బంగ్లాదేశ్: మోడీ పర్యటనకు నిరసనగా ఆందోళనలు, పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి
న్యూఢిల్లీ/ఢాకా: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ కొందరు చిట్టగాంగ్ నగరంలో ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో నలుగురు ఆందోళనకారులు మరణించారని అక్కడి అధికారులు తెలిపారు.
'ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో మేము వారిని చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపాం' అని స్థానిక పోలీసు అధికారి రఫీకుల్ ఇస్లాం మీడియాకు తెలిపారు.

ప్రధాని మోడీ పర్యటిస్తున్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా పలువురు ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఇక్కడ కూడా పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడంతో పదుల సంఖ్యలో నిరసనకారులు, ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.
అంతకుముందు, బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం లభించి అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోడీకి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. అనంతరం హసీనాతో కలిసి మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. 1971లో తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న బంగ్లాదేశ్‌కు భారత్ విముక్తి కల్పించిందన్నారు.
ఈ పోరాటంలో తాను కూడా పాల్గొన్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. అంతే కాదు తన తొలి పోరాటాల్లో అది కూడా ఒకటన్నారు. అప్పటి పోరాటానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లా విముక్తి పోరాటం జరిగినప్పుడు తాను 20 ఏళ్ల కుర్రాడిగా ఉన్నానని, భారత్‌లో బంగ్లా విముక్తి పోరుకు మద్దతుగా స్నేహితులతో కలిసి సత్యాగ్రహం చేసినట్లు మోడీ తెలిపారు. అప్పుడు సత్యాగ్రహం చేసినందుకు జైలుకు కూడా వెళ్లానన్నారు.












Click it and Unblock the Notifications