వాషింగ్టన్‌లో మోదీకి వర్షం ఘన స్వాగతం: వానలో తడుస్తున్నా చెక్కు చెదరక జాతీయ గీతాలాపన
వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మలి మజిలీకి చేరుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి లాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్‌కు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే వాషింగ్టన్‌లోని జాయింట్ ఎయిర్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు.
మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవ్వాళ వైట్‌హౌస్‌లో ఈ విందు ఏర్పాటు కానుంది. అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించబోతోండటం మోదీకి ఇది రెండోసారి. ఈ రెండు కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

తన పర్యటన సందర్భంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ కానున్నారు. 23వ తేదీన రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన డయాస్పోర రిసెప్షన్‌లో మోదీ పాల్గొంటారు. దీనికి భారత సంతతికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు హాజరు కానున్నారు.
కాగా- జాయింట్ ఎయిర్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీ ల్యాండ్ అయ్యే సమయానికి భారీ వర్షం కురిసింది. ఆయన కోసం అధికారులు గొడుగులను సిద్ధం చేశారు. అయినప్పటికీ.. ఆయన వాటిని వినయోగించలేదు. గొడుగు లేకుండా వర్షంలో తడుస్తూ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్- అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు.

విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ ఇంటర్ కాంటినెంటల్ విల్లార్డ్‌కు చేరుకున్నారు. జాతీయ పతాకాలను చేత పట్టుకుని హోటల్ బయట వందల సంఖ్యలో ఎదురు చూస్తోన్న ప్రవాస భారతీయులను పలకరించారు మోదీ. వారికి అభినందనలు తెలియజేస్తూ ముందుకు సాగారు. వారు అందించిన పుష్పగుచ్ఛాలను స్వీకరించారు. పిల్లలతో ఆప్యాయంగా చేతులు కలిపారు. పెద్దలకు శిరసు వంచి నమస్కరించారు.

అమెరికా పర్యటన ముగిసిన అనంతరం మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో ఈజిప్టుకు బయలుదేరి వెళ్తారు. ప్రఖ్యాత అల్ హకీమీ మసీదును సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. బోహ్రా కమ్యూనిటీ పునరుద్ధరించిన మసీదు ఇది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ హాజరైన విషయం తెలిసిందే. ఆయన ఆహ్వానం మేరకు ప్రధాని ఈజిప్టు పర్యటన తలపెట్టారు. ప్రధానిగా మోదీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications