Afghanistan: పంజ్‌షీర్‌పై దండెత్తనున్న తాలిబన్లు-వందలాదిగా అటువైపు-సింహాలగడ్డ వారిని చిత్తు చేస్తుందా?
ఆఫ్గనిస్తాన్‌లో ప్రజా తిరుగుబాటును అణచివేసేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ తమ చేజిక్కని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌పై గురిపెట్టారు.ఇందుకోసం ఇప్పటికే వందలాది తాలిబన్ ఫైటర్లు పంజ్‌షీర్ వైపు కదిలారు. ప్రస్తుతం పంజ్‌షీర్ కేంద్రంగానే తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహ రచన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటే తిరుగుబాటును ఆదిలోనే అణచివేయొచ్చని తాలిబన్లు భావిస్తున్నారు.
Recommended Video

పంజ్‌షీర్‌పై దండెత్తనున్న తాలిబన్లు...
పంజ్‌షీర్‌పై దండెత్తబోతున్నామని తాలిబన్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అలెమరహ్ అనే ట్విట్టర్ ఖాతాలో దీనిపై ప్రకటన చేశారు. పంజ్‌షీర్‌ను తమకు అప్పగించేందుకు స్థానిక అధికారులు నిరాకరిస్తున్నందునా... వారితో యుద్ధం చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 14 సెకన్ల నిడివి గల ఓ వీడియోను ఈ ట్వీట్‌కు జతచేశారు. అందులో పదుల సంఖ్యలో వాహనాల్లో తాలిబన్లు తరలుతుండటం గమనించవచ్చు. వాహనాలపై తాలిబన్ల తెల్ల జెండా కనిపిస్తోంది. నిజానికి పంజ్‌షీర్ ప్రాంతానికి చెందిన కీలక నేత అహ్మద్ మసౌద్... తాలిబన్లతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ తాలిబన్లు మాత్రం చర్చలతో పని లేకుండానే పంజ్‌షీర్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదనకు పంజ్‌షీర్ నేతలు అంగీకరించట్లేదు. దీంతో తాలిబన్లు వారిపై యుద్ధానికి బయలుదేరగా.. పంజ్‌షీర్ ప్రజలు కూడా తాడో పేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు.

తాలిబన్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా పంజ్‌షీర్...
అహ్మద్ మసౌద్,ఆఫ్గనిస్తాన్ దిగ్గజ నేత అహ్మద్ షా మసౌద్ కుమారుడు. 1980ల్లో అప్పటి సోవియెట్ వ్యతిరేక పోరాటంలో అహ్మద్ షా కీలక భూమిక పోషించారు. 1990లలో ప్రభుత్వ సైనిక విభాగానికి నాయకత్వం వహించారు.ఆయన చొరవతోనే అప్పట్లో ఉత్తర కూటమి ఏర్పాటైంది. 2001లో ఐరోపాలో పర్యటించి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలని యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు.సెప్టెంబర్ 11,2011న అమెరికాపై దాడికి రెండు రోజుల ముందు అల్ ఖైదా అహ్మద్ షా మసౌద్‌ను హత్య చేసింది. మారు వేషాల్లో జర్నలిస్టులుగా వచ్చి మసౌద్‌ను ఇంటర్వ్యూ చేసిన ఉగ్రవాదులు.. ఆత్మాహుతితో ఆయన్ను పొట్టనబెట్టుకున్నారు.వచ్చి ఆయనను 2001 సెప్టెంబరు 9న ఇంటర్వ్యూ చేశారు. ఈ సమయంలో వారు జరిపిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్గనిస్తాన్ ప్రజల రక్షణ కోసం నిరంతరం తపించిన అహ్మద్ షా మసౌద్‌ను అక్కడి ప్రజలు నేషనల్ హీరోగా భావిస్తారు. ఆయన మరణించిన రోజును సెలవు దినంగా పాటిస్తారు.
ఆయన హత్య గావించబడ్డప్పటికీ ఆయన నాయకత్వ స్పూర్తి అక్కడి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న అహ్మద్ మసౌద్... తాలిబన్లకు లొంగేది లేదని చెబుతున్నారు. ఇప్పటికే 9వేల మంది స్థానిక ప్రజలకు తాలిబన్లను ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తున్నారు.వీరంతా ప్రస్తుతం ఫిట్‌నెస్,తదితర శిక్షణ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. తాలిబన్లు ఏ క్షణం దాడి మొదలుపెట్టినా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు.

