2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే..
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఆ దేశాలే కాకుండా ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. అయితే అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ లో ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయని సమాచారం. దాంతో ఆ తర్వాత దేశం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ముందు జాగ్రత్తగా వర్క్ ఫ్రం హోం ప్రకటించింది పాకిస్థాన్. ఇంటి నుండే పనులు చేసుకోవాలని.. ఆఫీసులకు రావొద్దని ఆదేశించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఇంధన కొరత కారణంగా రెండు వారాల పాటు దేశంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హైయర్ ఎడ్యూకేషన్ సంస్థలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారంలో కేవలం 4 రోజులు మాత్రమే పని చేయాలని ఆదేశించింది. అంతేకాక 50 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని స్పష్టం చేసింది.

మరోవైపు దేశంలో ఇంధన వినియోగం, నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సంబంధిత శాఖలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలు ఇచ్చారు. ఇంధన భారాన్ని తగ్గించుకునేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలలను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇంధన సంక్షోభం కారణంగా ఈ ఎమర్జెన్సీ నిర్ణయాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ మార్చి 9న తీసుకున్నారు.
తాజా నిర్ణయంతో మార్చి 16 నుంచి దాదాపు రెండు వారాల పాటు పాఠశాలలను మూసి వేయనున్నారు. కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులకు ఆన్ లైన్ విధానం ద్వారా బోధన చేయాలని ఆదేశాలు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇక ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. దాంతో ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 335 గా ఉంది.












Click it and Unblock the Notifications