అత్యంత గడ్డు పరిస్థితుల మధ్య- యూఎస్ గడ్డపై మోదీ.. మేజిక్: 50 లక్షల మంది ఆశలు
Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.
ఏరివేయడానికి రంగం సిద్దం..
అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించి ఇంటికి పంపించింది. మలిదశలో మరి కొందిరిని ఏరివేయడానికి రంగం సిద్దం చేసింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.

గడ్డు పరిస్థితుల మధ్య..
ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఆయన భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాల సమయంలో ఆయన వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. మేరీల్యాండ్‌లోని ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యారు.
ఘన స్వాగతం..
అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాట్రా, అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా 1651, పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్ హౌస్‌కు చేరుకున్నారు. వైట్ హౌస్‌లో అధ్యక్షుడితో అధికారిక సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాధితనేలు, ప్రధానమంత్రులు బస చేస్తుంటారిక్కడ.
బ్లెయిర్ హౌస్ వద్ద భారీ సంఖ్యలో..
ఓ మోస్తరు వర్షంలోనూ జాతీయ పతాకాలను చేతబట్టుకుని బ్లెయిర్ హౌస్ వద్ద భారీ సంఖ్యలో బారులు తీరిన ప్రవాస భారతీయులను పలకరించారు మోదీ. వారితో ముచ్చట్లాడారు. ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినదించారు ప్రవాస భారతీయులు.
డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి..
తన అమెరికా పర్యటనలో భాగంగా మోదీ.. డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ కానున్నారు. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయం దీనికి వేదిక. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయనతో మోదీ భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని.
వివిధ అంశాలు చర్చకు..
డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే భేటీలో వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్, రక్షణరంగంలో పరస్పర సహకారం, ఉగ్రవాద అణచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో- పసిఫిక్ సెక్యూరిటీ.. వంటి కీలకాంశాలపై ట్రంప్- మోదీ మధ్య చర్చలు సాగుతాయి. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపైనా సంతకాలు పెట్టే అవకాశాలు లేకపోలేదు.
అక్రమ వలసదారుల వ్యవహారం..
అదే సమయంలో- అక్రమ వలసదారుల వ్యవహారం వారిద్దరి మధ్య ప్రస్తావనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్రమ వలసదారులను క్రిమినల్స్‌గా ట్రీట్ చేస్తూ, కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి మరీ వారిని స్వదేశానికి పంపించిన విధానం పట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసిన విషయం తెలిసిందే.
5.4 మిలియన్ల మంది..
అమెరికాలో 5.4 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తోన్నారు. 3,50,000 మంది విద్యార్థులు దీనికి అదనం. ఈ పరిస్థితుల్లో అక్రమ వలసదారుల సమస్య తెరమీదికి రావడం వల్ల రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా దీన్ని పరిష్కరించుకోవాలని కేంద్రం భావిస్తోంది.












Click it and Unblock the Notifications