140 కోట్ల భారతీయులకు అంకితం, రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. తూర్పు ఐరోపా పర్యటనలో భాగంగా రోమానియా చేరుకున్న ఆమెకు అక్కడి ప్రముఖ 'బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్' అత్యున్నత గౌరవ డాక్టరేట్ "డాక్టర్ హానరిస్ కాసా" పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. తనకు దక్కిన ఈ గొప్ప గౌరవాన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. భారత్, రోమానియాల మధ్య ఉన్న సుదీర్ఘకాల స్నేహబంధానికి, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న ఆత్మీయతకు ఈ పురస్కారం నిదర్శనమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

జీవితాన్ని మార్చేది చదువు ఒకటే!
ఒక సాధారణ గ్రామం నుంచి వచ్చి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన తన జీవిత ప్రయాణాన్ని ఈ వేదికగా రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. మనిషి జీవితంలో, సమాజంలో గొప్ప మార్పును తీసుకరాగల ఏకైక శక్తే విద్య అని ఉద్ఘాటించారు. పూర్వం తాను ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రోజులను ప్రస్తావిస్తూ.. ఒక చిన్న తరగతి గది మొత్తం కుటుంబాన్ని, ఒక సమాజపు భవిష్యత్తునే పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాకూడదని, సమ్మేళిత, సమన్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలని పిలుపునిచ్చారు.
సాంకేతిక యుగంలో నైతికత ముఖ్యం
నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో విశ్వవిద్యాలయాల బాధ్యత మరింత పెరిగిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు ఎంత వేగంగా వస్తున్నప్పటికీ, విజ్ఞానానికి నైతికత, మానవత్వం, విచక్షణ తోడవ్వాలని స్పష్టం చేశారు. యువత కేవలం ఉద్యోగాలు, కెరీర్ మైలురాళ్లతోనే విజయాన్ని కొలవకుండా.. సమాజానికి వారు చేసే మంచి పనులు, పాటించే మానవీయ విలువల ఆధారంగానే నిజమైన విజయం ఆధారపడి ఉంటుందని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
విద్యా రంగంలో బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలు
భారత్-రోమానియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన బలమైన సంబంధాలు ఉన్నాయని రాష్ట్రపతి చెప్పారు. దశాబ్దాలుగా వైద్యం, ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో భారతీయ విద్యార్థులకు రోమానియా వర్సిటీలు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇరు దేశాల యూనివర్సిటీల మధ్య ఉమ్మడి పరిశోధనలు, విద్యార్థులు , అధ్యాపకుల మార్పిడి ప్రోగ్రామ్‌లు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. ఐరోపా పర్యటన ముగింపు దశలో రాష్ట్రపతికి దక్కిన ఈ గౌరవం భారత్-రోమానియా దౌత్య సంబంధాలలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.












Click it and Unblock the Notifications