తాలిబన్లు అక్కడ అడుగుపెడితే...
ప్రభుత్వ ఆధీనంలోని భద్రతా దళాలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పంజ్‌షీర్‌కు చేరుకున్నట్లు మసౌద్ తెలిపారు. తాలిబన్లు తమతో యుద్ధానికి వస్తే రక్తపాతం తప్పదని హెచ్చరించారు. తాలిబన్లు ఇదే పంథాలో కొనసాగితే.. వారు ఎక్కువ కాలం నిలబడలేరని అన్నారు. చర్చలు మాత్రమే సమస్యకు పరిష్కార మార్గమని తాలిబన్లు గ్రహించేలా చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికైతే తాలిబన్లు పంజ్‌షీర్ పరిసర ప్రాంతాల్లోకి కూడా అడుగుపెట్టలేదని చెబుతున్నారు. నిజానికి తాలిబన్ల లక్ష్యం పంజ్‌షీర్‌ను చుట్టముట్టడమే తప్ప... లోపలికి ప్రవేశించే సాహసం వారు చేయలేరని అంటున్నారు. ఇందుకు భిన్నమైన వాదన కూడా లేకపోలేదు. తాలిబన్లు గనుక పంజ్‌షీర్‌లోకి ప్రవేశిస్తే... వారిని నిలువరించడం మసౌద్ వల్ల కాదని అబ్దుల్ సయ్యద్ అనే ఇండిపెండెంట్ రీసెర్చర్ ఒకరు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలలకు మించి వారు తాలిబన్లను ప్రతిఘటించలేరని పేర్కొన్నారు.

పంజ్‌షీర్ కేంద్రంగా తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహాలు
ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ మసౌద్‌తో కలిసి పంజ్‌షీర్ కేంద్రంగా తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహాలు రచిస్తున్నారు. సాయుధ పంథాలోనే తాలిబన్లను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే యాంటీ తాలిబన్ శక్తులు బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాల నుంచి తాలిబన్లను తరిమేశాయి. అయితే ఇందులో బను జిల్లాను తిరిగి తాలిబన్లు తమ చేజిక్కించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు జిల్లాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండగా.. మున్ముందు మరిన్ని జిల్లాలు తమ ఆధీనంలోకి వస్తాయని ధీమాగా చెబుతున్నారు. అయితే తాలిబన్లు ఆ 2 జిల్లాలను కూడా తిరిగి తమ చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

వారి పైనే దేశం ఆశలు...
తాలిబన్లపై పోరాడేందుకు ఎంతకైనా సిద్ధమని ప్రజలు చెబుతుండటంతో అమృల్లా సలేహ్... ఈ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ పిరికి పందలా దేశాన్ని వదిలి పారిపోవడంతో... దేశాన్ని తాలిబన్ల నుంచి కాపాడేందుక అమృల్లా సలేహ్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం ఆ హక్కు తనకుందని చెప్పారు. ప్రస్తుతం సలేహ్,మసౌద్ నాయకత్వం పైనే ఆ దేశ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

పంజ్‌షీర్ అంటే సింహాలగడ్డ...
పంజ్‌షీర్ అంటేనే సింహాల గడ్డగా పేరు ఉంది. పంజ్‌షీర్ అంటే ఐదు సింహాలని చెబుతారు. పేరుకు తగ్గట్లే... ఏ పోరాటమైనా ఇక్కడి ప్రజలు వెన్ను చూపరు. 1980ల్లో సోవియెట్ యూనియన్ గానీ,1990ల్లో తాలిబన్లు గానీ పంజ్‌షీర్‌ను టచ్ చేయలేకపోయారు. ఆఫ్గన్ రాజధాని కాబూల్‌కు 150కి.మీ దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఈ ప్రావిన్స్ ఉంది. ఇక్కడ దాదాపు లక్షన్నర జనాభా ఉంటారు. అత్యధికులు తజిక్ జాతి ప్రజలే. అమెరికా,నాటో దళాల స్నేహంతో ఈ ప్రావిన్స్ మరింత శక్తివంతంగా తయారైంది. పంజ్‌షీర్ తిరగబడితే తాలిబన్లు నిలవగలుగుతారా... లేక చరిత్రను తిరగరాస్తూ తొలిసారి పంజ్‌షీర్‌ను వారు జయిస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications