భారత్ కు బయల్దేరిన ప్రధాని మోదీ.. ట్రంప్ మీటింగ్ హైలెట్స్ ఇవే..!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అమెరికా నుంచి భారత్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్ఢ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ , వివేక్ రామస్వామి తదితరులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. అంతకుముందు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు.
ట్రంప్ తో ప్రధాని మోదీ చర్చలు..
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. సుంకాలు, వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. భారత్ తో అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు. భవిష్యత్తులో భారత్-అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్-అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నామని అన్నారు. భారత్ కు అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది.. ఈ ఏడాది నుంచి భారత్‌కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామన్నారు.

మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్ వాల్జ్ తోనూ ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ భేటీలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications