మా లక్ష్యం ఐఎస్ఐఎస్ అంతం: రష్యా
మాస్కో/సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద స్థావరాలపై రష్యా దాడులను తీవ్రం చేసింది. మంగళవారం మధ్యదరా సముద్రంలో మొహరించిన జలాంతర్గామి నౌక నుంచి తొలిసారిగా క్షిపణులు ఉపయోగించి ఐఎస్ఐఎస్ స్థావరాలపై దాడులు చేశారు.
ఐఎస్ఐఎస్ స్థావరాలపై జలంతర్గామి నౌక నుంచి క్షిపణులతో దాడులు చేశామని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గె షోగు చెప్పారు. సబ్ మెరిన్ ను రంగంలోకి దింపామని ఆయన వివరించారు. అంతకు ముందు యుద్ద నౌకల నుంచి దాడులు చేసిన రష్యా ఇప్పుడు దాడులు మరింత ముమ్మరం చేసింది.
రోస్టోవ్-ఆన్-డాన్ సబ్ మెరిన్ నుంచి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించి సిరియాలోని రక్కా చుట్టుపక్కల ప్రాంతాలలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలను లక్షంగా చేసుకుని దాడులు చేశామని సెర్గె షోగు వివరించారు.

తాము విజయవంతంగా దాడులు జరిపామని ఆయన అన్నారు. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అయిల్ కంపెనీలు, గనుల ఫ్యాక్టరీలు, యుద్ధ సామాగ్రి డిపోలను ద్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గె షోగు తెలిపారు.
గత మూడు రోజుల నుంచి రక్కా, సిరియాలోని వివిద ప్రాంతాలలో ఉన్న 300 ఐఎస్ఐఎస్ స్థావరాలపై రష్యా మిలటరి జెట్స్ దాడులు చేసిందని ఆయన వివరించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అంతం చూసే వరకు తాము నిద్రపోమని రష్యా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications