వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదీర్ ఖాన్: భోపాల్‌లో పుట్టిన ఈ పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త 1986లో 'అణు బాంబు హెచ్చరికలు' ఎందుకు చేశారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డాక్టర్ కదీర్ ఖాన్

1987 జనవరి 27 సాయంత్రం. పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం ఈ-7లో తన నివాసంలో ఉన్నారు.

ఒక సెక్యూరిటీ అధికారి ఆయనతో మీకోసం ఎవరో వచ్చారని చెప్పారు. వారిలో పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ కూడా ఉన్నారన్నారు. వాళ్లను డ్రాయింగ్ రూంలో కూర్చోపెట్టమని కదీర్ ఖాన్ చెప్పారు.

కదీర్ ఖాన్ వాళ్లను కలవడానికి వెళ్లినపుడు, ముషాహిద్ హుస్సేన్ తనతో వచ్చిన వ్యక్తిని కులదీప్ నయ్యర్ అని పరిచయం చేశారు. భారత్‌లో పంజాబ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్, ముషాహిద్ హుసేన్ పెళ్లికి పాకిస్తాన్ వచ్చారు.

ముగ్గురూ టీ తాగుతూ భారత పాకిస్తాన్ సంబంధాల నుంచి రెండు దేశాల చరిత్ర, హిందూ ముస్లిం సంబంధాలు, పాకిస్తాన్ అణు కార్యక్రమం వరకూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అదే సమయంలో డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ పర్యవేక్షణలో పాకిస్తాన్ అణు కార్యక్రమం ప్రారంభమైంది.

బీబీసీతో మాట్లాడిన కదీర్ ఖాన్ ఆరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు.

"ముషాహిద్ హుస్సేన్ పెళ్లి చేసుకుంటున్నారు. కులదీప్ నయ్యర్ ఆయన పెళ్లికి వచ్చారు. ముషాహిద్ ఆయన్ను విమానాశ్రయం నుంచి నేరుగా మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంట్లో నౌకర్లు ఉండరు కాబట్టి, నా భార్య మాకోసం టీ పెట్టి ఇచ్చింది. కులదీప్ నయ్యర్ నాతో మాది సియాల్‌కోట్, ఇప్పుడు న్యూ దిల్లీలో ఉటున్నాను. మీది భోపాల్. మీరు ఇప్పుడు ఇస్లామాబాద్‌లో ఉంటున్నారు అన్నారు".

"భారత విభజన శాపం లాంటిదని కులదీప్ నయ్యర్ నాతో చెప్పాలనుకున్నారు. నేను, ఆయనతో మీరు చెప్పింది ఇప్పుడు చరిత్రలో భాగం. చరిత్రను ఎవరూ మార్చలేరు. ముందుకెళ్లిపోవాలి. ఆ నిజాన్ని అంగీకరించాలి" అన్నాను.

"తర్వాత, కులదీప్ నయ్యర్ నాతో మీరు పది బాంబులు తయారుచేస్తే, మేం వంద బాంబులు తయారు చేస్తాం అన్నారు. నేను అంత భారీగా బాంబులు తయారు చేయాల్సిన అవసరం లేదు. రెండు వైపులా మూడు లేదా నాలుగు చాలు" అన్నాను.

నేను ఆ మాటల మధ్యలో "మాకు వీలైనంత తక్కువ సమయంలోనే బాంబు తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది" అన్నాను.

"తర్వాత, కులదీప్ నయ్యర్ నాతో జరిగిన ఆ అనధికారిక సంభాషణను ఇంటర్వ్యూగా మార్చేసి లండన్ అబ్జర్వర్‌కు 2 వేల పౌండ్లకు అమ్మేశారు. అది ఇంటర్వ్యూ కాదు. టీ తాగుతూ మేం పిచ్చాపాటీగా మాట్లాడిన మాటలు" అని డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ ఆరోపించారు.

కులదీప్ నయ్యర్

రాజస్థాన్, పంజాబ్ సెక్టార్లలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పాకిస్తాన్, భారత్ సైన్యం అమీతుమీకి సిద్ధమైన సమయంలో ఇదంతా జరిగింది.

అప్పుడు సరిహద్దుకు రెండు వైపులా సైనిక దళాలు మోహరించి ఉన్నాయి. వైమానిక దళం 'హై అలర్ట్‌'లో ఉంది. సరిహద్దు దగ్గరకు ఫిరంగులు చేరుకున్నాయి. ఈ సంక్షోభాన్ని 'బ్రాస్‌టక్'(ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఎక్సర్‌సైజ్) అంటారు.

దీనిని పాకిస్తాన్ తమ భద్రతకు ముప్పుగా భావించంది. వీలైనంత త్వరగా అణ్వాయుధాలు సిద్ధం చేయాలని పాకిస్తాన్ పాలకులు సీరియస్‌గా అనుకోడానికి అది కారణమైంది.

1986 చివరి మూడు నెలల్లో భారత సైన్యం బ్రాస్‌టక్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ జరిగింది. ఉపఖండం చరిత్రలో డివిజన్, కోర్ స్థాయిలో జరిగిన అతిపెద్ద మిలిటరీ ఎక్సర్‌సైజ్ ఇదే.

బ్రాస్‌టక్ చూసి పాకిస్తాన్ భయపడింది. ఆ సమయంలో పాకిస్తాన్ అణు కార్యక్రమం ప్రారంభ దశలో ఉంది. ఆ తర్వాత అది అధికారికంగా అణ్వస్త్ర హోదాను సాధించడానికి 12 ఏళ్లు పట్టింది.

ఇటు లండన్ అబ్జర్వర్‌లో వచ్చిన కులదీప్ నయ్యర్ ఇంటర్వ్యూలో డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ ఇచ్చిన సమాధానాలుగా చెబుతూ కొన్ని వ్యాఖ్యలు ప్రచురించారు.

"పాకిస్తాన్‌ను ఎవరూ నాశనం చేయలేరు. మేం అంత తక్కువేం కాదు. మా దేశం శాశ్వతంగా ఉండడానికే ఏర్పడింది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కరలేదు. మా ఉనికికే ముప్పు ఎదురైతే, మేం బాంబు ప్రయోగిస్తాం" అన్నారని రాశారు.

"పాకిస్తాన్ అణ్వాయుధాలకు ఉపయోగించడానికి సరిపడా యురేనియం సిద్ధం చేసింది. ల్యాబ్‌లో దానిని పరీక్షిస్తున్నారు" అని కూడా ఆయన చెప్పారని అందులో ప్రచురించారు.

కులదీప్ నయ్యర్ ఇంటర్వ్యూలో కదీర్ ఖాన్ చేసిన 'అణు హెచ్చరిక' పాకిస్తాన్ మీద భారత్ ఒక పెద్ద దాడి చేయకుండా అడ్డుకుందని అబ్జర్వర్ వార్తలను చూసిన పాకిస్తాన్ ప్రజలు, మీడియా అనుకున్నారు.

డాక్టర్ ఖాన్

"కులదీప్ నయ్యర్‌ దగ్గర మీరు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే పాత్రను పోషించాయా" అని బీబీసీ డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్‌ను అడిగింది.

దానికి ఆయన ఈ ఉద్రిక్తతలు తగ్గడానికి వేరే కారణం ఉందని చెప్పారు.

"జైపూర్‌లో రాజీవ్ గాంధీని కలిసినపుడు, జియా చేసిన హెచ్చరిక కూడా ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆయన రాజీవ్‌తో 'భారత సైన్యం వెంటనే వెనక్కు వెళ్లకపోతే, మేం అణు దాడికి ఆదేశిస్తాం అన్నారు. దాంతో, రాజీవ్ బెదిరిపోయారు. ఫలితంగా ఆయన భారత సైన్యాన్ని తక్షణం వెనక్కు పిలిపించాలని ఆదేశించారు" అన్నారు.

"నేను బ్రాస్‌టక్‌కు కొన్ని వారాల ముందు 'పది రోజుల నోటీస్‌లో అణు బాంబు తయారు చేసే సామర్థ్యం పాకిస్తాన్‌కు ఉందని జనరల్ జియాకు ఒక లేఖ రాశాను. అందుకే, ఆయనకు రాజీవ్ గాంధీతో మాట్లాడి, ఆయనను హెచ్చరించే అంత ధైర్యం వచ్చింది. వార్తల్లో వచ్చినట్టు 'అణు హెచ్చరిక' ఈ ఉద్రిక్తతలు తగ్గించడానినికి ఎలాంటి పాత్రా పోషించలేదు" అని కదీర్ ఖాన్ చెప్పారు.

ఆ తర్వాత 1987 ఫిబ్రవరిలో పాకిస్తాన్, భారత్ చివరికి సరిహద్దుల్లో మోహరించిన సైనికులను వెనక్కు పిలిపించాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు తెరదించాయి. విశ్వాస కల్పనకు ఎన్నో సైనిక ఒప్పందాలు జరిగాయి.

దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు స్టీవెన్ కోహెన్ దీనికి సంబంధించిన చరిత్రను వివరించే ప్రయత్నం చేశారు.

1994లో భారత ప్రొఫెసర్ పీఆర్ చారి, దక్షిణాసియా వ్యవహారాల ప్రముఖ అమెరికా నిపుణులు స్టీవెన్ కోహెన్ ఐదుగురు నిపుణులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో పాకిస్తాన్ డాక్టర్ పర్వేజ్ ఇక్బాల్ చీమా కూడా ఉన్నారు.

ఈ గ్రూప్ తర్వాత రెండు దేశాల సైనికాధారులతో, నేతలతో ఇంటర్వ్యూలు చేసింది. ఈ ఉద్రిక్తతలపై రెండు పుస్తకాలు ప్రచురించింది.

అందులో మొదటిది 'బ్రాస్‌టక్ అండ్ బియాండ్-ద క్రైసిస్ ఇన్ సౌత్ ఏసియా అండ్ ఇట్స్ అండర్‌స్టాండింగ్స్'.

ఈ పుస్తకంలో వరసగా జరిగిన సైనిక ఘటనలు, బ్రాస్‌టక్ సైనిక సంక్షోభంతో తలెత్తిన ఉద్రిక్తతల వల్ల సరిహద్దులకు రెండు వైపులా జరిగిన రాజకీయాలు, దౌత్య ఘటనలకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి.

డాక్టర్ అబ్దుల కదీర్ ఖాన్ వ్యాఖ్యలుగా చెబుతున్న 'అణు హెచ్చరిక' రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఏ పాత్రా పోషించలేదని ఈ గ్రూప్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే డాక్టర్ ఖాన్, కులదీప్ నయ్యర్‌ను కలవడానికి ముందే ఈ ఉద్రిక్తతలకు తెరపడ్డాయి.

రెండు పక్షాల మధ్య సమాచార లోపం వల్ల వల్ల ఎన్నో అపార్థాలు ఏర్పడ్డాయని. దాని వల్ల సరిహద్దుకు రెండు వైపులా ఉద్రిక్తతలు పెరిగాయని కూడా గ్రూప్ గుర్తించింది.

రెండు దేశాల సైన్యం మధ్య అపార్థాల ఫలితంగా మొత్తం ఈ ప్రాంతమంతటా యుద్ధ వాతావరణం ఏర్పడిందని కూడా ఈ గ్రూప్ తమ పరిశీలనలో వివరించింది.

మెల్లమెల్లగా పెరిగిన ఉద్రిక్తతలు

ఈ గ్రూప్ తర్వాత 'ద ఫోర్ క్రైసిస్ అండ్ ద పీస్ ప్రాసెస్‌'లో బ్రాస్‌టక్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ సమయంలో రెండు దేశాల ఆర్మీ అధికారుల ఆలోచనలు ఎలా ఉన్నాయో, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో వర్ణించింది.

భారత పాలిత కశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల పరిస్థితి చేజారిపోతోంది. సిక్కు మిలిటెంట్లు స్వతంత్ర సిక్కు దేశం కోసం ఖలిస్తాన్ ఉద్యమం ప్రకటించారు.

దాంతో కశ్మీర్, ఖలిస్తాన్ రెండింటినీ భారత్ నుంచి దూరం చేయవచ్చని పాకిస్తాన్‌కు ధైర్యం వచ్చింది.

మరోవైపు, పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం చట్టబద్ధత సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. అటు సింధ్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, సింద్ జాతీయవాదుల నేతృత్వంలో జియాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

జనరల్ జియా సైనిక ప్రభుత్వానికి మద్దతిస్తున్న మత సంస్థ జమాత్-ఎ-ఇస్లామీ ఆ సమయంలో భారత్ చర్యలను దుశ్చర్యలుగా చెప్పడంలో అందరికంటే ముందుంది.

సరిహద్దుకు ఇరు వైపులా రెచ్చగొట్టే ప్రకటనలు, మాటల యుద్ధం నడుస్తోంది. అలాంటి సమయంలో సింధ్ ప్రాంతం మీద భారత్ దాడి చేయబోతోందని పాకిస్తాన్ మత ఛాందస సంస్థల నేతలు ప్రజలకు చెప్పడం ప్రారంభించాయి.

డాక్టర్ కదీర్ ఖాన్

రాజకీయ, సైనిక చర్యలు

దక్షిణ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడానికి రెండు దేశాల సైన్యం, రాజకీయ నేతల మధ్య సమాచార లోపమే ప్రధాన కారణం అని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు అమెరికాకు చెందిన స్టీవెన్ కోహెన్ అన్నారు.

1986 డిసెంబర్ మధ్యలో రెండు దేశాల సైన్యం ఎదురెదురుగా నిలిచి ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తున్నారా అన్నట్టు ఉండేది. కాస్త అపార్థాలు ఏర్పడినా లేక తప్పటడుగు పడినా అది ఒక మహా యుద్ధంగా మారిపోయుండేది.

ఈ గ్రూప్ రిపోర్ట్ ప్రకారం 1986 డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలు 1987 జనవరి 23 వరకూ నెలన్నరపాటు చాలా తీవ్రంగా ఉన్నాయి.

అప్పటివరకూ పాకిస్తాన్, భారత డీజీ మిలిటరీ ఆపరేషన్ పరస్పరం హాట్‌లైన్లో కూడా మాట్లాడుకోలేదు అని పరిశోధనలో తేలింది.

బ్రాస్‌టక్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ వెనుక భారత్‌కు వేరే ఉద్దేశం ఏదో ఉందని పాకిస్తాన్ సైన్యం సందేహిస్తూ వచ్చింది.

1986 డిసెంబర్‌లో పాకిస్తాన్ ఆర్టిలరీ బహావల్‌పూర్‌లో సరిహద్దుల దగ్గర టెంట్లు వేసిందని భారత మీడియా వార్తలు ప్రసారం చేసింది. కానీ సరిహద్దుకు రెండు వైపులా రహస్య కార్యకలాపాలు కొనసాగుతూనే వచ్చాయి.

1986లో పాకిస్తాన్ వైమానిక దళం హై-మార్క్ ఎక్సర్‌సైజ్ ప్రారంభించింది. అది పూర్తైన తర్వాత కూడా పీఏఎఫ్ శాటిలైట్ బేస్ పూర్తిగా యాక్టివ్‌గా ఉంది.

భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మ్‌డ్ డివిజన్ కదలికలతో భారత సైన్యం, వైమానిక దళాన్ని హై-అలర్ట్‌లో ఉంచిందని 1987 జనవరి 24న పాకిస్తాన్ ఆంగ్ల పత్రిక పాకిస్తాన్ టైమ్స్ వార్త ప్రచురించంది.

అదే రోజు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి నట్వర్ సింగ్ దిల్లీలోని పాకిస్తాన్ రాయబారిని పిలిపించారు. పాకిస్తాన్ సైన్యం ముఖ్యంగా ఆర్మ్‌డ్ డివిజన్ ముందుకు రావడాన్ని దూకుడుగా, రెచ్చగొట్టే చర్యలా ఉందని పాక్ ప్రభుత్వానికి ఒక సందేశం పంపించారు.

తర్వాత పాకిస్తాన్ ఆర్మీ తమ సైనికులకు ఆయధాల సరఫరా జరిగింది. పట్టణాల్లో ఉన్న జనాభా అంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. సరిహద్దుల దగ్గరున్న ప్రాంతాలు, వంతెనల దగ్గర మందు పాతరలు అమర్చారు. సైనికులకు, సైనికాధికారులకు సెలవులు రద్దు చేశారు.

ప్రధానమంత్రి మొహమ్మద్ ఖాన్ జునేజో బెంగళూరులో సార్క్ సదస్సు సమయంలో భారత ప్రధాని రాజీవ్ గాంధీని కలిసిన తర్వాతే రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయి రాజకీయ చర్చలు ప్రారంభం అయ్యాయని ఈ గ్రూప్ పరిశోధనలో చెప్పారు..

అక్కడ రాజీవ్ గాంధీ భారీ వ్యయం వల్ల బ్రాస్‌టక్ ఆర్మీ ఎక్సర్‌సైజ్‌ తగ్గిస్తున్నట్లు పాక్ ప్రధానితో చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది అబద్ధం, మోసం అని భావిస్తారు. ఎందుకంటే, అక్కడ క్షేత్రస్థాయిలో సైన్యం తగ్గించినట్లు కనిపించలేదు.

తర్వాత రెండు వైపులా రాజకీయ, దౌత్య చర్చలు కొనసాగాయి. చివరికి 1987 ఫిబ్రవరి 4న జరిగిన ఒక ఒప్పందంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది.

పోఖ్రాన్లో పరీక్షలు జరుపుతున్న ఇండియన్ ఆర్మీ (పాత ఫొటో)

పదే పదే అణు హెచ్చరికలు

భారత జర్నలిస్టు తన వార్తలో చెప్పినట్లు 'అణు హెచ్చరిక' చేయడం పాకిస్తాన్‌కు కొత్తేం కాదని స్టీవెన్ కోహెన్ నేతృత్వంలోని బ్రాస్‌టక్ స్టడీ గ్రూప్ ఒక నిర్ణయానికి వచ్చింది.

ఈ సంక్షోభ సమయంలో, అంతకు ముందు కూడా కదీర్ ఖాన్ సహా పాకిస్తాన్ అధికారులు అలాంటి ప్రకటనలు చేయడం మామూలే అన్నారు.

1980 మధ్యలో పాకిస్తాన్ అధికారులు అలాంటి అస్పష్ట, లేదా స్పష్టమైన ప్రకటనలు చేయడం సర్వ సాధారణంగా ఉండేది. తమ ఉనికికి ముప్పు వస్తే, అణ్వాయుధాలు ఉపయోగించడానికి సిద్ధం అని వారు ప్రకటనలు గుప్పించేవారు.

పిచ్చాపాటీగా మాట్లాడుతున్న సమయంలో భారత జర్నలిస్టుతో అలా అన్నానని డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ కూడా ధ్రువీకరించారు.

"భారత్‌లోని నగరాలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాం… అని మేం ప్రతి కొన్ని నెలలకూ ప్రకటనలు చేయాలని జనరల్ జియా నాకు చెబుతుండేవారు. ఆ సమయంలో అది అవసరం" అన్నారు.

డాక్టర్ ఖాన్, కులదీప్ నయ్యర్ ఆ రోజు కలిసే సమయానికే సంక్షోభం తొలగిపోయిందని, దీనిపై రీసెర్చ్ చేసిన గ్రూప్ కూడా చెప్పింది. ఎలాగోలా జనవరి 28 నాటికి ఆ ఉద్రిక్తతలకు తెరపడింది అని పేర్కొంది.

పదే పదే అణు హెచ్చరికలు చేసే పాకిస్తాన్ తీరు గురించి కూడా ఈ గ్రూప్ రిపోర్టులో చెప్పింది.

"మాటిమాటికీ అణ్వాయుధాలు ప్రయోగిస్తామని బెదిరించడం వల్ల భారత్ నుంచి ఎదురయ్యే ముప్పు తప్పిపోతుందని, తమకు భద్రత ఉంటుందని పాకిస్తాన్‌ నమ్ముతుంది అనేది తెలిసిన విషయమే" అంది.

ఈ సంక్షోభం ఫలితంగా పాకిస్తాన్‌కు రెండు ప్రయోజనాలు కలిగాయి.

భవిష్యత్తులో ఇలా ఏ సంక్షోభం ఎదురైనా ఉద్రిక్తతలు తగ్గించడానికి రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి భారత్-పాక్ కట్టుబడ్డాయి.

విశ్వాస పునరుద్ధరణకు ఇరు దేశాలు చాలా చర్యలు చేపట్టాయి. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఏర్పడిన కోల్డ్ వార్ వల్ల దక్షిణాసియాలో సైనిక అంశాల్లో ఉన్న అన్ని ఆంక్షలనూ ఎత్తివేశారు.

వీటిలో మొదటిది పరస్పరం అణు కేంద్రాలపై దాడికి చొరవ చూపించబోమని పాకిస్తాన్, భారత్ ఒప్పందం చేసుకున్నాయి.

దీనికి సంబంధించి ప్రతి కొత్త సంవత్సరంలో మొదటి రోజున రెండు దేశాలు తమ అణు కేంద్రాల జాబితాను ఇచ్చిపుచ్చుకుంటాయి.

ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఎన్నో విశ్వాస కల్పన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Qadir Khan this Bhopal-born Pakistani nuclear scientist make 'atomic bomb warnings' in 1986
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X