ఎముకలు కొరికే చలిలో.. హిమాలయాల్లో తప్పిపోయి.. 10 రోజులుగా టూత్ పేస్ట్ తింటూ..
ఓ యువకుడు ట్రెకింగ్ చేసుకుంటూ హిమాలయాల్లో తప్పిపోయాడు. చుట్టూ మంచుకొండలు, ఎముకలు కొరికే చలిలో, ఊపిరి కూడా ఆడని పరిస్థితుల్లో.. తినడానికి ఏమీ లేక టూత్ పేస్ట్ తింటూ 10 రోజులు గడిపాడు. ఈ షాకింగ్ ఘటన చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో జరిగింది.
ఏం జరిగింది..?
చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ కు చెందిన 18 ఏళ్ల సన్ లియాంగ్ కు పర్వతారోహనం అంటే ఇష్టం. ట్రెక్కింగ్ లో భాగంగా ఆ యువకుడు చైనాలోని క్విన్లింగ్ పర్వతశ్రేణిని అధిరోహించాలని ఫిబ్రవరి 8 న ట్రెక్కింగ్ ప్రారంభించాడు. అయితే రెండు రోజుల తర్వాత లియాంగ్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ బ్యాటరీ ఐపోయింది. దీంతో అతనికి, అతని ఫ్యామిలీకి మధ్య సంబంధాలు తెగిపోయాయి.
దీంతో లియాంగ్ ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. పర్వతాల నుంచి కిందకు రావడం మొదలెట్టాడు. ఈ క్రమంలో చాలాసార్లు కింద పడి కాలు, చేయి ఫ్రాక్చర్ అయ్యాయి. ఓ పక్క కాలు, చేతి నొప్పి మరోపక్క తీవ్రమైన చలిగాలులు, మంచు దుప్పటి కావడంతో ఇంక నడవలేని పరిస్థితుల్లో అక్కడే ఓ పెద్ద రాయి కింద స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు లియాంగ్. చుట్టూ తినడానికి ఏమీ లేదు. కరిగిన మంచు నీటిని తాగుతూ.. తన వద్ద ఉన్న టూత్ పేస్ట్ తింటూ ఆకలిని దిగమింగాడు.

ఇక లియాంగ్ తల్లిదండ్రులు అతడి కోసం గాలింపు ప్రారంభించారు. లోకల్ గా ఉన్న ఓ నిపుణుడు, ఇతర 30 మంది సిబ్బంది సాయంతో రూ. 10లక్షలు ఖర్చు చేసి.. గాలించగా ఫిబ్రవరి 17న లియాంగ్ ఆచూకీ లభించింది. అతడ్ని విజయవంతంగా కాపాడారు. అనంతరం లియాంగ్ మాట్లాడాడు. " ఘటన తర్వాత నాకు భయం వేసింది. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ కు అనుకూలంగా లేదు. తీవ్రమైన గాలుల వల్ల ముందుకు వెళ్లలేకపోయాను. కళ్లు తెరవలేనంతగా మంచువర్షం కురిసింది" అని సన్ లియాంగ్ తెలిపాడు.












Click it and Unblock the Notifications