అమెరికా రాయబారికి పాక్ సమన్లు - భారత్ పై వ్యాఖ్యలు..!!
అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ పైన చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం స్పందించింది. నిరసన వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లేమ్ కు సమన్లు జారీ చేసింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో మాట్లాడిన బైడెన్..పాకిస్థాన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు. చైనా, రష్యా దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
చైనా అధ్యక్షుడు తన దేశ స్వార్ధం కోసం ఏమైనా చేస్తారని, ఈ క్రమంలో ప్రపంచ మానవాళికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని బైడెన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగిన రష్యా అక్కడ రక్తపాతం సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యల పైన పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్ధారి దీని పైన స్పందించారు. పాకిస్థాన్ సమగ్రత..భద్రత పైన కఠినంగా ఉందని..అంత అదుపులోనే ఉందని స్పష్టం చేసారు. దీనికి కొనసాగింపుగా భారత్ పైన వ్యాఖ్యలు చేసారు. సందేహాలు ఉంటే అవి భారత్ అణ్వాయుధాలపైన ఉండాలన్నారు.

పాకిస్థాన్ - అమెరికా మధ్య సరైన సంబంధాలు లేకపోవటం కారణంగానే ఇటువంటి అభిప్రాయలు కలుగుతున్నట్లుగా పేర్కొన్నారు. గతంలో భారత్ నుంచి బ్రాహ్మోస్ క్షిపణి పాక్ భూ భాగంలో పడిన విషయాన్ని బుట్టో జర్ధారి ప్రస్తావించారు. ట్రంప్ హయాంలో క్షీణించిన పాక్ - అమెరికా సంబంధాలు బైడెన్ వచ్చిన తరువాత మెరుగు పర్చుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్దికంగా చితికిపోయిన పాకిస్థాన్ అటు అమెరికా సాయం కోరుతోంది. ఇదే సమయంలో బైడెన్ వ్యాఖ్యల పైన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ స్పందించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్దం జరిగినా సంబంధం లేకుండా జోక్యం చేసుకుంటోంది ఎవరని ప్రశ్నించారు.
అమెరికా కాకుండా మరో దేశం ఏదైనా ప్రపంచంలో ఎక్కడా యుద్దం జరిగినా తల దూర్చుతుందా అంటూ ఇమ్రాన్ నిలదీసారు. ఏ సమాచారం ఆధారంగా బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా - ఫాక్ మధ్య రక్షణ పరమైన డీల్స్ పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. దీంతో పాటుగా అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని చూస్తున్న పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కు బైడెన్ వ్యాఖ్యలు అడ్డంకిగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications