చైనాకు శ్రీలంక లక్ష కోతుల ఎగుమతి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక అంతరించిపోతున్న ఓ జాతికి చెందిన కోతులను చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తోంది. టోక్ మకాక్ కోతులను పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనపై అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర తమ శాఖ అధికారులను ఆదేశించారు.
చైనాలోని వెయ్యి జంతు ప్రదర్శనశాలలకు లక్ష కోతులను డ్రాగన్ దేశం కోరినట్లు మంత్రి మహింద అమరవీర తెలిపారు. తమ దేశంలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. చైనా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా ఉంటాయా? అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు కేబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించనున్నారు.

'టోక్ మకాక్' జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో వీటి సంఖ్య 30 లక్షలు దాటినట్లు అంచనా వేస్తున్నారు. స్థానికంగా పంటలను దెబ్బతీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి సంతతిని అరికట్టేందుకు శ్రీలంక ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనపడటంలేదు. ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వాటిని ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించారు. ఉచితంగానే ఇస్తారా? లేదంటే డబ్బులు తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications