ఈ చిన్నారి పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే (వీడియో)
మాన్ హట్టాన్ : రెస్టారెంట్ కు వెళ్లి.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. ఆర్డర్ టేబుల్ మీదకొచ్చాక.. ఆవురావురామంటూ ఆరగించేయడం చాలా కామన్. అదే సమయంలో.. పక్కన్నే ఎవరైనా ఆకలితో అలమటిస్తోన్న వ్యక్తులు కనిపిస్తే! మనకెందుకులే అనుకునేవారు ఉండొచ్చు. ఇష్టంగా ఆర్డర్ ఇచ్చినా సరే.. అవతలి వ్యక్తి కోసం ఆ ఫుడ్ ను త్యాగం చేసే వ్యక్తులు కూడా ఉండవచ్చు.
రుచి కోసం తినడం వేరు.. పచ్చి ఆకలితో కడుపు నిండడం కోసం తినడం వేరు. ఇదంతా పెద్దవాళ్లకయితే అర్థమవచ్చు. చిన్న పిల్లలకు ఇంత ఆలోచన ఉంటుందా? ఈ వీడియో చూశాక బుర్రలో నుంచి ఆ అభిప్రాయాలు చెరుపుకోవాల్సిందే. వయసు చిన్నదే కానీ మనసు మాత్రం చాలా పెద్దదని నిరూపించుకుంది ఎల్లా అనే ఈ చిన్నారి.
ఆ తర్వాత.. తన కూతురు దయా గుణాన్ని చూసి గర్వపడ్డ బాలిక తండ్రి ఎడీ స్కాట్.. అగస్టు 31వ తేదీన విషయం మొత్తాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తండ్రి ఎడీ స్కాట్ తో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఎల్లా తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంతలో రెస్టారెంట్ అవతల ఉన్న ఓ వ్యక్తి.. ధీనంగా.. ఆకలితో అలమటిస్తూ కూర్చోవడం ఎల్లా కంటపడింది.
చలించిపోయిన ఎల్లా మరో ఆలోచన లేకుండా.. తన ముందున్న ఫుడ్ ను తీసుకెళ్లి అతనికిచ్చేసింది. ఆ తర్వాత రెస్టారెంట్ లోకి వచ్చి.. కిటికీ వద్ద నిలబడి.. అతను తింటున్న దృశ్యాన్ని అలాగే చూస్తుండిపోయింది. ఆ చిన్నారి మంచి మనసును కళ్లకు కట్టేలా.. ఆమె తండ్రి ఎడీ స్కాట్.. దీన్నంతా తన సెల్ ఫోన్ కెమెరాతో రికార్డు చేశాడు.
ఎల్లాకు మూడేళ్ల వయసున్నప్పటి నుంచే ఇతరులకు సహాయం చేయాలని తనతో చెప్పేవాడినని.. అదే విషయాన్ని తాను ఆచరించేవాడినని, ఎల్లా మనసులో అది బలమైన ముద్ర వేయడంతో.. ఇతరులకు సహాయం చేసే గుణం ఎల్లాలో ఏర్పడిందని తండ్రి ఎడీ స్కాట్ చెప్పుకొచ్చాడు.
ఎల్లా చేసిన సహాయంపై స్పందిస్తూ.. చాలామంది నెటిజెన్స్ ఇప్పుడీ వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. 'నా కొడుకును సైతం ఇలాగే పెంచుతానంటూ..' చాలామంది నెటిజెన్స్ ఎల్లాను స్పూర్తిగా తీసుకుంటుండడం విశేషం.












Click it and Unblock the Notifications