'సింధూ నదీ జలాలు విడుదల చేయండి.. శాంతి చర్చలకు రెడీ'.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
చైనాలోని తియాంజిన్ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO)లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలు విషయాలు ప్రస్తావించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధూ నదీ జలాల పంపిణీని భారత్ నిలిపివేసింది. దీనిపై పాకిస్థాన్ పలుసార్లు భారత్ కు లేఖలు రాసింది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO)లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం సింధూ నదీ జలాల నిలిపివేత కారణంగా స్థానికంగా ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ఈ మేరకు సరిహద్దు దేశాలతో శాంతి చర్చలకు తాము సిద్ధమన్న సంకేతాన్ని బయటపెట్టారు. శాంతి, దౌత్య సంబంధాలు, స్థానిక సహకారం తదితర అంశాలకు పాకిస్థాన్ కట్టుబడి ఉందని తెలిపారు.
🚨BREAKING: Shehbaz Sharif raises the Indus Waters Treaty at the SCO, calls for dialogue, peace, and climate action.https://t.co/u7RgOvZmYc pic.twitter.com/HYpz6e4P4U
— The Daily CPEC (@TheDailyCPEC) September 2, 2025
భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు SCO దేశాల మద్దతు అవసరం అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. సరిహద్దు దేశాలతో పాకిస్థాన్ ఎప్పుడూ శాంతిని, స్థిరమై సంబంధాలను కోరుకుంటుందన్నారు. SCO ఫ్రేమ్ వర్క్ కింద పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందన్నారు.
ఇక ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది.
ఈ దాడుల్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది. అంతేకాక పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు, వీసాల జారీ రద్దు, గగనతలం మూసివేత.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇక సింధూ జలాల ఒప్పందం (IWT) సింధూ నది, దాని ఉపనదులలో లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇది కరాచీలో 19 సెప్టెంబర్ 1960న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరియు పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్ కు తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్ లపై, పాకిస్థాన్ కు పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది.












Click it and Unblock the Notifications