విరుచుకుపడుతోన్న సౌదీ అరేబియా- యెమెన్ పై భీకర దాడి
హౌతీల దాడులతో భారీగా నష్టపోతూ వచ్చిన సౌదీ అరేబియా ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. యెమెన్, హౌతీలపై భారీ దాడులకు శ్రీకారం చుట్టింది. రాజధాని సనా ప్రావిన్స్‌లోని అల్ షరియాలో గల హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ వైమానిక దాడుల్లో హౌతీలకు చెందిన పలు స్థావరాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో 33 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారని హౌతీ ప్రతినిధి అనీస్ అలస్బాహి వెల్లడించారు. ఎనిమిది మంది మహిళలు, 13 మంది పిల్లలు ఉన్నట్లు వివరించారు. సౌదీ అరేబియా బాంబు దాడుల ధాటికి పలు నివాసాలు నేలమట్టం అయ్యాయని, వాటి శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దాడికి గురైన ప్రాంతాల్లో సహాయం అందించడానికి వెళ్లిన పారామెడికల్ సిబ్బంది కూడా ఈ దాడుల్లో గాయపడినట్లు చెప్పారు.

ఈ దాడుల అనంతరం అక్కడ చోటు చేసుకున్న విధ్వంసకర పరిస్థితులను హౌతీ తిరుగుబాటులదారులకు చెందిన అధికారిక ఛానల్ అల్ మసీరా ప్రసారం చేసింది. అల్ షరియా చుట్టూ భయానక దృశ్యాలు కనిపించాయి. అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తోన్న వాహనాలతో భీతావహ వాతావరణం నెలకొందక్కడ. సామాన్య పౌరులను సౌదీ అరేబియా లక్ష్యంగా చేసుకుందని యెమెన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ వైమానిక దాడులకు ప్రతిగా సౌదీ అరేబియా భూభాగంపై ఎదురుదాడికి దిగారు హౌతీ తిరుగుబాటుదారులు. ఆరుచోట్ల భారీ సైనిక ఆపరేషన్లు నిర్వహించినట్లు హౌతీ మిలిటెంట్ గ్రూప్ స్పష్టం చేసింది. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అరామ్కో ఆయిల్ రిఫైనరీలు, సౌదీ అరేబియా ఆర్మీ క్యాంప్ లను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరి వెల్లడించారు. ఈ సైనిక చర్యల్లో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు వినాశకర డ్రోన్లను ఉపయోగించినట్లు చెప్పారు.
2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందానికి ఈ ఏడాది జులైలో తూట్లు పడ్డాయి. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చుతూ వస్తోన్నాయి. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా వ్యవహరిస్తోందని, అంతర్యుద్ధానికి కారణమైందనీ హౌతీలు ఆరోపిస్తోన్నారు. ఈ తాజా దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటోన్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో యెమెన్ యుద్ధం మళ్లీ తీవ్రం కావడం కలవరపెడుతోంది. ఐక్యరాజ్యసమితి శాంతి చర్చలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ దాడులకు బ్రేకులు పడట్లేదు. మానవతా దృక్పథంతో యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయకపోతే యెమెన్‌లో మానవతా సంక్షోభం మరింత దిగజారే ప్రమాదం ఉందని ఐరాస ఇది వరకే హెచ్చరించింది.












Click it and Unblock the Notifications
