"ఉక్రెయిన్"తో యుద్ధంపై పుతిన్ షాకింగ్ కామెంట్స్.. చివరికి వచ్చేశాం !!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం ముగింపు దశకు వస్తోందని కీలక ప్రకటన చేశారు. మాస్కోలో జరిగిన రష్యా విక్టరీ డే వేడుకల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో, కాల్పుల విరమణ, శాంతి చర్చలకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే, యుద్ధం ముగింపునకు కచ్చితమైన కాలపరిమితిని గానీ, శాశ్వత శాంతి ఒప్పందం వివరాలను గానీ పుతిన్ ప్రకటించలేదు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని రష్యా వైపు మళ్లించాయి.
కాగా, పుతిన్ ఈ ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. తన సూచన మేరకు రష్యా, ఉక్రెయిన్‌లు మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు చర్చలు సాగుతున్నాయని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, పుతిన్ వ్యాఖ్యలు శాంతి ఆశలను మరోసారి చిగురింపజేశాయి.

ఉక్రెయిన్ నుండి ముప్పు ఉండవచ్చని భావించిన రష్యా, ఈసారి విక్టరీ డే వేడుకలను గతానికి భిన్నంగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, చిన్న కార్యక్రమంగా నిర్వహించింది. రెడ్‌స్క్వేర్‌పై పరేడ్‌లో ట్యాంకులు, ఇతర భారీ ఆయుధాలను ప్రదర్శించలేదు. బదులుగా, అధునాతన క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్‌లను డిజిటల్ స్క్రీన్‌లపై చూపించారు.
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, ఉత్తర కొరియా బలగాలు సైతం ఈ కవాతులో పాలుపంచుకున్నాయి. ఉక్రెయిన్‌తో శాశ్వత శాంతి ఒప్పందం కుదిరిన తర్వాతే తాను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా భేటీ అవుతానని పుతిన్ స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత రక్తపాతం సృష్టించిన యుద్ధంగా ఇది నిలిచింది.












Click it and Unblock the Notifications