Afghanistan: సింహాలగడ్డ పంజ్‌షీర్ చేతులెత్తేసిందా-చరిత్రలో తొలిసారి తాలిబన్లకు మోకరల్లినుందా...
సింహాలగడ్డ పంజ్‌షీర్ చేతులెత్తేసిందా... అక్కడి నాయకత్వం తాలిబన్లకు లొంగిపోనుందా... అంతర్జాతీయ మీడియా కథనాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. తాలిబన్ల భరతం పట్టి ఆఫ్గనిస్తాన్ విముక్తి పోరాటానికి నడుం బిగిస్తుందనుకున్న పంజ్‌షీర్ నాయకత్వం... వారితో యుద్ధం మొదలుపెట్టకుండానే మోకరిల్లడం ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ సమాజపు మద్దతు కరువవడం,తాలిబన్లతో పోరాడేందుకు కావాల్సిన సాయుధ సంపత్తి లేకపోవడం వల్లే పంజ్‌షీర్ నాయకత్వం తిరుగుబాటు ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

మసౌద్ విజ్ఞప్తికి స్పందన కరువు...
ఆఫ్గనిస్తాన్‌లో నేషనల్ హీరోగా ఆరాధించే ఒకప్పటి సైన్యాధిపతి అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ ప్రస్తుతం పంజ్‌షీర్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. తాలిబన్లకు తలవంచేది లేదని ఇటీవలే మసౌద్ ప్రకటించారు. పంజ్‌షీర్‌కు చెందిన 9వేల మందికి సాయుధ శిక్షణ ఇస్తున్నామని... తాలిబన్లను తరిమికొడుతామని గంభీర ప్రకటన చేశారు. అందుకు తగిన ఆయుధాలు కూడా తమ వద్ద ఉన్నాయని... ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే తన తండ్రి కాలం నుంచి ఆయుధాలు సేకరిస్తున్నామని తెలిపారు. అయితే ఫ్రాన్స్,యూరోప్,అరబ్,అమెరికా దేశాల నుంచి తాము సాయం కోరుతున్నట్లు చెప్పారు. మసౌద్ విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఏ దేశం స్పందించలేదు.

తాలిబన్లను ఎదిరించే శక్తి లేదా...
అంతర్జాతీయ సమాజపు మద్దతు లేకపోవడంతో మసౌద్ తాలిబన్లపై తిరుగుబాటు ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.మసౌద్‌కు సలహాదారుగా పనిచేస్తున్న వ్యక్తి 'ది టెలీగ్రాఫ్'తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిజానికి తాలిబన్లతో పోరాడే సత్తా పంజ్‌షీర్‌కు లేదన్నారు. తాలిబన్లను ఎదిరించేందుకు పంజ్‌షీర్ శక్తి సరిపోదన్నారు. ఇదేమీ 1980,1990ల కాలం కాదని... తాలిబన్లు అప్పటికంటే బలపడ్డారని పేర్కొన్నారు. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే పంజ్‌షీర్ సమీపంలోకి వెళ్లారు. ప్రజా తిరుగుబాటుతో చేజారిన మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లోనూ తాలిబన్ల జెండా పాతేందుకు వేగంగా అటువైపు కదులుతున్నారు.

మొదటిసారి తాలిబన్ల వశం కానున్న పంజ్‌షీర్...
తాలిబన్లతో యుద్ధానికి బదులు చర్చలకే మొగ్గుచూపుతున్నట్లు మొదట మసౌద్ ప్రకటించారు. కానీ తాలిబన్లు చర్చలకు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో యుద్ధానికి సిద్ధపడ్డారు. కానీ ఇంతలోనే తమ శక్తియుక్తులు అందుకు సరిపోవనే అంచనాకు వచ్చారు. అందుకే తాలిబన్లతో తలబడటం కంటే వారికి లొంగిపోయి... వారితో ఓ ఒప్పందం చేసుకోవాలని మసౌద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్లకు లొంగిపోయాక ఇక ఒప్పందాలకు తావు ఎక్కడిదనే ప్రశ్న తలెత్తకమానదు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే... తాలిబన్లు పంజ్‌షీర్‌ను చేజిక్కించుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. అదే జరిగితే తాలిబన్లు కొత్త చరిత్ర సృష్టించినవారవుతారు. 1996లో ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన సందర్భంలో ఒక్క పంజ్‌షీర్ మాత్రమే వారిని అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. అప్పట్లో తాలిబన్లకు సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఆ ప్రాంతంలో తాలిబన్ల అరాచకాలు...
స్వీడన్‌కు చెందిన అబ్దుల్ సయ్యద్ అనే ఇండిపెండెంట్ రీసెర్చర్ మాట్లాడుతూ... తాలిబన్లు పంజ్‌షీర్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముడుతారని పేర్కొన్నారు. మసౌద్ నాయకత్వం తాలిబన్లను ఎక్కువరోజులు నిలువరించలేదని అభిప్రాయపడ్డారు. బయటి నుంచి ఆయనకు ఎలాంటి మద్దతు లేదన్నారు. పంజ్‌షీర్‌కు పొరుగునే ఉండే అందరబ్ జిల్లా మీదుగా తాలిబన్లు పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ తీవ్ర హింస,మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ వాపోయారు. తాలిబన్లు అందరబ్ ప్రాంతంలోకి ఆహారం,ఇంధనం ఇతరత్రా సప్లైని అనుమతినివ్వట్లేదని అన్నారు. తాలిబన్లు ఇంటింటికి తిరుగుతూ చిన్నారులను,పెద్దవాళ్లను కిడ్నాప్ చేస్తుండటంతో... అక్కడివారు పర్వత ప్రాంతాల మీదుగా పారిపోతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications