భీకర యుద్ధం- అట్టుడుకుతున్న ఇజ్రాయెల్
Iran-Israel War: ఊహించినట్టే- ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దండెత్తింది. భీకర యుద్ధానికి తెర తీసింది. డజన్ల కొద్దీ కట్యూషా రాకెట్లను సంధించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఎంతమంది మరణించి ఉండొచ్చనేది ఇంకా తెలియరావట్లేదు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉత్తరప్రాంతం అట్టుడికిపోతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. లెబనాన్‌పై భారీగా రాకెట్లను సంధించింది. లెబనాన్ భూభాగంపై గల కెఫార్ కిలా, డెర్ సిర్యాన్ ప్రాంతాలపై రాకెట్లను ప్రతిదాడికి దిగింది. ఇజ్రాయెల్‌తో సరిహద్దులను పంచుకునే ప్రాంతాలు ఈ రెండు కూడా. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒకరు మరణించారు. ఏడుమంది గాయపడ్డారు.

హెజ్బొల్లా.. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్. అక్కడ రాజకీయ పార్టీగానూ గుర్తింపు ఉంది. 1992లో హసన్ నష్రల్లా, అబ్బాస్-అల్-ముసావి, అలీ అక్బర్ మొహ్తా, సుభి అల్- తుఫాయిల్.. దీన్ని నెలకొల్పారు. మధ్య తూర్పు దేశాల్లో ఇస్లాంను మరింత బలంగా విస్తరించాలనేది దీని లక్ష్యం.
ఇరాన్.. హెజ్బొల్లాకు ముందు నుంచీ అన్నీ రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికీ ఇరాన్ సైనిక, ఆయుధ సామాగ్రిని సమకూర్చిందని చెబుతున్నారు. తేలికపాటి రాకెట్లను మోసుకెళ్లే సామార్థ్యం ఉన్న అత్యాధునిక డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఇదివరకే హెజ్బొల్లాకు అందించినట్లు అక్కడి మీడియా అంచనా వేసింది.
ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయిల్ హనియా ఇటీవలే టెహ్రాన్‌లో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఇస్మాయిల్‌తో పాటు ఆయన వ్యక్తిగత అంగరక్షకుడొకరు దుర్మరణం పాలయ్యారు. ఇస్మాయిల్ బస చేసిన ఓ భవనంపై గుర్తు తెలియని వ్యక్తులు భీకర దాడికి దిగారు. ఈ దాడి వెనుక ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగొచ్చనే ఆందోళన మొదటి నుంచీ ఉంది. మధ్య తూర్పు దేశాల గగనతలాన్ని మూసివేశారు. ఇతర దేశాలకు చెందిన పౌర, సైనిక విమానాలు ఈ మార్గంలో ప్రయాణించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భారత్ సైతం.. ఇజ్రాయెల్‌లో నివసించే తన దేశ ప్రజల కోసం అడ్వైజరీని ఇదివరకే జారీ చేసింది కూడా.
Palestinians in Jenin were able to cheerfully watch Hezbollah’s rockets while the Iron Dome tries to intercept them.
— Arya - آریا 🇮🇷🏴 (@AryJeay) August 3, 2024
According to reports, there are 3 confirmed impacrs in Beit Hillel. pic.twitter.com/3u5XbO8IFx
ఈ పరిణామాల మధ్య ఇరాన్ సహకారంతో హెజ్బొల్లా ఈ దాడికి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యాధునిక కట్యూషా రాకెట్ల వర్షాన్ని కురిపించింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌లోని మొషావ్ బీటీ హిల్లాల్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆస్తినష్టం అధికంగా సంభవించింది. ఎంత ప్రాణనష్టం ఎంతమేర ఉందనేది ఇంకా తెలియరావట్లేదు.












Click it and Unblock the Notifications