పహల్గామ్ నరమేధం సూత్రధారికి పిలిచి భోజనం పెడుతున్న ట్రంప్- రహస్య భేటీ
Donald Trump- Asmi Munir Lunch meeting: పహల్గామ్ లో భయానక ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం వైట్ హౌస్ లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి భోజనం చేయనున్నారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వైట్ హౌస్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. డొనాల్డ్ ట్రంప్ రోజువారీ కార్యక్రమాలతో కూడిన అధికారిక ప్రకటనను వెలువడించింది. డొనాల్డ్ ట్రంప్ పాల్గనబోయే మూడు అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది వైట్ హౌస్.

ఉదయం 9 గంటలకు ఇన్- టౌన్ పూల్ కాల్ టైమ్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ఫ్రెంచ్ రాయబారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు ట్రంప్. అనంతరం మొనాకో ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తరువాత అసీమ్ మునీర్ తో సమావేశమౌతారు.
అనంతరం ఒంటిగంటకు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ తో కలిసి డొనాల్డ్ ట్రంప్ మధ్యాహ్నం భోజనం చేస్తారని వైట్ హౌస్.. రోజువారీ షెడ్యూల్ లో పొందుపరిచింది. నిజానికి ఇది క్లోజ్డ్ - డోర్ మీటింగ్. మీడియాకు కూడా ఇందులో ప్రవేశం లేదు. భోజనానంతరం పలు అంశాలపై చర్చిస్తారు.
డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ రూమ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ ప్రైవేట్ లంచ్ కు మీడియాకు ప్రవేశం లేదు. దీని తరువాత అసీమ్ మునీర్.. తన పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ లతో కూడా సమావేశం కానున్నారు.
అమెరికా పర్యటన కోసం అయిదు రోజుల కిందటే వాషింగ్టన్ కు చేరుకున్నారు మునీర్. పహల్గామ్ లో ఉగ్రవాద దాడి, ఆ తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పమల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications