బెంగళూరులో ఠారెత్తిస్తోన్న మెనూ.. పాల క్యాన్లతో రోడ్డెక్కిన కేంద్ర మంత్రి
ఈ నెల 1వ తేదీ నుంచి కర్ణాటకలో ఆదివారం నుంచి నందిని బ్రాండ్ పాల ధరలు భారీగా పెరిగాయి. లీటర్ కు ఎనిమిది రపాయలు చొప్పన అదనపు భారం పడింది. పెరిగిన ధరలను అన్ని రకాల వేరియంట్లకూ వర్తింపజేసింది ప్రభుత్వం. నందిని పాల రేట్లు పెరగడం 2022 నుంచి ఇది అయిదోసారి. చివరిసారిగా 2025 ఏప్రిల్ 1న లీటర్ పై నాలుగు రూపాయలు చొప్పున పెంచింది. సరిగ్గా ఏడాదిన్నరలో మరోసారి పెరగడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
నందిని బ్రాండ్ పేరుతో.. టోన్డ్, డబుల్ టోన్డ్, స్టాండర్డైజ్డ్, సమృద్ధి ఫుల్ క్రీమ్, శుభం, శుభం గోల్డ్.. వంటి వేరియంట్లను విక్రయిస్తోంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. నవంబర్ 1 నుంచి వాటి రేట్లన్నీ కూడా లీటర్ కు ఎనిమిది రూపాయలు చొప్పున పెరగనున్నాయి. ఇందులో ఏడు రూపాయలు రైతులకు వెళ్తుంది. ఒక రూపాయిని మిల్క్ యూనియన్లకు కేటాయించింది ప్రభుత్వం.

పెరిగిన రేట్ల ప్రకారం చూసుకుంటే.. 1 నుంచి టోన్డ్ మిల్క్ పాకెట్ రూ. 46 నుంచి రూ. 54 కు చేరింది. హోమోజినైజ్డ్- రూ. 47 నుంచి రూ. 55 రూపాయలకు పెరిగింది. శుభం మిల్క్ లీటర్ కు రూ. 52 నుంచి రూ. 60, సమృద్ధి ఫుల్ క్రీమ్- రూ. 55 నుంచి రూ. 64, స్పెషల్ మిల్క్ లీటర్ కు 52 నుంచి 60 రూపాయలకు ఎగబాకింది. 43 రూపాయలు ఉన్న నందిని డబుల్ టోన్డ్ పాలు 51 రూపాయలకు విక్రయిస్తోంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్.
దీని ప్రభావం హోటళ్లు, రెస్లారెంట్లపై పడింది. పెరిగిన పాల ధరలకు అనుగుణంగా టీ, కాఫీ, ఇతర పాల ఆధారిత ఉత్పత్తులు కొండెక్కి కూర్చున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లల్లో విక్రయించే టీపై రూ. 3, కాఫీపై రూ. 5 మేర పెంచుతున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు, కర్ణాటక హోటల్స్ అసోసియేషన్ చీఫ్ జీకే షెట్టి, కర్ణాటక రాజ్య కార్మిక పరిషత్ ప్రెసిడెంట్ రవి షెట్టి బైండూర్ ఇదివరకే ప్రకటించారు.
ఇది అక్కడితో ఆగట్లేదు. చిన్ని చిన్న కాకా హోటళ్లల్లో కూడా టీ, కాఫీ, ఇతర ఆహార పదార్థాల రేట్లకు రెక్కలొచ్చాయి. గతంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉన్నప్పుడు కూడా ఇలాగే రేట్లు పెరిగాయి. అవి తగ్గనేలేదు. ఈ లోపే.. పాల రేట్లు పెరగడం వల్ల మరోసారి అదనపు భారం పడింది. పాల ఆధారిత ఉత్పత్తులు క్యారట్ హల్వా, పాయసం, బాదమ్ మిల్క్ వంటి పదార్థాల రేట్లను కూడా పెంచినట్లు హోటల్ అసోసియేషన్లు తెలిపాయి.
దీనికి నిరసనగా బీజేపీ మహిళా మోర్చా నేడు బెంగళూరులో భారీ ర్యాలీ చేపట్టింది. దీనికి కేంద్రమంత్రి శోభా కరంద్లాజే నాయకత్వాన్ని వహించారు. రాజ్యోత్సవ వేడుకల కానుకగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబీకులపై అదనపు భారాన్ని మోపిందని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకూ వ్యతిరేకంగా డీకే శివకుమార్ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు.














Click it and Unblock the Notifications
