ఉలిక్కిపడ్డ రష్యా- మాస్కోలో ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !!
రష్యాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మాస్కోలో ఆ దేశ ఆర్మీకి చెందిన అత్యున్నత అధికారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొసప్రాణాలతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. కాల్పులు జరిగిన విషయాన్ని రష్యా ఆర్మీ ధృవీకరింది. ఈ ఉదంతంతో ఒక్కసారిగా రష్యా ఉలిక్కిపడింది.
ఆ అధికారి పేరు వ్లాదిమిర్ అలెక్సివ్. లెఫ్టినెంట్ జనరల్. కొద్దిసేపటి కిందటే ఆయన కాల్పులకు గురయ్యారు. అధికారిక నివాస భవనం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ జనరల్ స్టాఫ్ ప్రధాన డైరెక్టరేట్ డిప్యూటీ చీఫ్‌గా అలెక్సీవ్ పని చేస్తోన్నారు. 2023 జూన్‌లో కిరాయి సైన్యం అధిపతి యెవ్‌గనీ ప్రిగోజిన్ తిరుగుబాటు సమయంలో ఆయనతో చర్చలు జరిపిన కీలక అధికారులలో అలెక్సీవ్ ఒకరు.

రష్యా ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం- మాస్కో వాయవ్య ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అలెక్సీవ్‌ను పలుమార్లు కాల్చి పారిపోయారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక అనేక మంది రష్యన్ సీనియర్ అధికారులు హత్యకు గురయ్యారు. జనరల్ స్టాఫ్ ఆర్మీ ట్రైనింగ్ డైరెక్టరేట్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ కూడా ఇదే తరహాలో మరణించారు. డిసెంబర్ 22వ తేదీన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.
దీని తర్వాత ఇప్పుడు మళ్లీ వ్లాదిమిర్ అలెక్సివ్ కాల్పులకు గురి కావడం కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక దాడులు, కాల్పులు, పేలుళ్లకు ఉక్రెయిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రష్యా ఆరోపిస్తోంది. ఓటమిని అంగీకరించలేక.. ఇలా తమ దేశానికి చెందిన అత్యున్నత ఆర్మీ, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను పొట్టనబెట్టుకుంటోందని, దొంగదెబ్బ తీస్తోందని మండిపడుతోంది. కొన్ని ఘటనలకు ఉక్రేనియన్ సైనిక నిఘా సంస్థ బాధ్యత వహించింది కూడా. వ్లాదిమిర్ అలెక్సివ్ పై కాల్పులకు తెగబడిందెవరనేది ఇంకా తెలియరాలేదు.












Click it and Unblock the Notifications