పుతిన్ మాస్టర్‌ప్లాన్: సిరియా ఫైటర్లను యుద్ధంలో దింపిన రష్యా: భారీగా రిక్రూట్‌మెంట్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మరింత తీవ్రతరమౌతోందే తప్ప తగ్గే ప్రసక్తే కనిపించట్లేదు. రెండు దేశాలు కూడా సై అంటే సై అంటోన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాల సంపూర్ణ మద్దతుతో ఉక్రెయిన్- తనకంటే బలమైన రష్యాను ఢీ కొడుతోంది. సమవుజ్జీగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.

దాడుల తీవ్రత రెట్టింపు..
రష్యా సైనిక బలగాల దాడులకు ధీటుగా స్పందిస్తోంది. సరిహద్దుల్లోని కొన్ని నగరాలను చేజార్చుకున్నప్పటికీ- రాజధాని కీవ్‌ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోన్న కొద్దీ- రష్యా మరింత తన దాడుల తీవ్రతను రెట్టింపు చేస్తోంది. మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. కీవ్‌ను సొంతం చేసుకోవడమే ప్రస్తుతం రష్యా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. దీన్ని స్వాధీనం చేసుకోగలిగితే- ఉక్రెయిన్‌పై పట్టు సాధించినట్టవుతుందని భావిస్తోంది. ఉక్రెయిన్ సైనిక బలగాల రక్షణ కవచాన్ని ఛేదించలేకపోతోంది.

సిరియా ఫైటర్లు..
ఈ పరిణామాల మధ్య రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిరియా ఫైటర్లను యుద్ధంలోకి దింపింది. అర్బన్ కొంబాట్‌లో ఆరితేరిన సిరియా ఫైటర్లను పెద్ద సంఖ్యలో తన సైన్యంలోకి నియమించుకుంటోన్నట్లు అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తన కథనంలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులను ఉటంకించింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన మీడియా సంస్థ కీవ్ ఇండిపెండెంట్ కూడా నిర్ధారించింది.

కీవ్‌ను ఆక్రమించుకోవడం..
రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో సహకరించడం, అక్కడి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో కీలక పాత్ర వహించడం.. అనే రెండు కారణాలతో రష్యా- సిరియన్ ఫైటర్లను రిక్రూట్ చేసుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైందని, ఇప్పటిదాకా ఎంతమందిని సైన్యంలోకి తీసుకుందనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉందని ప్రచురించింది. అర్బన్ కొంబాట్‌లో అనుభవం ఉన్నందున వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అంచనా వేసింది.

300 డాలర్ల జీతం..
ఒక్కో సిరియన్ ఫైటర్‌కు 200 నుంచి 300 డాలర్ల చొప్పున చెల్లించేలా ఆఫర్ ఇచ్చినట్లు స్పష్టం చేసిందా కథనం. ఆరు నెలల పాటు సైన్యంలో కొనసాగేలా కాంట్రాక్ట్‌ను కుదుర్చుకున్నట్లు అభిప్రాయపడింది. అంతర్యుద్ధ సమయంలో సిరియా ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిందని, దానికి ప్రతిఫలాన్ని ఇప్పుడు కోరినట్లు కనిపిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం అంచనా వేసింది. చెచెన్యా సైనిక బలగాలను కూడా రష్యా సంప్రదించిందని స్పష్టం చేసింది. చెచెన్ రిపబ్లిక్ నేత రంజాన్ కడిరోవ్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దిశగా చర్చించినట్లు పేర్కొంది.

పదేళ్లకు పైగా అనుభవం..
సిరియా గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసు. దశాబ్దాల కాలం పాటు అంతర్యుద్ధంలో కొనసాగిందా దేశం. భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను ఎదుర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులను ఎదుర్కొనడానికి సిరియా ప్రభుత్వం పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టింది. అర్బన్ యుద్ధంలో వారికి శిక్షణ ఇప్పించింది. ఆ అనుభవం ఉన్నందు వల్లే ఇప్పుడు రష్యా- సిరియా ఫైటర్లను తన సైన్యంలోకి తీసుకున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది.

ఎంతకీ దక్కకపోవడం వల్లే..
రాజధాని కీవ్‌ను సొంతం చేసుకోగలిగితే ఈ యుద్ధంలో సగం విజయాన్ని సాధించినట్టే అవుతుందని రష్యా భావిస్తోంది. ఆ లక్ష్యంతోనే కీవ్‌ను చుట్టుముట్టింది. విస్తృత దాడులను సాగిస్తోంది. అయినప్పటికీ- ఉక్రెయిన్ సైనికుల కవచాన్ని ఛేదించలేకపోతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితిని రష్యా ఎదుర్కొంటోంది. అందుకే- ఈ అర్బన్ యుద్దంలో మెరికల్లాంటి సిరియా ఫైటర్లను దింపి- వారి అనుభవంతో కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications