శ్రీలంకలో కర్ఫ్యూ: ఇంటర్ నెట్ బంద్: వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ పై నిషేధం
కొలంబో: వరుసగా ఎనిమిది బాంబు పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో శ్రీలంకలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. చాలాచోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయంటూ వస్తోన్న నకిలీ వార్తలపై కన్నెర్ర చేసింది. వదంతులను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంది. ఇంటర్ నెట్ ను నిషేధించింది.
వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలపైనా వేటు వేసింది. ప్రస్తుతం శ్రీలంకలో సామాజిక మాధ్యమాలేవీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. రాజధాని కొలంబో సహా దేశవ్యాప్తంగా అక్కడ ఇంటర్ నెట్ పని చేయట్లేదని సమాచారం. కొన్ని ప్రత్యేకసంస్థలకు మాత్రమే ఆ వసతిని కల్పించినట్లు చెబుతున్నారు.

కొలంబో సహా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సోమవారం ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే- కర్ఫ్యూను పొడిగిస్తామని వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితులు చల్లారేంత వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. దాడుల అనంతరం నకిలీ ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయని, వాటిని విశ్వసించవద్దని అంటూ ఆ దేశ అంతర్గత భద్రతా మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది.
నకిలీ వార్తలను నిరోధించడానికి సోషల్ మీడియా వేదికలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించింది. పుకార్లను ఎవ్వరూ విశ్వసించవద్దని, ప్రజలను మరింత ఆందోళనకు దారి తీసేలా నకిలీ వార్తలు గానీ ఫొటోలను గానీ సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయొద్దని సూచించింది. వాటిని నిరోధించడానికి తాత్కాలికంగా నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications