ప్రధాని మోదీ రిక్వెస్ట్‌కు పోప్ ఓకే: భారత పర్యటనకు అంగీకారం
క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటనకు రానున్నారు. ఇదివరకు వాటికన్ సిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ చేసిన విజ్ఞప్తిని పోప్ అంగీకరించారు.
రోమ్: క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు వాటికన్ సిటీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ఆయన భారత్ లో పర్యటించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ఆయన ఆసియా దేశాల పర్యటనకు రానున్నారు. అందులో భాగంగా భారత్ ను కూడా సందర్శిస్తారని వివరించింది. అది ఎప్పుడనేది వాటికన్ సిటీ ఇంకా ఖరారు చేయలేదు.
2021 అక్టోబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాటికన్ సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. పోప్ ఫ్రాన్సిస్ తో సుమారు గంటపాటు ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధాని గౌరవార్థం బైబిల్ ను బహూకరించారు. అదే సమయంలో భారత పర్యటనకు రావాల్సిందిగా మోదీ విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆయన దీనికి అంగీకరించారు. తాజాగా ఇది కార్యరూపం దాల్చబోతోంది.

తాను భారత పర్యటనకు వెళ్లనున్నట్లు స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. కాంగో, దక్షిణ సూడాన్ లల్లో ఆరు రోజుల పాటు పోప్ ఫ్రాన్సిస్ పర్యటించారు. ఇవ్వాళ ఈ పర్యటన ముగిసింది. దక్షిణ సూడాన్ నుంచి తన పాపల్ ఫ్లైట్లో రోమ్ కు బయలుదేరారు. ఇది ఆయన అధికారిక విమానం. తాజాగా ఆయన ఈ విమానం నుంచే విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది చివర్లో మంగోలియాను సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి భారత్ కు వెళ్తానని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే- 1999 తరువాత భారత పర్యటనకు రానున్న తొలి పోప్ ఆయనే అవుతారు. 1999లో అప్పటి పోప్ జాన్ పాల్ భారత్ లో పర్యటించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయితో భేటీ అయ్యారు. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువత ఇప్పటివరకు మరే ఇతర పోప్ కూడా భారత పర్యటనకు రాలేదు. తాజాగా పోప్ ఫ్రాన్సిస్.. భారత్ లో పర్యటించడానికి అంగీకరించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన తాను ఫ్రాన్స్ లోని మెర్సిల్లె సిటీని సందర్శించనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. అక్కడ ఏర్పాటయ్యే బిషప్ ల సమావేశంలో పాల్గొంటానని అన్నారు. అనంతరం అక్కడి నుంచి మంగోలియాకు వెళ్తానని పేర్కొన్నారు. మంగోలియా తరువాత తన తదుపరి పర్యటన షెడ్యూల్ లో భారత్ ఉంటుందని వివరించారు. 2024లో తాను భారత్ ను సందర్శిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications