పాక్ దొంగ బుద్ధి.. ధ్వంసమైన ఉగ్ర స్థావరాలు పునర్నిర్మాణం..!
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ వ్యాలీలో ఏప్రిల్ 22న ముష్కరులు జరిపిన మారణ హోమంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఎంత కొట్టినా చావని పాములా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసం అయిన ఉగ్రస్థావరాలను తిరిగి నిర్మించుకుంటోంది.
పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో లష్కరే ఉగ్రవాదుల ప్రధాన క్యాంప్ కార్యాలయం అయిన మర్కాజ్ తోయిబా పూర్తిగా నేలమట్టం అయింది. అయితే తాజాగా ఈ హెడ్ క్వార్టర్స్ ను పునర్నిర్మించడానికి పాకిస్థాన్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాక వరద బాధితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయని భారత నిఘా వర్గాలు తేల్చాయి. దాంతోపాటు మురిద్కే స్థావరాన్ని కూడా ఉగ్రవాద సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సంస్థలకు పాకిస్థాన్ ఫండింగ్ ఇస్తున్నట్లు భారత నిఘా వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ స్థావరం పూర్తిగా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
అంతేకాక 2019 బాలా కోట్ దాడి తర్వాత మూసేసిన లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను పాకిస్థాన్ ఇటీవల మళ్లీ పునరుద్ధరించింది. ఈ రెండింట్లో ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. అంతేకాక లష్కరే తోయిబా సంస్థ.. తమ ఉగ్రవాదుల బస కోసం నాలుగు చిన్న తాత్కాలిక టిన్ లను, ఓ కొత్త వాచ్ టవర్ ను కూడా నిర్మించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇటీవల బయటకు వచ్చాయి.

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా వీటిని తిరిగి పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ సిద్ధం అవుతోంది.












Click it and Unblock the Notifications