ముఖ్యమంత్రులకు ది బెస్ట్ సీఎం ర్యాంకులు: టాప్ 10లో ఉన్నది వీళ్లే
దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వారి పాలనా సమర్థత, పారదర్శకత, నాయకత్వ ప్రతిభ, ప్రజాదరణ ఆధారంగా దీన్ని రూపొందించారు. టాప్ 15 ముఖ్యమంత్రుల ర్యాంకులను విడుదల చేశారు. ఈ బెస్ట్ సీఎం సర్వేను ఫేమ్ ఇండియా మేగజైన్, ఏషియా పోస్ట్ సంయుక్తంగా నిర్వహించాయి. ఆయా ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా పాయింట్లు, ర్యాంకులు కేటాయించాయి.
ఈ సర్వేలో మొత్తం 15 మంది ముఖ్యమంత్రులను ఎంపిక చేశారు. మొదటి 10 మందికి ది బెస్ట్ సీఎం హోదా ఇచ్చారు. చివరి అయిదు స్థానాల్లో వారికి ముఖ్యమంత్రి పంచరత్న అనే గుర్తింపు నిచ్చారు. మొత్తం 1,000 పాయింట్ల ఆధారంగా సాగిన సర్వే ఇది. తొలి మూడు స్థానాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. ఉత్తమ ర్యాంకులతో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.

ది బెస్ట్ సీఎం జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్ లో ఉన్నారు. ఆయన పనితీరుకు మొత్తం 897 మార్కులు పడ్డాయి. అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఆయన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ 881 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 874 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 856 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 844 పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచారు. ఏపీ చంద్రబాబు- 842 పాయింట్లతో ఆరో ర్యాంకు సాధించారు. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్- 838 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, రేవంత్ రెడ్డి 827 పాయింట్లతో ఎనిమిదో ర్యాంకును దక్కించుకున్నారు.
మధ్యప్రదేశ్, మేఘాలయా ముఖ్యమంత్రులు మోహన్ యాదవ్- 803, కాన్రాడ్ సంగ్మా- 802 పాయింట్లతో వరుసగా తొమ్మిది, 10 స్థానాల్లో నిలిచారు. ముఖ్యమంత్రి పంచరత్న కేటగిరీ.. అంటే చివరి అయిదుమందిలో దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర)- 788, రేఖా గుప్తా (ఢిల్లీ)- 768, ఒమర్ అబ్దుల్లా (జమ్మూ కాశ్మీర్)- 766, భూపేంద్ర పటేల్ (గుజరాత్)- 760, భజన్ లాల్ శర్మ (రాజస్థాన్)- 746 ఉన్నారు.
PHOTO | Uttar Pradesh Chief Minister Yogi Adityanath has been ranked first among chief ministers nationwide in the Fame India–Asia Post Survey 2026. The recognition is based on an assessment of his leadership, working style, popularity and administrative capabilities, according to the survey results released by Fame India magazine and Asia Post.(Image Source: Third Party)
— Press Trust of India (@PTI_News) November 1, 2026
ఈ సర్వేను ఏషియా పోస్ట్ సంస్థతో కలిసి ఫేమ్ ఇండియా దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు నిర్వహించింది. మూడు దశల్లో సర్వే సాగింది. మొదటి దశలో సోషల్ మీడియా, వార్తల్లో లభించిన ప్రజా స్పందనను విశ్లేషించారు. రెండో దశలో సమాజంలోని వివిధ రకాల మేధావులు, ప్రముఖుల అభిప్రాయాలను సేకరించగా, మూడో దశలో క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకుని తుది సమాచారాన్ని క్రోడీకరించారు.













Click it and Unblock the Notifications
