మగ-మిగ-మెగా
Modi Trump meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఇద్దరు నేతల మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరంచుకుంది.
బ్రిక్స్‌పై అమెరికా 100 శాతం టారిఫ్..
అనంతరం జాయంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. మోదీ, ట్రంప్. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానాలను ఇచ్చారు. భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్‌పై అమెరికా 100 శాతం టారిఫ్ విధించదలిచిన నేపథ్యంలో- ఎక్కువగా ట్రేడ్- టారిఫ్‌పైనే ప్రశ్నోత్తరాలు సాగాయి.

2030 నాటికి..
ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి భారత్- అమెరికా మధ్య 500 బిలియన్ డాలర్ల మేర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యానికి అదనంగా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు సహా అనేక రంగాల్లో అమెరికా- భారత్ కలిసి పని చేస్తాయని, ఇంధనం, సహజవాయు రంగాల్లో పరస్పరం బలంగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించన వాణిజ్య ఒప్పందాలపై అతి త్వరలోనే సంతకాలు చేస్తామనీ అన్నారు.
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్
ఈ సందర్భంగా మోదీ వికసిత్ భారత్ గురించి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రస్తావనకు తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ స్వదేశానికి ప్రాధాన్యత ఇస్తుంటారని, మొదటి టర్మ్‌లోనూ అది ప్రస్ఫూటంగా కనిపించిందని అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) వ్యూహాన్ని అనుసరిస్తోన్నారని చెప్పారు.

గొప్పగా తీర్చిదిద్దడానికి
రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నారని మోదీ పేర్కొన్నారు. ఆ దిశగా డొనాల్డ్ ట్రంప్ పరిపాలన సాగుతోందని ప్రశంసించారు.
మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్..
అదే సమయంలో తాము కూడా వికసిత్ భారత్- 2047 కాన్సెప్ట్‌ను రూపొందించుకున్నామని గుర్తు చేశారు. వికసిత్ భారత్‌ను ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తే- మేక్ ఇండయా గ్రేట్ ఎగైన్ (MIGA) అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం భారత్- అమెరికా అన్ని రంగాల్లోనూ కలిసి పని చేస్తే మెగా పార్ట్‌నర్‌షిప్‌గా ఎదుగుతాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications