బాంబు పెట్టానంటూ బెదిరింపు ఫోన్ కాల్... 26 ఏళ్లు జైలు శిక్ష
లాహోర్: తాను పెట్టిన బాంబ్ మరికొద్ది సేపట్లో పేలుతోందంటూ పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తికి 26ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పాకిస్ధాన్‌కు చెందిన తీవ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సజాద్ షేక్ తీర్పు వెలువరించాడు.
వివరాల్లోకి వెళితే... పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ నగరంలో రద్దీగా ఉండే చిల్డ్రన్స్ పార్కులో బాంబు పెట్టానంటూ రాణా యూసఫ్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో బాంబు డిస్పోబుల్ స్వ్కాడ్ రంగంలోకి దిగి సోదాలు చేసింది. అయితే ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాణా యూసఫ్‌ను నిందితుడిగా గుర్తించారు.

వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, రాణా తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన స్నేహితుడి ఫోన్ నుంచే కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. స్నేహితుడితో తనకు తలెత్తిన గొడవ నేపథ్యంలో అతడి సెల్ నుంచి ఫోన్ చేసి అతడిపై పగ తీర్చుకోవాలని పథకం వేసినట్లు పోలీసులకు చెప్పాడు. కేసును విచారించిన కోర్టు రాణాకు 26 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానాను విధిస్తూ శనివారం తీర్పును వెలువరించింది.












Click it and Unblock the Notifications