ప్రతీకారానికి సిద్ధమవుతున్న పాక్ ? సైన్యానికి ప్రభుత్వం సర్వాధికారాలు..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న 9 తీవ్రవాద శిబిరాల్ని టార్గెట్ చేస్తూ నిన్న రాత్రి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor) విజయవంతమైంది. భారత్ దాడుల్లో 100 మందికి పైగా పాకిస్తాన్ మద్దతిస్తున్న ఉగ్రవాదులు చనిపోయినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంఖ్యను కాస్త తగ్గించి చెబుతున్నా భారత్ చేసిన దాడి మాత్రం వారిని షాక్ కు గురి చేసినట్లు అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతీకార దాడికి సిద్ధమవుతోంది.
తమ భూభాగంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకార దాడి చేసేందుకు తమ సైన్యానికి సర్వాధికారాలు కట్టబెడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మరియు పిఓకె లలో భారతదేశం జరిపిన దాడులను హేయమైన దురాక్రమణ చర్యగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. దీనికి శిక్ష తప్పదన్నారు. అదే సమయంలో భారత్ జరిపిన దాడి నేపథ్యంలో సైనికాధికారులతో భేటీ అయిన ఆయన.. వారికి పూర్తి స్దాయి అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుుకున్నారు.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ భేటీలో భారత్ చేసిన వైమానిక దాడులకు ఆత్మరక్షణ కోసం ప్రతిస్పందించే హక్కు తన దేశానికి ఉందని ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్ నగ్న దురాక్రమణను ఖండిస్తూ ఎలాంటి కవ్వింపులు లేకుండా చేసిన అన్యాయమైన దాడులుగా వీటిని అభివర్ణించారు ఉద్దేశపూర్వకంగా మహిళలు , పిల్లలతో సహా పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు.
ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51ని ఉటంకిస్తూ అమాయక పాకిస్తానీ ప్రాణాలను కోల్పోయినందుకు, దాని సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించినందుకు పాకిస్తాన్‌కు ఆత్మరక్షణ కోసం ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని జాతీయ భద్రతా కమిటీ తెలిపింది. భారత్ తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను స్పష్టంగా ఉల్లంఘించిందని, దాని సైనిక చర్యలు అంతర్జాతీయ చట్టం ప్రకారం యుద్ధ చర్యలను తలపిస్తున్నాయని పేర్కొంది.
పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారత్ చేసిన ఆరోపణల్ని సైతం పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ తోసిపుచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై విశ్వసనీయమైన, పారదర్శకమైన, తటస్థ దర్యాప్తు కోసం పాకిస్తాన్ నిజాయితీగా ప్రతిపాదన చేసిందని, కానీ దురదృష్టవశాత్తు దానికి భారత్ అంగీకరించలేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications