హృదయవిదారకం: 31మంది మునిగిపోతుంటే చూస్తూ ఉండిన రెస్క్యూ టీం
యూరోప్: ఏజియన్ సముద్రంలో ఘోరం జరిగింది. శరణార్థులతో వస్తున్న ఓ చిన్న పడవ ప్రమాదంలో చిక్కుకుంది. ఆ పడవ మునిగిపోతుంటే... సమీపంలోనే ఉన్న రెస్క్యూ బృందం చూస్తూ ఉండిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 31మంది శరణార్థులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
ఏమీ చేయలేని తమ నిస్సహాయ స్థితికి, బాధపడటం తప్ప వారికి సహకరించలేకపోయామని రెస్క్యూ బృందం చెబుతోంది. ఆస్ట్రేలియా జాతీయుడు సిమాన్ లూయిస్, అతని బృందం గ్రీక్ దీవుల్లో భాగమైన లెస్బోస్ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఉండగా ఈ ఘటన జరిగింది.

సముద్ర జలాల్లో తిరుగుతున్న తమకు ఓ పడవ ప్రమాదంలో ఉన్నట్టు కనిపించిందని, దాని సమీపానికి వెళ్లి చూశామని, దాదాపు 31 మందితో ఉన్న పడవ తీరానికి చేరే పరిస్థితి లేదని తెలుసుకున్నామని, మహిళలు, చిన్నారులు ఉన్న ఆ పడవకు ఐదు మీటర్ల దూరంలో తాము ఆగిపోయామని సిమాన్ వెల్లడించారు.
వారు ఉన్న పడవ టర్కీ పరిధిలోని జలాల్లో ఉండటం, తాము రక్షిస్తే, తమపై ప్రజలను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తాయన్న భయంతోనే దూరంగా ఉండిపోయామన్నారు. 'జీవితమంటే, ఇదే. మునిగిపోతున్న వారిని చూస్తూ కూడా కాపాడలేకపోయాం. అంతర్జాతీయ జల నిబంధనలు అలా ఉన్నాయి. ఓ మహిళ తన బిడ్డను తీరం వైపు విసరడం కనిపించింది. గుండెలు పగిలే పరిస్థితిలో ఆమెను చూస్తూ ఉండిపోయామ'ని అన్నారు.












Click it and Unblock the Notifications