శ్రీలంక సంక్షోభం- నేతలు విదేశాలకు పారిపోకుండా నిషేధం-మహీంద సహా 16 మందిపై బ్యాన్
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కారణంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆస్తుల విధ్వంసం, రాజకీయ నాయకులపై దాడులకు దిగుతున్న ప్రజల్ని కట్టడిచేసేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. అయినా నిరసనలు ఇంకా సద్దుగణగడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజీనామా చేసిన మాజీ ప్రధాని మహీంద రాజపక్స సహా పలువురు కీలక నేతలు దేశం విడిచి వెళ్లిపోకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది.
ఈ వారం కొలంబోలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన దాడికి సంబంధించి శ్రీలంక మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుమారుడు నమల్ రాజపక్స, మరో 15 మందిపై దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని శ్రీలంక కోర్టు ఇవాళ ప్రయాణ నిషేధం విధించింది. సోమవారం గోటగోగామా, మైనాగోగామా శాంతియుత నిరసన వేదికలపై జరిగిన దాడులపై జరుగుతున్న విచారణల కారణంగా ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు వారిని విదేశాలకు వెళ్లకుండా నిషేధించినట్లు తెలుస్తోంది. ఎంపీలు జాన్‌స్టన్ ఫెర్నాండో, పవిత్ర వన్నియారాచ్చి, సంజీవ ఎదిరిమన్నె, కాంచన జయరత్న, రోహిత అబేగుణవర్దన, సిబి రత్నయ్య, సంపత్ అతుకోరాల, రేణుకా పెరీరా, సనత్ నిశాంత, సీనియర్ డిఐజి దేశబందు తెన్నకోన్‌తో పాటు మరికొందరు ప్రయాణ నిషేధం ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు.

అటార్నీ జనరల్ 17 మంది వ్యక్తులపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కోర్టును కోరారు. దీంతో గోటాగోగామా, మైనగోగామాపై దాడులపై దర్యాప్తు కోసం శ్రీలంకలో వీరంతా హాజరు కావాల్సిన అవసరం ఉందని పేర్కొంది, ఆ దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణల్ని వీరంతా ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో దారుణ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో మహీందను తొలగించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు చేస్తుున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై మహింద రాజపక్సే మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంకలో హింస చెలరేగింది.












Click it and Unblock the Notifications