ఓడరేవు పాకిస్తాన్‌ను తప్పించి ఆప్ఘన్ , మధ్య ఆసియాను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పస్నీ వద్ద అమెరికా పాకిస్తాన్ కు పోర్టు నిర్మించి ఇస్తే దాని ప్రభావం చబహార్ పైనా పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ పై కోపంతో చబహార్ పోర్టుపై అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications