రూ.80 వేల కోట్లు బొక్క.. కేవలం ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వల్లే !
వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కారణంగా దాదాపు రూ.80 వేల కోట్లు పోగొట్టుకున్నారు. బిగ్ షాక్ ఇస్తున్న ఈ వ్యవహారంలో అంత మొత్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తి రష్యాకు చెందిన ప్రముఖ బ్యాంకర్, టింకాఫ్ బ్యాంక్ (Tinkoff Bank) వ్యవస్థాపకుడు ఒలెగ్ టింకోవ్. ఆయన చేసిన ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తన జీవితాన్నే తలకిందులు చేసిందని చెప్పవచ్చు. అసలు ఏం జరిగింది ? అంత మొత్తం ఎలా పోయింది ?? తెలుసుకుందాం..
ఏం జరిగిందంటే..?
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధాన్ని బహిరంగంగా విమర్శిస్తూ ఒలెగ్ టింకోవ్ ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ యుద్ధం అర్థం లేనిది, సామాన్య ప్రజల జీవితాలను నాశనం చేస్తోంది అంటూ ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టుల వ్యవహారం రష్యా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. అప్పటికే దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యాపారవేత్తలపై కఠిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

దీంతో రష్యా ప్రభుత్వం టింకాఫ్ బ్యాంకును జాతీయం చేస్తామని హెచ్చరించింది. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. వ్యాపారం కొనసాగాలంటే తన వాటాను విక్రయించాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా టింకోవ్ తన వద్ద ఉన్న 35% వాటాను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. అయితే, ఈ విక్రయం పూర్తిగా అన్యాయమైన ధరకు జరిగింది. బ్యాంక్ అసలు మార్కెట్ విలువలో కేవలం 3 శాతం మాత్రమే చెల్లించి వాటాను స్వాధీనం చేసుకున్నారు. అలా మొత్తంగా ఏకంగా సుమారు రూ.80,915 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని సమాచారం.
బిలియనీర్ హోదాకు గుడ్‌బై..
ఈ ఒప్పందంతో టింకోవ్ తన సంపదలోని మెజారిటీ భాగాన్ని కోల్పోయారు. ఒకప్పుడు రష్యాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ఆయన.. ఈ ఒక్క ఘటనతోనే బిలియనీర్ హోదాను కూడా కోల్పోయారు. ఫోర్బ్స్ లిస్ట్ నుంచి కూడా ఆయన పేరు తొలగిపోయింది. ఇప్పటికే టింకోవ్ రష్యాను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడ్డారు. గతంలో క్యాన్సర్‌తో పోరాడిన ఆయన.. ఆరోగ్య కారణాలతో పాటు రాజకీయ ఒత్తిళ్ల వల్ల దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. రష్యా ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు ఎదురైన పరిణామాలు తన జీవితంలోనే అత్యంత చేదు అనుభవమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలకు ఒక హెచ్చరికగా మారింది. రాజకీయ వ్యవస్థలతో విభేదించడం ఎంత ప్రమాదకరమో టింకోవ్ ఉదాహరణగా నిలిచింది. సోషల్ మీడియా లో చేసిన ఒక్క పోస్ట్ కూడా ఒక సామ్రాజ్యాన్నే కూల్చగలదని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.












Click it and Unblock the Notifications