శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే: ఐదోసారి బాధ్యతలు, కేబినెట్లోనూ నో ‘రాజపక్స’
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా మాజీ పీఎం రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్పీ) నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
ఈ క్రమంలో శ్రీలంక నూతన కేబినెట్ ను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీవ్ర హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతున్న నిరసనలతో ప్రధానమంత్రిగా ఉన్న మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం దేశాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.

ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత విక్రమ సింఘేను ప్రధానమంత్రిగా నియమించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. బుధవారంనాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు గొడబాయ.. పార్లమెంటులో మెజార్టీ, ప్రజల విశ్వాసం పొందిన కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తానని వెల్లడించారు.
ఈ క్రమంలోనే మాజీ ప్రధాని విక్రమ సింగేతో చర్చలు జరిపన అనంతరం దేశ ప్రధానిగా ఆయనకు పగ్గాలు అప్పగించారు. మరోవైపు అధ్యక్ష అధికారాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నానన్న గొటబాయ రాజపక్స.. కొత్త మంత్రివర్గంలో తమ కుటుంబీకులెవరూ ఉండబోరని హామీ ఇచ్చారు.
కాగా, శ్రీలంకలో అధికార పార్టీతో పాటు పలు విపక్షాలు కూడా విక్రమసింఘేను ప్రధానిగా ఎన్నుకునేందుకు మద్దతు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంపై నిరసనల వల్ల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలను అమలులో ఉన్నాయి. అయితే తాజాగా ప్రజలకు ఊరట కల్పిస్తూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
కొన్ని గంటల పాటు కర్ఫ్యూను ఎత్తివేసి ప్రజల రాకపోకలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు గోటబయా రాజపక్స. మరోవైపు నేవల్ బేస్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని మహింద రాజపక్స సహా శ్రీలంక పొదుజన పెరుమున పార్టీకి చెందిన మరో 12 మంది నేతలపై ఆంక్షలు విధించారు. విదేశాలకు పరారు కాకుండా ఉండేందుకు వారిపై ట్రావెల్ బ్యాన్‌ను విధించారు.
గతంలో నాలుగుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించారు విక్రమ సింఘే
విక్రమసింఘే శ్రీలంక ప్రధానమంత్రిగా ప్రారంభ సమయంలో, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఎలామ్ (LTTE) నేతృత్వంలోని తిరుగుబాటును ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ, అతను బ్రూట్ ఫోర్స్ ఉపయోగించి కాకుండా శాంతి చర్చల ద్వారా జాతి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాడు.
1994 నుంచి 2001 వరకు, 2004 నుంచి 2015 వరకు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు.
2015లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అతను అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అంతర్జాతీయ సమాజంతో దేశం సంబంధాన్ని సరిచేయడానికి కూడా ప్రయత్నించారు. రాజకీయంగా ప్రభావవంతమైన బౌద్ధ సింహళ కుటుంబంలో జన్మించిన విక్రమసింఘే, విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చేరాడు.












Click it and Unblock the Notifications