కేంద్రం దెబ్బకు రూ. 3.50 లక్షల కోట్లు నష్టపోయిన పాకిస్తాన్
జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో సంభవించిన ఉగ్రదాడి.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందంటే నమ్మగలరా. అది వాస్తవం. 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ ఘటన తర్వాత ఆ దేశంతో ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా భారత్ నిలిపివేయడం వల్ల ఈ పరిణామం సంభవించింది. పరోక్షంగా భారత్.. పాకిస్తాన్ ఆయువుపట్టును దెబ్బకొట్టింది. ఈ అయిదారేళ్ల వ్యవధిలో పాకిస్తాన్ దాదాపుగా 40 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీతో పోల్చుకుంటే 3.50 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలను నష్టపోయింది.
ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ నూర్ మహ్మద్ కసూరి వెల్లడించారు. వ్యాపార, ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవడం వల్ల ఈ అయిదేళ్ల కాలంలో తమ దేశం సుమారు 40 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసిందని అన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రెండు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.

బిజినెస్ అడ్వకసీ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌తో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాకిస్తానీ పరిశ్రమలు తమకు కావలసిన అత్యవసర ముడిసరుకులు, ఇతర నిత్యావసర వస్తువుల కోసం అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోందని మహ్మద్ కసూరీ వివరించారు. భౌగోళికంగా భారత్ పొరుగునే ఉన్నప్పటికీ, ఇతర ఖండాల నుంచి సరుకులను రవాణా చేయాల్సి వస్తోందని, ఫలితంగా ఫ్రైట్ ఛార్జీలు, డెలివరీ సమయం గణనీయంగా పెరిగి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ ఔషధ తయారీ రంగానికి కావలసిన ముడిసరుకులు గతంలో భారత్ నుంచే పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేవని కసూరి గుర్తు చేశారు. భారత్ నుంచి ఈ ముడిసరుకులను నేరుగా కొనుగోలు చేస్తే పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమకు ఏటా రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల వరకు నిధులు ఆదా అవుతాయని అంచనా వేశారు. అలాగే పాకిస్తాన్‌లో పత్తి సాగు క్షీణించడంతో స్థానిక జౌళి మిల్లులు బ్రెజిల్, ఈజిప్ట్, చైనా, అమెరికా వంటి దేశాల నుంచి పత్తిని కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అదనంగా అయిదు బిలియన్ డాలర్ల భారం పడిందని అన్నారు.
ఔషధాలు, పత్తి మాత్రమే కాకుండా చక్కెర, ఎరువులు, సిమెంట్, ఇనుము, కూరగాయలు, భారీ యంత్రాలను కూడా పాకిస్తాన్ ఎక్కువ రవాణా ఖర్చులు పెట్టి సుదూర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటోందని గుర్తు చేశారు. భారత చమురు శుద్ధి కర్మాగారాలు భౌగోళికంగా పాకిస్తాన్‌కు దగ్గరగా ఉన్నందున, అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే చౌకగా లభిస్తాయని వివరించారు. దీనివల్ల తమ దేశంలో ఉత్పత్తి వ్యయం తగ్గి పరిశ్రమలు కోలుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారత్‌తో వాణిజ్య బంధం పునరుద్ధరణకు నోచుకుంటే పారిశ్రామిక రంగానికే కాకుండా పర్యాటకం, నూతన పెట్టుబడులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని పాకిస్తాన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయని కసూరి తెలిపారు. తమ దేశంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలు, తమ పూర్వీకుల నివాసాలను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
