భారత్ కు పాక్ తీవ్రవాదుల అప్పగింత ? భుట్టో షాకింగ్ ఆఫర్ బ్యాక్ ఫైర్ ?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకుంటున్న ఆపరేషన్ సింధూర్, సిందు జలాల నిలిపిపేత సహా పలు పరిణామాలు పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఉగ్రదేశంగా చూపిస్తూ భారత్ లేవనెత్తిన చర్చ వారిని ఆలోచనలో పడేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో తాజాగా అల్ జజీరా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ కోరుతున్న ఉగ్రవాదుల్ని ఆ దేశానికి అప్పగించేందుకు సిధ్దమన్నారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ తో తీవ్ర కలకలం రేపుతున్నాయి. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి తీవ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని భుట్టో చేసిన సూచనపై వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. భుట్టో వ్యాఖ్యల్ని హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ తో పాటు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఖండించాయి. భుట్టో ఆఫర్ ను పిల్ల చేష్టలుగా వీరు అభివర్ణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి, మరోవైపు భారత్ నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో భుట్టో వ్యూహాత్మకంగా ఇలా ఆఫర్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా బిలావల్ భుట్టో తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నారు. ఇలాంటి సమయంలో భుట్టో భారత్ కు ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అప్పగించాలంటూ లేవనెత్తిన చర్చ ఎటువైపుకు దారి తీస్తుందో తెలియడం లేదు.

అయితే అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ ఈ దిశగా ఆలోచన చేస్తుందా లేక మరో కుట్రలో భాగమా అన్న ప్రశ్నలు భారత్ లో వినిపిస్తున్నాయి. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ విషయంలో ఇప్పటికే పలు దేశాలు గుర్రుగా ఉన్నాయి. అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా వివిధ దేశాల మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ పంపిన రాజకీయ నేతల బృందానికి ప్రాతినిధ్యం వహించిన బిలావల్ భుట్టో ఇలా పాక్ ఉగ్రవాదుల్ని భారత్ కు అప్పగిస్తామని చెప్పడం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే వరుస విమర్శల నేపథ్యంలో భుట్టో ఏం చెప్పబోతున్నారనేది కూడా ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications