Squirrel politics: ఉడుత కేంద్రంగా వేడెక్కిన అమెరికా పాలిటిక్స్.. ఎందుకంత ఫేమస్, దాని స్టోరీ ఏంటి?
US elections: అమెరికా ఎన్నికల రణరంగంలో ఎదురుదాడి చేసేందుకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మాటల యుద్ధంలోకి కొత్తగా ఓ పెంపుడు జంతువు వచ్చి చేరింది. సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులర్ అయిన ఓ ఉడుత కేంద్రంగా ప్రస్తుతం అమెరికాలో రాజకీయం రాజుకుంది. ప్రచారానికి ఏదీ కాదు అనర్హం అన్న రీతిలో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాటి మద్ధతుదారులు రెండు వర్గాలుగా విడిపోయి సామాజిక మాధ్యమాల్లో రచ్చరచ్చ చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌లు మరియు డెమోక్రాట్‌లు.. వలసలు, ఆర్థిక వ్యవస్థ, ఇజ్రాయెల్-గాజా యుద్ధం వంటి వివిధ విషయాలపై ప్రధానంగా రాజకీయం చేస్తున్నారు. కాగా 'పీనట్'గా పిలవబడే ఉడత మరణాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకుని డొనాల్డ్ ట్రంప్ సహచరులు JD వాన్స్, ఎలాన్ మస్క్ వంటి వారు ప్రస్తుత ప్రభుత్వాన్ని, ఉపాధ్యక్షురాలు కమాలా హారిస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏడు సంవత్సరాల క్రితం న్యూయార్క్ లోని పైన్ సిటీలో మార్క్ లాంగో అనే వ్యక్తి ఈ ఉడుతను దత్తత తీసుకున్నాడు. కారు ఢీకొని పీనట్ తల్లి మరణించడాన్ని చూసిన తర్వాత అతడు దాన్ని తన సంరక్షణలోకి తీసుకున్నట్లు చెప్పాడు. మొదట పీనట్‌ని మళ్ళీ అడవికి పంపాలనుకున్నాడు కానీ అడవిలో బతకడానికి ఇబ్బంది పడడంతో తిరిగి ఇంటికి తెచ్చుకున్నట్లు వెల్లడించాడు. ఉడుత ఆహారం తినడం, ఇంట్లో అటూఇటూ తిరగడం వంటి వీడియోలు వైరల్ కావడంతో తన మరణానికి ముందు పీనట్ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంచలనం సృష్టించి వేలాది మంది అభిమానులను సంపాదించింది.
పలువురి ఫిర్యాదులతో అక్టోబర్ 30న న్యూయార్క్ పర్యావరణ పరిరక్షణ విభాగం (DEC) పీనట్ సహా మరో పెంపుడు జంతువు రాకూన్ ఫ్రెడ్‌ను లాంగో అనే వ్యక్తి ఇంటి నుంచి స్వాధీనం చేసుకుంది. నవంబర్ 1న DEC మరియు చెమంగ్ కౌంటీ ఆరోగ్య శాఖ పీనట్ మరియు ఫ్రెడ్‌ను చంపినట్లు ప్రకటించాయి. పీనట్ మరియు ఫ్రెడ్ మనుషులతో కలిసి జీవిస్తున్నందున రేబిస్ వ్యాధి వ్యాప్తి ప్రమాదం ఉందని, పైగా పీనట్ విచారణలో ఉన్న వ్యక్తిని కొరికిందని తెలిపారు. రేబిస్ కోసం పరీక్షించడానికి ఈ జంతువులను చంపాల్సి వచ్చినట్లు పేర్కొన్నాయి.
పీనట్‌ను చంపడం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. అనేకమంది ట్రంప్ మద్దతుదారులు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పీనట్ ఓ ఉడుత కావడం వల్లే చంపారని, ఓ నేరస్తుడిగా లేదా అక్రమ వలసదారుడుగా ఉంటే న్యూయార్క్ డెమోక్రాట్స్ అతడికి 5 వేల డాలర్లు మరియు ఒక సెల్ ఫోన్ ఇచ్చేవారని వ్యంగ్యంగా స్పందిచారు. ప్రభుత్వం ఓ అనాథ ఉడుతను అపహరించి చంపిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం దాయ హృదయం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇలా పెంపుడు జంతువులను వివాదాస్పద అంశంగా మార్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ప్రచార సమయంలో JD వాన్స్ మరియు ట్రంప్ ఓహియోలోని ఒక పట్టణంలో హైతీ వలసదారులు పెంపుడు పిల్లులను తింటున్నారని నిరాధార ఆరోపణలకు మద్దతిచ్చారు. ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన డిబేట్‌లోనూ స్ప్రింగ్‌ఫీల్డ్‌లో వారు కుక్కలను తింటున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు పిల్లులను భుజిస్తున్నారని ట్రంప్ తీవ్రంగా స్పందించారు.












Click it and Unblock the Notifications