జెలెన్ స్కీకి ప్రధాని మోదీ ఫోన్.. శాంతి చర్చల్లో సహకరిస్తామని హామీ
ఉక్రెయిన్ రష్యా యుద్ధం గత మూడేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా భీకరమైన దాడులు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా వందల కొద్దీ డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యాకు 50 రోజుల అల్టిమేటం జారీ చేశారు. యుద్ధం ఆపేసి రష్యా శాంతి చర్చలకు రావాలని సూచించారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్ మాటలను లెక్కచేయలేదు. దీంతో ట్రంప్ మరోసారి రష్యాపై నిప్పులు చెరిగారు. రష్యాపై భారీగా టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని భావించిన అమెరికా.. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్ పై టారిఫ్ లు విధించారు ట్రంప్. భారత్ పై 50 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ లో సంభాషించారు. రష్యా దాడులపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు జెలెన్ స్కీ. ఉక్రెయిన్ కు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
I had a long conversation with the Prime Minister of India @narendramodi. We discussed in detail all important issues – both of our bilateral cooperation and the overall diplomatic situation. I am grateful to the Prime Minister for his warm words of support for our people.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 11, 2025
I… pic.twitter.com/Lx9b3sMAbb
ఈ సంభాషణలో ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడులను వివరించారు జెలెన్ స్కీ. ఇటీవల జపోరిజరియా ప్రాంతంలో ఓ బస్సులో రష్యా బాంబులు వేసిందని.. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డట్లు ప్రధాని మోదీకి వివరించారు. ఓ వైపు ఇరు దేశాల మధ్య శాంతి కోసం చర్చలు జరుపుతున్నా.. రష్యా మాత్రం దాడులు చేస్తూనే ఉందని సీజ్ ఫైర్ కు ససేమిరా అంటోందని జెలెన్ స్కీ.. ప్రధాని మోదీకి తెలిపారు. ఈ యుద్ధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ చర్చల్లో ఉక్రెయిన్ పాల్గొనాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లేకుండా చర్చలు సఫలం కావని తేల్చి చెప్పారు.

ఈ విషయంపై ప్రధాని మోదీ మరోసారి ఉక్రెయిన్ కు భరోసా ఇచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చేకూర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మరోవైపు ఆగస్టు 15న అమెరికాలోని అలాస్కాలో జరగనున్న ట్రంప్- పుతిన్ సమావేశంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఈ సమావేశం ముగింపు పలుకుతుందని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు దేశాలు తమ తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications