పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని సంచలన ప్రకటన- భారత్ అష్టదిగ్బంధనంతో..
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన భద్రత వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయాలను తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చు.

దీనికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులకు జైలు శిక్ష తప్పకపోవచ్చు.
ఇండస్ రివర్ ట్రీటీనీ కేంద్రం రద్దు చేసింది. పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలను కూడా తెంచేసుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణాయలతో కూడిన అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తమ చర్య కాదని నిరూపించుకునే పనిలో పడింది. తాము పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదులు, మిలిటెంట్ గ్రూపులే పహల్గామ్ నరమేధానికి పాల్పడ్డాయంటూ భారత్ పదే పదే చెబుతోండటాన్ని తప్పు పట్టింది.
పహల్గామ్ ఉగ్రదాడిపై తటస్థ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్‌ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కకుల్‌లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
బలంగా విశ్వసించదగ్గ తటస్థ దర్యాప్తు ఏజెన్సీల ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నానని షరీఫ్ వెల్లడించారు. పహల్గామ్‌లో జరిగిన విషాదకర సంఘటనను తమపై నిందలు వేయడానికి, ఆరోపణలు చేయడానికి వినియోగించుకోవడం సరైంది కాదని అన్నారు. దీన్ని బ్లేమ్ గేమ్‌గా అభివర్ణించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనను ఇప్పటివరకు కూడా ఖండించలేదు షెహబాజ్ షరీఫ్. ఈ అంశంపై ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడలేదు. దీనిపై ఇప్పుడు మిలటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ సెరిమనీ కార్యక్రమంలో స్పందించారు. బహిరంగ వేదికపై వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో దాన్ని పాకిస్తాన్ ఖండిస్తూ వచ్చిందని పేర్కొన్నారు.
నిరాధార, అసత్య, అసమగ్ర వాస్తవాలను ఆధారంగా చేసుకుని తమదేశంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న ఆరోపణలు, నిందలకు పహల్గామ్ ఉగ్రవాద ఘటన ఓ తాజా ఉదాహరణ అని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. తటస్థ, పారదర్శక, విశ్వసనీయత గల తటస్థ ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications